NTV Telugu Site icon

Off The Record : BRS MLA’s Hit List లో ఉన్నారా..? CM Revanth Reddy వార్నింగ్ ఎందుకు ఇస్తున్నారు ?

Brs Oitr

Brs Oitr

ఉమ్మడి రంగారెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పొలిటికల్‌ హిట్‌ లిస్ట్‌లో ఉన్నారా? సీఎం పదేపదే కొందరి పేర్లు ప్రస్తావించి మరీ ఎందుకు వార్నింగ్‌ ఇస్తున్నారు? దాని వెనక భవిష్యత్‌ వ్యూహం ఉందా? లేక ప్రస్తుత పొలిటికల్‌ ఫ్రస్ట్రేషన్‌ ఉందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చర్యలతో హైడ్రా పై వ్యతిరేకత వస్తున్నట్టు ప్రభుత్వం భావిస్తోందా? అసలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం అవుతున్నారట. గడిచిన పది నెలలుగా అడపాదడపా నిరసన కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యేలు… ఇకపై ఉద్యమాల దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది.
అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను టార్గెట్‌ చేస్తున్నారంటూ వాపోతున్నారట పలువురు గులాబీ శాసనసభ్యులు. సదుద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న మూసీ పనులకు ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని ముఖ్యమంత్రి పదే పదే అంటున్నారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల పేర్లు పెట్టి మరీ విమర్శిస్తున్నారు సీఎం. అసెంబ్లీ సాక్షిగా గతంలో రేవంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మధ్య గతంలో మాటల యుద్ధం జరిగింది. అప్పట్లో అది పెద్ద రచ్చ అయింది. తాజాగా డిజిటల్ కార్డ్స్ లాంచింగ్ ప్రోగ్రాంలో కూడా సబిత ప్రస్తావన తీసుకువచ్చి మీ ఫామ్‌హౌస్‌లు ఎక్కడున్నాయో తెలుసా అంటూ…వార్నింగ్‌ ఇచ్చారు సీఎం. మరోవైపు మామ, అల్లుళ్ళు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలను వారి కాలేజీల నిర్మాణాలపై ఇప్పటికే హెచ్చరించారు. రాబోయే విద్యా సంవత్సరంలోపు చెరువులు, కుంటల్లో కట్టిన కాలేజీల్ని కూల్చేయాలన్న ఆదేశాలున్నాయి. మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, శంభిపూర్ రాజు చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించారని… వారి అనుచరులకు ప్రభుత్వ భూములను అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ వర్గాల నుంచి. అయితే మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా బాధితులకు అండగా నిలుస్తున్నందునే వాళ్ళని టార్గెట్‌ చేస్తున్నారంటూ…ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోందట. కాంగ్రెస్లోకి రాకముందు నుంచి సబిత కుటుంబంతో కలిసిమెలిసి తిరిగిన రేవంత్.. ఒక్కసారిగా ఎందుకు రివర్స్ అయ్యారు ? ఆమె కొడుకు కార్తీక్ తో ఏదైనా వ్యవహారం బెడిసికొట్టిందా? లేక కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని చెప్పి రాలేదని కోపం పెంచుకున్నారా? అదీఇదీ కాకుండా కాంగ్రెస్‌లో చేరాలనుకున్న కొందర్ని ఆపినందుకు టార్గెట్‌ చేస్తున్నారా అంటూ… రకరకాల ఊహాగానాలతో మాట్లాడుకుంటున్నాయి రంగారెడ్డి రాజకీయ వర్గాలు.

మరోవైపు టీడీపీలో రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి కలిసి పని చేశారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి… నాటి విపక్ష నేతగా ఆయన్ను గట్టిగానే విమర్శించారు. మల్లారెడ్డి కూడా అంతే స్థాయిలో రేవంత్ రెడ్డికి అప్పట్లో వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీల వ్యవహారంలో ప్రభుత్వం కూల్చివేతలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారట. ప్రతిపాదిత ఫోర్త్ సిటీ మేజర్ పార్ట్ మహేశ్వరం నియోజకవర్గంలోకి వస్తుంది. ఆ క్రమంలోనే మహేశ్వరం కాంగ్రెస్ నేతలను రేవంత్ తరుచూ పిలిపించి మాట్లాడుతున్నారు. అంతే కాకుండా ఇటీవల హైడ్రా, మూసీ సుందరీకరణ అంశాలపై సబితారెడ్డి, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి బాధితులను కలవడం, వారికి సపోర్ట్ గా పోరాటం చేయడం రేవంత్ కి కోపం తెప్పిస్తోందని అంటున్నారు. అందుకే సీఎం డైరక్ట్‌గా సబితారెడ్డితో సహా పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై డైరెక్ట్‌ అటాక్‌ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. మొత్తంగా ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్న రేవంత్, సబిత, ఇతర నేతలు ఇప్పుడు శత్రువులుగా మారడం ఉమ్మడి రంగారెడ్డిలో హాట్ టాపిక్ అయింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని అంటారు. గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా రేవంత్, కార్తీక్ మధ్య రాజకీయ సమీకరణాలలో ఏమైనా మార్పులు వస్తాయా? ఇంకేవో కొత్త సమీకరణల్ని చూస్తామా అని కూడా గుసగుసలాడుకుంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు.