NTV Telugu Site icon

Off The Record: ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ నేతల ఆశలు

Otr Congress

Otr Congress

Off The Record: ఎమ్మెల్సీ సీట్ల కోసం అప్పుడే లాబీయింగ్ మొదలైందా ? మండలిలో ఖాళీ అవ్వబోతున్న సీట్లకు డిమాండ్ పెరిగిందా ? కొందరు కేబినెట్ విస్తరణ మీద ఆశలు పెట్టుకున్నారా ? మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు…ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా ? పార్టీ కోసం కష్టపడిన, సీట్లు త్యాగం చేసిన వారికి…పార్టీ గుర్తింపు ఇస్తుందా ? రేసులో ఉన్న నేతలు ఎవరు ?

తెలంగాణలో వచ్చే ఆరు నెలల్లో 9 శాసన మండలి సీట్లు ఖాళీ అవబోతున్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారు…అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సీట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా…చెప్పుకోలేక పోవడంతో రెండు పర్యాయాలు అధికారంలోకి రాలేకపోయింది. 9 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో….పలువురు పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు. అయితే బీఆర్ఎస్‌ హయాంలో కాంగ్రెస్‌కు అండగా నిలబడిన వారు… మండలి సీటుపై ఆశలు పెట్టుకుంటున్నారట. ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన వారు…సీట్లు త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌ భావిస్తోందట. కాంగ్రెస్‌లో చాలా రోజులుగా ఏదో ఒక కారణంతో…పదవులు రాకుండా పోయిన వాళ్ళు కూడా పార్టీనే నమ్ముకొని ఉన్నారు. దీంట్లో ముందు వరుసలో.. అద్దంకి దయాకర్ ఉన్నారు. నల్గొండ జిల్లా పాలిటిక్స్‌లో ఆయన నలిగి పోతున్నారు. రెండుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి…స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీని అట్టిపెట్టుకొనే ఉన్నారు.

పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతరావు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి మహ్మద్‌ షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్…మండలి సీటుపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు చెక్ పెట్టడానికి…కెకె మహేందర్ రెడ్డిని మండలికి పంపితే ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. అక్కడ చాలా రోజులుగా కేటీఆర్‌ను ఎదుర్కొంటున్న కేకే మహేందర్‌రెడ్డికి…ఎమ్మెల్సీ పదవి ఇస్తే పార్టీకి కూడా కలిసి వస్తుందని నేతలు అభిప్రాయపడుతున్నారట. మరో మైనార్టీ నేత ఫాయిమ్ ఖురేషి కూడా…ఎమ్మెల్సీ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి పుష్పలీల, మాజీ ఎంపీ అజారుద్దీన్, నాంపల్లిలో ఓటమి పాలయిన ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్లంతా ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఎమ్మెల్సీ సీటు ఖరారు చేస్తుందనేది చూడాలి మరి. ఐతే కాంగ్రెస్‌లో ఇవాళ చర్చలో ఉన్న పేర్లు రేపు ఉండవు… అనే టాక్ ఉంది. చూడాలి మరి..! ఎవరికి ఎమ్మెల్సీ సీట్లు వరిస్తాయి అనేది.

Show comments