అక్కడ బీఆర్‌ఎస్ పరిస్థితి డ్రైవర్ లేని కారులా మారిందట. కేడర్ ఇప్పటికీ బలంగా ఉంది. ఏ ఎన్నికైనా సై అంటోంది. కానీ… నడిపే నాయకుడు లేక దిక్కులు చూస్తోందట. సరైనోడు ఒక్కడు తగిలితే చాలు… మా సత్తా ఏంటో చూపిస్తామంటూ సైసై అంటున్నా అధిష్టానం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదట. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి నాయకత్వ దిక్కులేని పరిస్థితి ఎందుకు వచ్చింది?
ప్లీజ్… ప్లీజ్.. మాకో లీడర్….. అంటోంది హుజూర్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కేడర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కారు దిగేసి కమలం గూటికి చేరిపోయారు. ఇత అప్పటి నుంచి మరో నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు హుజూర్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి ఓడిపోగా… 2019లో అనూహ్యంగా వచ్చిన ఉప ఎన్నికల్లో గెలిచి మొదటిసారి హుజూర్ నగర్‌లో గులాబీ జెండా ఎగరేశారు. గెలిచిన నాటి నుండే తాను బలపడటంతోపాటు పార్టీని బలోపేతం చేసినా…2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి తప్పలేదు. ఇక అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడం, హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో, క్యాబినెట్‌లో కీలకం కావడంతో… అనువుగాని చోట అధికులమనరాదన్న పద్యాన్ని గుర్తు చేసుకుంటూ…గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి… కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక శానంపూడి సైడ్ కావడంతో ఏడాదిగా హుజూర్ నగర్ బీఆర్ఎస్‌ను నడిపే నాయకుడు లేకుండా పోయాడు. భర్తీపై అధిష్టానం కూడా దృష్టి పెట్టకపోవడం కేడర్‌ని కలవరపెడుతోందట. లీడర్ గడప దాటినా… క్యాడర్ మాత్రం చెక్కు చెదరకపోవడం ఇక్కడ పార్టీకి బలంకాగా… పార్టీ పెద్దలు మమ్మల్ని ఎందుకు పట్టింకోవడం లేదు, నడిపే నాయకుడు ఎప్పుడు వస్తాడంటూ… కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారట హుజూర్‌నగర్ గులాబీ నేతలు. తాజాగా అధిష్టానం పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లోగే తాము కూడా రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేయాలని ఉన్నా… ముందుండి నడిపించే బలమైన నేత లేకపోవడంతో… ఎవరికి వారుగా ఏం చేయలేకపోతున్నామని ఆవేదనగా ఉన్నారట గులాబీ కార్యకర్తలు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే… అసలిక్కడ బాధ్యతలు తీసుకునేందుకు నేతలు ఎవరూ ముందుకు రావడం లేదట.
ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరించే ఓ నేత హుజూర్ నగర్ నియోజకవర్గంలో అతి జోక్యం చేసుకుంటున్నారట. పార్టీని వీడే సమయంలో శానంపుడి సైదిరెడ్డి సదరు సదరు కీలక నేతపై చేసిన ఆరోపణలే ఇందుకు ఉదాహరణ అంటున్నారు కొందరు నాయకులు. అదే సమయంలో మరో మాటా వినిపిస్తోంది. ఇదే నియోజవర్గనికి చెందిన ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నందున… ఇది సరైన సమయం కాదని.. ఇప్పుడే తొందరపడటం ఎందుకన్న భావనలో కొందరు బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణఆలతో… హుజూర్ నగర్ కారుకు ప్రస్తుతానికి డ్రైవర్ లేరనిఅంటున్నారు. అదే సమయంలో మరీ… ఇలా వదిలేస్తే ఎలాగన్న ప్రశ్న కూడా వస్తోంది కేడర్‌లో. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన కొందరు నేతలు తాజాగా మౌనవ్రతం చేస్తుండటం మంచిది కాదని అంటోందట కేడర్. వెన్న తిన్నవాడు వెళ్ళిపోగా…చల్ల తాగిన వాడిని చావ మోదినట్టుగా ఉంది మా పరిస్థితి అంటూ నిట్టూరుస్తున్నారట కార్యకర్తలు. అసలు వాళ్లు వీళ్లు ఎందుకు… 2009లో హుజూర్ నగర్ నుండి పోటీ చేసిన మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లా ముఖ్య నేత జగదీశ్ రెడ్డి ఇక్కడి బాధ్యతలు తీసుకోవాలని అంటున్నారు కొందరు స్థానిక ద్వితీయ శ్రేణి నాయకులు. సరైన సమయంలో కీలక నిర్ణయం తీసుకొవాల్సిన పెద్దలు ఇలా ఉదాసీనంగా ఉండటం కూడా కరెక్ట్ కాదన్న అభిప్రాయం పెరుగుతోంది కేడర్‌లో. మరీ గులాబీ పార్టీ పెద్దలు క్యాడర్ సహనాన్ని పరీక్షిస్తారా? లేక వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తుందా అన్నది వేచి చూడాలంటున్నారు పరిశీలకులు.