Site icon NTV Telugu

Off The Record: కాంగ్రెస్‌ ఐదేండ్లు కొనసాగాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారా ? దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి ?

Congress Otr

Congress Otr

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా… ఐదేళ్ళు నిక్షేపంగా కొనసాగాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారా? అవును… మీరేం తప్పుగా వినలేదు. ముమ్మాటికీ నిజమే. రేవంత్‌రెడ్డి సర్కార్‌ నిక్షేపంగా పూర్తి టర్మ్‌ పవర్‌లో ఉండాలని, ఆయుష్మాన్‌భవ అంటూ…. స్వయంగా గులాబీ దళపతే దీవించారట. ఇదేదో… వినడానికి బాగున్నట్టు అనిపిస్తోందిగానీ… ఎక్కడో తేడా కొడుతోందని అనుకుంటున్నారా? ఎస్‌… మీ డౌట్‌ నిజమే. ఆ తేడా ఏంటో చూసేయండి. తెలంగాణలో పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి 16 నెలలవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో జీరోకు పరిమితం కాగా…. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో అసలు పోటీ కూడా చేయలేదు. కానీ…. అదే గులాబీ పార్టీ….ఇప్పుడు స్వరం మార్చింది. ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా… గెలుపు మాదేనంటూ ధీమాగా మాట్లాడుతున్నారు ఆ పార్టీ లీడర్స్‌. అదీ కూడా ఎవరో కాదు… సాక్షాత్తు పార్టీ అధినేత కేసీఆర్‌ తనను కలిసిని కొందరు నాయకులతో ఈ మాటలు అన్నారట. ఈసారి గెలుపు మనదేనని ఆయన అనడంతోపాటు….తేలిగ్గా గెలవాలంటే…. రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి పదవీకాలం కొనసాగాలని, వచ్చే మూడున్నరేళ్ళు కూడా కాంగ్రెస్‌ పూర్తిగా ఇలాగే పరిపాలిస్తే… అప్పుడు మన విలువేంటో జనానికి తెలుస్తుందని అన్నారట కేసీఆర్‌. కాంగ్రెస్‌ సర్కార్‌ ఆయుష్మాన్‌భవ అంటూ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అనడం చూసి… అక్కడున్న నాయకులు కొందరు అవాక్కయినా… ఆ మాటల వెనక మేటర్‌ చాలానే ఉందంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌.. కొత్త పథకాలు తెచ్చామని చెప్పుకుంది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ మాత్రమే సరికొత్త సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అప్పట్లో చెప్పేవారు గులాబీ నేతలు. కేంద్రం కూడా తెలంగాణలో కేసీఆర్‌ తీసుకొచ్చిన పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా ప్లాన్ చేసిందని కూడా ప్రచారం చేసేవారు. అంతలా చెప్పుకున్నా….గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీఆర్ఎస్‌ను తిరస్కరించారు. ఆ

రు గ్యారెంటీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అదే ఇప్పుడు తమకు అస్త్రం అవుతుందని అంటున్నారట కేసీఆర్‌. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా విఫలం అవుతుందన్నది కేసీఆర్‌ అంచనాగా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ముఖ్యంగా రైతులకు రుణమాఫీని వంద శాతం చేయలేదని, అందరు రైతులకు రైతు భరోసా పేరిట ఎక్కువ డబ్బులు ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదని భావిస్తున్న బీఆర్‌ఎస్‌… ఆ అంశాలను జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే…. మహిళలకు 2వేల500, వృద్ధాప్య పెన్షన్‌ పెంపు లాంటి హామీలేవీ అమలవకపోవడంతో…. ఇప్పుడు ప్రజల్లో సరికొత్త చర్చ మొదలైందని అంటున్నారు బీఆర్‌ఎస్‌ నాయకులు. గతంలోని తమ ప్రభుత్వాన్ని, ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కార్‌ని పోల్చి చూసుకోవడం మొదలైనందున…. ఈ చర్చలు ఇలాగే కొనసాగడం తమకే మంచిదన్నది గులాబీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు…ఎలాంటి ఆటంకాలు లేకుండా పథకాలు అమలు చేశామని, ఇప్పుడు అలా జరగడం లేదన్నది బీఆర్‌ఎస్‌ లీడర్స్‌ అభిప్రాయం అట. కేసీఆర్‌ కూడా తనతో సమావేశమయ్యే లీడర్స్‌తో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షంగా మనం జనంలోకి వెళ్లి కొట్లాడాలిగానీ…లోపలే కూర్చుంటే నెగిటివిటీ ఎలా పెరుగుతుందని ఒకరిద్దరు కేసీఆర్‌ దగ్గర ప్రస్తావించినట్టు సమాచారం. అందుకు రియాక్షన్‌గా ఆయన అన్న మాటల చుట్టూనే ఇప్పుడు చర్చ మొదలైంది. మనం ఇప్పుడే ఆవేశపడనవసరం లేదు….కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తే చాలు… అప్పుడు ప్రజలకు మన విలువ తెలుస్తుంది… పూర్తి కాలం వాళ్ళని కొనసాగనివ్వండని అన్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ…ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ నాయకుల్లో మరో చర్చ కూడా జరుగుతోందట. ఇలా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలోనే జనాల్లోకి వెళితే కరెక్ట్‌గా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది… అది మనకు లాభం అవుతుంది అనుకుంటూ…ఇంట్లో కూర్చుంటే కుదరదని పార్టీలోని ఓ వర్గం అంటోందట. ప్రభుత్వం మీద మనం ఊహిస్తున్న స్థాయిలో వ్యతిరేకత లేదని, ఒకవేళ ఉన్నా… మనం బయటికి వెళ్లి చెప్పకపోతే ఆ ఓటు బ్యాంకును బీజేపీ తన్నుకుపోయే ప్రమాదం ఉందన్నది ఆ వర్గం లెక్కగా తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ పథకాలతో పోల్చుకొని జనం తిరిగి తమ వైపు వస్తే బాగుంటుంది కానీ.. ఎన్నికల నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడమో…. లేదంటే అంతకు మించిన స్కీమ్స్‌తోబీజేపీ వేగం పెచితేనో… తాము నోరెళ్ళబెట్టి చూడాల్సి వస్తుందని, కాబట్టి ఇనుము వేడెక్కినప్పుడే సమ్మెట పోటు పడాలన్నది కొందరు గులాబీ నేతల మాట. కేసీఆర్‌ ఆయుష్మాన్‌భవ దీవెనలు కాంగ్రెస్‌కు ఎలా పనిచేస్తాయో, గులాబీకి ఎలా వర్కౌట్‌ అవుతాయో చూడాలి మరి.

Exit mobile version