ఎర్రన్నల మధ్య ఏకాభిప్రాయం లేదా? సీపీఐ కేంద్ర కమిటీకి, తెలంగాణ కమిటీకి మధ్య సమన్వయ లోపం ఉందా? ఒక కార్యక్రమం విషయంలో పరస్పరం మాట్లాడుకోకుండా… ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారా? ఆయనో రకం, ఈయనో రకం అన్నట్టు రెండు కమిటీల్లోని ముఖ్యులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎందుకు వ్యవహరిస్తున్నారు? తెలంగాణ సీపీఐలో అసలేం జరుగుతోంది? హైదరాబాద్‌లో ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అలాగే… అంతకు ముందు రోజు.. ప్రొఫెసర్ సాయిబాబా చనిపోయారు. ఈ రెండు వ్యవహారాలను కలిపి సీపీఐ నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించిందన్నది తెలంగాణ రాజకీయవర్గాల్లో జరుగుతున్న తాజా చర్చ. ముఖ్యనాయకుల తీరు, ప్రకటనలు చూస్తుంటే… అసలు రాష్ట్ర కమిటీకి, కేంద్ర కమిటీకి మధ్య శృతులు కుదురుతున్నాయా అన్న అనుమానం కలుగుతోందట ఎక్కువ మందికి. ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి సంబంధించి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఓ వీడియో విడుదల చేశారు. ఆయన మరణానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని, అందులో భాగమైన దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కాబోమని ప్రకటించారు నారాయణ. సాయిబాబా అజెండా విషయంలో పార్టీకి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఆయన విషయంలో మాత్రం ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్నది నారాయణ అభిప్రాయం.
సరే… అంత వరకు బాగానే ఉంది. అది సీపీఐ స్టాండ్ అనుకుంటున్న టైంలోనే కథ కీలక మలుపు తిరిగింది. అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరవబోమని జాతీయ కార్యదర్శి చేసిన ప్రకటనతో సంబంధం లేకుండానే.. ఆ వేదిక మీద ప్రత్యక్షం అయ్యారు పార్టీ తెలంగాణ కార్యదర్శి కూనమనేని సాంబశివరావు. దీంతో కొత్త చర్చకు తెరలేచింది. అంటే… ఒక విషయంలో సీపీఐ రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలకు వేర్వేరు అభిప్రాయాలు ఉంటున్నాయా? ఒకే పార్టీలో ఢిల్లీ నాయకత్వం ఒకలాగా, హైదరాబాద్ నాయకత్వం మరోలా ఆలోచిస్తున్నాయా? అసలు కామ్రేడ్స్ మధ్య ఈ వైరుధ్యాలు ఎందుకు వస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. కూనమనేని సాంబశివ రావు…కేవలం అలయ్ బలయ్‌కి వెళ్ళి వచ్చినా అది వేరే సంగతి. వ్యక్తిగతం అని చెప్పుకోవడానికన్నా అవకాశం ఉండేదిగానీ…. అక్కడ ప్రసంగించి దత్తాత్రేయను ఆకాశానికి ఎత్తేయడంతో తెలంగాణ సీపీఐలో అసలేం జరుగుతోందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. దత్తాత్రేయ ప్రయత్నాన్ని సీపీఐ ఆహ్వానిస్తోందని చెప్పడంతో అసలు సమస్య మొదలైందంటున్నారు. దీంతో సీపీఐలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయా..? లేదంటే సమన్వయ లోపామా..? అన్న అనుమానాలు పెరుగుతున్నాయట. అయితే ఈ ఎపిసోడ్‌లో నారాయణకి, రాష్ట్ర కార్యవర్గానికి మధ్య సమాచారం లోపం ఉన్నట్టు తర్వాత పార్టీలో చర్చ జరిగిందట. సాయిబాబా విషయంలో జాతీయ నాయకత్వం తరపున నారాయణ తన అభిప్రాయాన్ని చెప్పారని, అక్కడే సమాచార లోపం ఉన్నట్టు మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. కారణం ఏదైనా…. అలయ్ బలయ్ ప్రోగ్రామ్ మాత్రం కామ్రేడ్స్ మధ్య అభిప్రాయ భేదాలకు వేదికైంది. ఇది కేవలం కమ్యూనికేషన్ గ్యాపేనా? లేక నిజంగా రాష్ట్ర, కేంద్ర కమిటీల్లోని నేతల మధ్య పైకి కనిపించనివి ఇంకేమైనా ఉన్నాయా అన్నది కూడా చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.