NTV Telugu Site icon

Off The Record : టార్గెట్ కాంగ్రెస్..దసరా తర్వాత బీఆర్ఎస్ లో పదవుల పందేరం

Kcr Brs

Kcr Brs

అధికారంలో ఉన్నప్పుడు ఆ అవసరం రాలేదు. ప్రతిపక్షంలోకి వచ్చాక అక్కెరకొచ్చింది. అందుకే సెట్ చేసే పనిలో పడ్డారు. రండి బాబూ రండి.. కార్యకర్తలను ఉత్తేజపరిచే పనిలో పడ్డారట. దసరా తర్వాత గులాబీశిబిరంలో పందేరమే అంటున్నారు. డిసెంబర్‌లో గులాబీ బాస్ ఫాంహౌజ్ వీడుతారని చెబుతున్నారు! కాంగ్రెస్ ప్రభుత్వానికి యేడాది టైం ఇచ్చిన తర్వాత ఎటాక్ చేద్దామనే వ్యూహంలో బీఆర్‌ఎస్ ఉందట! ఆ క్రమంలోనే పార్టీ రూట్‌ లెవల్లో సెట్ చేద్దామనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న కమిటీలకు త్వరలో మోక్షం కలగబోతుందని పార్టీ వర్గాలంటున్నాయి. పండుగ తర్వాత బీఆర్‌ఎస్‌లో పదవుల పందేరం జరగబోతోందని టాక్. ప్రతిపక్ష పాత్రలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రస్తుతం బక్కచిక్కినట్టు కనిపిస్తోంది. ఓడిపోయిన ఎమ్మెల్యేల్లో కొందరు గ్రౌండ్‌లో లేరు. గెలిచినవారిలో కొందరు టచ్‌లో లేరట. వారివారి అనుచరులంతా తలోదిక్కయ్యారని చెప్పుకుంటున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు పిలిస్తేచాలు జెండా మోసిన జనం.. ఇప్పుడు అంతగా ఇంట్రస్ట్ చూపించడం లేదట. కారణం.. ఆనాడు ఏ కమిటీలు వేయలేదని.. అధినేత ఎవరినీ కలవలేదని కేడర్‌ నిరాశలో ఉందట. అందుకే అప్పుడు వేయని కమిటీలు, అప్పుడు ఇవ్వని పార్టీ పదవులను ఇప్పుడు ఇవ్వాలని పార్టీ చూస్తోందని అంటున్నారు.

ఉద్యమ సమయం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ 2022లో భారత రాష్ట్ర సమితిగా మారింది. పార్టీ పేరు మారినా, కమిటీ మాత్రం పాతదే కొనసాగిస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్‌లో ఉన్న కార్యవర్గమే బీఆర్‌ఎస్‌లోనూ కంటిన్యూ అవుతోంది. అది కూడా 2017 నాటి బాడీ! అంటే దాదాపు 8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన కార్యవర్గమది. మొన్నటి వరకు అధికారంలో ఉంది కాబట్టి పార్టీ కార్యవర్గంతో పని అంతగా ఉండేది కాదు. పార్టీ ఏర్పాటు చేసే ఏ కార్యక్రమైనా మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి చూసుకునే వారు. తెలంగాణ భవన్‌లో కూడా చాలా తక్కువగా యాక్టివిటీస్ జరిగాయి. కాబట్టి కార్యవర్గంతో పార్టీకి అంతగా అవసరం లేకుండా పోయింది. దీంతో కమిటీ ఏర్పాటును ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది అధిష్టానం. ప్రస్తుతం పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి పోరాటం జనాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి చాలా కీలకం. ఎక్కువ స్థానాలు గెలవాలి అంటే కార్యవర్గాన్ని బలోపేతం చేయాలి. గత ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత కూడా చాలా మంది పార్టీ మారిపోయారు.

ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో ఎవరున్నారు.. ఎవరు లేరు అనే విషయంపై క్లారిటీ లేదు. అందుకే గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు కొత్త బాడీని ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. ఒకవేళ గ్రామస్థాయి, జిల్లాస్థాయి కమిటీలు ఆలస్యం అవుతాయని అనుకుంటే, మొదట రాష్ట్రస్థాయి కమిటీలు వేయాలని అనుకుంటున్నారట. అవి వేయడం ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేసే వారి సంఖ్యను పెంచుకోవచ్చని ఆలోచిస్తున్నారట. స్టేట్ లెవల్ కమిటీ అతి త్వరలో.. అంటే దసరా తర్వాత ఏర్పాటు చేయబోతున్నారని పార్టీలో సీనియర్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర కార్యవర్గంతో పాటు కొన్ని విభాగాలకు అధ్యక్షులను నియమించబోతున్నట్టు తెలుస్తోంది. విద్యార్థి, మహిళా, బీసీ, మైనారిటీ, కార్మిక విభాగాలకు సంబంధించి కమిటీలు వేయాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అన్నీ పండుగ తర్వాతే అంటున్నారు. పార్టీలో ఏదో పదవి దక్కకపోదా అని పార్టీనే నమ్ముకున్న నేతలు ఆశ పడుతున్నారు. చూడాలి మరి .. ఎంతమందికి పదవులొస్తాయో! ఎన్నికమిటీలు వేస్తారో!

Show comments