తెలంగాణ పొలాల్లో పొలిటికల్ పేలాలు వేగుతున్నాయా? రైతుల అవసరాల చుట్టూ రాజకీయం రక్తి కడుతోంది తప్ప…. పని మాత్రం జరగడం లేదా? ఏ విషయంలో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మూడు ముక్కలాట ఆడుతున్నాయి? తప్పు మీదంటే మీదేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పరస్పరం నెపం నెట్టుకుంటున్నాయి? రైతుల చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? తెలంగాణలో పొలాలకు వేసే ఎరువులు పొలిటికల్ కలర్ పులుముకుంటున్నాయి. రైతులకు సరిపడా సరఫరా సంగతి ఎలా ఉన్నా… రాజకీయ పార్టీలు మాత్రం మస్త్ మస్త్ స్టేట్‌మెంట్స్‌తో మైలేజ్ రేస్‌లో స్పీడ్‌గా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన మేరకు ఎరువుల సరఫరా జరగడం లేదని కాంగ్రెస్ అంటోంది. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం సరిపడా మేం పంపుతూనే ఉన్నాం… అయినా ఉద్దేశ్యపూర్వకంగా బద్నాం చేస్తున్నారంటూ రివర్స్ అవుతున్నారు. మీ రాజకీయాలు కట్టిపెట్టి… ముందు రైతులకు ఎలా మేలు చేయాలో చూడండని మరో ప్రతిపక్షం బీఆర్‌ఎస్ వాయిస్ రెయిజ్ చేయడంతో…. పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా యూరియా షార్టేజ్ విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అక్టోబర్ ఒకటి – ఫిబ్రవరి 20 మధ్య కేంద్రం నుంచి 8 లక్షల 54వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు పంపింది. కానీ… కేంద్రం నుంచి 6లక్షల73వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయిందని చెబుతున్నారు తెలంగాణ వ్యవసాయశాఖ అధికారులు. రాష్ట్రానికి వారం రోజుల్లో మరో 81వేల 800 టన్నుల యూరియా వస్తుందని, రైతులు కంగారు పడవద్దని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ఓవైపు భరోసా ఇస్తున్నా… రైతుల్లో మాత్రం కంగారు తగ్గడం లేదట. ఇదే సమయంలో పొలిటికల్ స్టేట్‌మెంట్స్ ఇంకా టెన్షన్ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్షా 60వేల టన్నుల యూరియాను తక్కువగా పంపినా…రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో మార్క్ ఫెడ్ దగ్గర ఉంచిన స్టాక్‌ను అవసరమైన మేరకు అన్ని జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికి సంబంధించిన బిజెపి పెద్దలు కూడా ఈ విషయంలో విమర్శలు మాని అవసరమైన ఎరువులను వెంటనే రప్పించేలా చూడాలని కోరుతున్నారు కాంగ్రెస్ నాయకులు.
గత యాసంగిలో సాగైన పంటల విస్తీర్ణంతో పోల్చుకుంటే, ఈ సారి భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో వరి, మొక్కజొన్న పంటల విస్తీర్ణం 5 నుండి 10 శాతం పెరిగిందని, ఆమేరకు యూరియా వాడకం కూడా పెరిగిందని అంటున్నారు వ్యవసాయశాఖ మంత్రి. కేంద్రం నుంచి సరిపడా రాకున్నా… రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలతో బండి నెట్టుకొస్తున్నట్టు చెబుతున్నారు కాంగ్రెస్ ముఖ్యులు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే… రామగుండం ఫెర్టిలైజర్స్‌లో తరచూ సాంకేతిక సమస్యలు వస్తూ… ఉత్పత్తికి ఆటంకం కలుగుతోందని, అదే తెలంగాణ రైతులకు పెద్ద శాపంగా మారిందని అంటోంది కాంగ్రెస్. అయితే దీన్ని బీజేపీ నాయకులు కూడా గట్టిగానే కౌంటర్ చేస్తుండటంతో… ఎరువుల వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. తెలంగాణలో యూరియా, ఇతర ఎరువుల కొరతే లేదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ వల్లే కృత్రిమ కొరత ఏర్పడిందని విమర్శిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2024-25 రబీ సీజన్‌లో తొమ్మిదిన్నర లక్షల టన్నుల యూరియా అవసరమైతే… కేంద్రం 10 లక్షల టన్నులు పంపిందని గుర్తు చేస్తున్నారాయన. నిరుటితో పోలిస్తే… ఈసారి 27 శాతం అధికంగా సరఫరా చేశామని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారన్నది బీజేపీ వెర్షన్. మరోవైపు ప్రస్తుత పరిస్థితిపై బీఆర్‌ఎస్ కూడా ఫైరైపోతోంది. యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గమని అన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. యూరియా కోసం పోలీసులు టోకెన్లు పంపిణీ చేయడం, రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు, చెప్పుల్ని క్యూలో పెట్టి ఎదురు చూడాల్సి రావడాన్ని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా కాక ఇంకెలా చూడాలన్నది గులాబీ పార్టీ క్వశ్చన్. ఇలా…. యూరియా విషయంలో తెలంగాణ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు రైతులు మాత్రం మీ రాజకీయాల సంగతి తర్వాత ముందు మాకు సరిపడా యూరియా ఇవ్వండి మహాప్రభో అని మొత్తుకుంటున్నారట. రాజకీయం రాజకీయంలాగే మిగిలిపోతుందా లేక రైతుల అవస్థలు తీరతాయా అన్నది చూడాలి మరి.