NTV Telugu Site icon

Off The Record: ఎస్సీ వర్గీకరణకు మొదట్నుంచి మద్దతు.. సరిగా వాడుకోలేకపోయామని బీఆర్‌ఎస్‌లో బాధ?

Otr Brs

Otr Brs

Off The Record: చేతికి అంది వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకోలేక పోయామని బీఆర్‌ఎస్‌ ముఖ్యులు తీరిగ్గా బాధపడుతున్నారా? ఊపు వచ్చినప్పుడు స్పందించడం మానేసి అంతా అయిపోయాక తెగ ఫీలైపోతున్నారా? నాడు అధికారంలో ఉన్నప్పుడు తాము సపోర్ట్‌ అంశానికి ఇప్పుడు సానుకూల రిజల్ట్‌ వచ్చినా ఓన్‌ చేసుకోలేని దుస్థితిలో ఉందా బీఆర్‌ఎస్‌? ఇంతకీ ఏంటా వ్యవహారం? ఎలాంటి రిజల్ట్‌ వచ్చింది?

దాదాపు 30 ఏళ్ళ నుంచి తెలుగు రాజకీయాల్లో ఎప్పటికప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్న ఎస్సీ వర్గీకరణ వ్యవహారం సుప్రీం కోర్ట్‌ తీర్పుతో దాదాపుగా కొలిక్కి వచ్చినట్టేనంటున్నారు.ఈ వర్గీకరణకు ఇన్నాళ్ళు మద్దతు తెలుపుతూ వచ్చాయి వివిధ రాజకీయ పార్టీలు. రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ కూడా నాడు వర్గీకరణ కోసం గట్టిగానే కొట్లాడింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాతా… మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ ఉద్యమాన్ని నడిపించిన ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో కలిసి నడిచారు. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. కేసీఆర్‌ కూడా ఎమ్మార్పీఎస్‌ ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించారు. ఇక బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఎస్సీ విభజనకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది తెలంగాణ అసెంబ్లీ. ఆ తీర్మానాన్ని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీకి అందించింది నాటి కేసీఆర్ బృందం. కొన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా… తాము మాత్రం వర్గీకరణకే కట్టుబడి ఉన్నామని నాడు ప్రకటించింది బీఆర్‌ఎస్‌ అధిష్టానం. సుప్రీంకోర్టులో ఉన్న అంశం త్వరగా తేలేలా చర్యలు తీసుకోమని కేంద్రాన్ని పదేపదే కోరింది. ఇలాంటి పరిస్థితుల్లో…ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది.

కానీ… దీని కోసం గతంలో తాము ఎంత కృషి చేశామో.. సరిగా చెప్పుకోలేకపోతున్నామని, జనంలోకి తీసుకువెళ్ళలేకపోయామని ప్రస్తుతం తెగ బాధపడిపోతున్నారట బీఆర్‌ఎస్‌ నేతలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమవల్లే వర్గీకరణ సాధ్యమైందని చెప్పుకుంటున్నా… మనం ఆ స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయామన్న అంతర్మథనం జరుగుతోందట పార్టీలో. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని కూడా ప్రవేశ పెట్టింది కాంగ్రెస్‌ సర్కార్‌. ఎస్సీ ఏబీసీడీకి అనుకూలంగా తాము గట్టి ప్రయత్నాలు చేశామంటూ ఆ చర్చలో చెప్పారు కాంగ్రెస్‌ నేతలు. కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌ మాత్రం ధన్యవాద తీర్మాన చర్చలో సరిగా పాల్గొనలేదు. సభ బయట కూడా పార్టీ తరపున హడావుడి చేయలేదు. ఇదే తమకు మైనస్ అయిందని ఇప్పుడు బాధపడుతున్నట్టు తెలిసింది. నాడు వర్గీకరణ కోసం ప్రత్యేక తీర్మానం చేసినా ప్రస్తుతం చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారట గులాబీ నేతలు. వర్గీకరణకు తాము మొదటి నుంచి అనుకూలంగానే ఉన్నామని, మాదిగల తరపున పోరాటం చేసింది కూడా తామేనని ఎక్స్‌ మెసేజ్ పెట్టారు కేటీఆర్. అధినాయకత్వం ఇలా సందేశాలకు పరిమితమైంది తప్ప క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో క్రెడిట్‌ ఇతర పార్టీల ఖాతాలోకి వెళ్లిందన్నది బీఆర్‌ఎస్‌ ద్వితీయ శ్రేణి బాధగా చెప్పుకుంటున్నారు. ఎస్సీ ఉప కులాల జనాభా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నందున జాతీయ పార్టీలు ఆచితూచి స్పందించాయి. కానీ… ఎస్సీల్లో మాదిగ సామాజికవర్గమే అత్యధికంగా ఉన్న తెలంగాణలో బయటికి వచ్చి ఎందుకు క్రెడిట్‌ ఓన్‌ చేసుకోలేకపోయామన్నది కారు పార్టీ నేతల బాధగా తెలిసింది.

 

 

Show comments