NTV Telugu Site icon

Off The Record : బీఆర్ఎస్ పోగొట్టుకున్నది ఎక్కడ..? స్థానిక సంస్థలకు ఏం చేయాలనుకుంటున్నారు..?

Brs Otr

Brs Otr

బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నాయా? దెబ్బ ఎక్కడ పడిందో ఇన్నాళ్ళకు తెలిసొచ్చిందా? కోలుకోవడం కోసం మొదలుపెట్టిన ప్యాచ్‌ వర్క్‌ ఏంటి? అది ఎంత వరకు వర్కౌట్‌ అయ్యే అవకాశం ఉంది? అసలు బీఆర్‌ఎస్‌ పోగొట్టుకున్నది ఎక్కడ? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేయాలనుకుంటోంది ఆ పార్టీ? తెలంగాణలో బీసీ జనాభా దాదాపు 56 శాతం. ఎన్నిక ఏదైనా ఇక్కడ డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌ మాత్రం బీసీలే. అయితే… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వాస్తవాన్ని విస్మరించడంవల్లే… పవర్‌కు దూరమయ్యామంటూ తమ చేతులు కాలి, చెయ్యి పార్టీకి అధికారం వెళ్లాక కాస్త ఆలస్యంగా గ్రహించిందట బీఆర్‌ఎస్‌. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల్లో ఎక్కువ మంది తమ వెంట నడవలేదని, అందుకే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని, ఆ ఎఫెక్ట్‌తోనే కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయామంటూ ఆ పార్టీ నేతలు తెగ బాధపడిపోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ప్యాచప్‌ వర్క్‌ మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలను తమ వైపునకు తిప్పుకోవాలని గులాబీ పార్టీ ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. వాతావరణాన్ని అనుకూలంగా మల్చుకోవడానికి అనువైన అంశం కోసం చూస్తూ…ఇప్పుడు బీసీ కుల గణన టాపిక్‌ని అందుకుందట పార్టీ. అసలు రాష్ట్ర జనాభాలో బీసీలు ఎంత మంది ఉన్నారో లెక్కించాలని డిమాండ్‌ చేస్తోంది బీఆర్‌ఎస్‌. బీసీ డిక్లరేషన్ అని చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది కాబట్టి… వెంటనే దాన్ని అమలు చేయాలని పట్టుబడుతోంది. బీసీ కుల గణన జరిగితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా సామాజికవర్గాలకు న్యాయం జరుగుతుందని, లేదంటే పూర్తిగా అన్యాయం జరుగుతుందన్న వాదనను ఎత్తుకుంది బీఆర్‌ఎస్‌.

ఈ క్రమంలోనే పార్టీ పరంగా కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టిందట. బీఆర్‌ఎస్‌లో ఉన్న బీసీ నాయకులు ఇన్నాళ్ళు ప్రత్యేకంగా బీసీ సమావేశాలు పెట్టుకునేవారు. కానీ…ఇకపై పూర్తి స్థాయిలో పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ… బీసీ అజెండాతో ముందుకు పోవాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వడంతో… తాము ఏం చేయాలి? పార్టీ పరంగా ఎలాంటి ఉన్నత పదవి ఇవ్వాలో వెదిలే పని మొదలుపెట్టిందట గులాబీ అధిష్టానం. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించేలా వ్యూహరచన జరుగుతోందట. అవసరాన్ని బట్టి ఇంకో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్ట్‌ను కల్పించి ఆ పదవి బీసీకి ఇవ్వాలన్న చర్చ జరుగుతోందట బీఆర్‌ఎస్‌లో. అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన బీసీ నేతల్ని కూడా రంగంలోకి దింపే ప్లాన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. బీసీల దగ్గరికి బీసీలు వెళ్తేనే వర్కౌట్‌ అవుతుందన్న ఆలోచనతో పార్టీలోని సీనియర్‌ బీసీ లీడర్స్‌ని ఫీల్డ్‌కు పంపబోతోందట బీఆర్‌ఎస్‌. బీసీలకు ఏం కావాలో… అందుకు పార్టీ ఏం చేస్తుందో… ఆ విషయాన్ని ఆయా సామాజికవర్గాల నేతలతోనే చెప్పించి మన్ననలు పొందాలన్న ప్లాన్‌లో గులాబీ అధిష్టానం ఉందన్నది పార్టీ వర్గాల టాక్‌. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌గా బీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం మొదలు పెట్టి…. ఆ పట్టు తగ్గకుండా కొనసాగిస్తే…వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి వర్కౌట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారట పెద్దలు. అలాగే… పార్టీ పదవులతో పాటు ఎన్నికల్లో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలన్నది బీఆర్‌ఎస్‌ ప్లానింగ్‌గా తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇవ్వడమేగాకుండా… ఆర్థికంగా కూడా సాయం చేసి ఎక్కువ మందిని గెలిపించుకుని పునాదుల్ని పటిష్టం చేసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. లోకల్‌ బాడీస్‌ ఎన్నికలలోపే… బీసీలతో భారీ బహిరంగ సభ పెట్టే యోచనలో ఉందట బీఆర్‌ఎస్‌ అధిష్టానం. మొత్తంగా ఇలా… రకరకాల మార్గాల్లో తమకు దూరమైన సామాజికవర్గాలను దరి చేర్చుకునే కసరత్తు మొదలుపెట్టింది భారత రాష్ట్ర సమితి. ఇన్నాళ్ళకు తత్వం బోధపడి పోగొట్టుకున్న చోటే వెదుకులాట మొదలుపెట్టిందని అంటున్నారు పరిశీలకులు.