NTV Telugu Site icon

Off The Record : బీఆర్‌ఎస్‌ పోగొట్టుకున్న చోటే వెతుకుంటుందా?

Brs

Brs

తెలంగాణలో గులాబీ దళం పోగొట్టుకున్న చోటే వెదుక్కునే ప్రయత్నం మొదలుపెట్టిందా? కాస్త కష్టపడి వెదికితే దొరికే ఛాన్స్‌ ఎంతవరకు ఉంది? పదేళ్ళ అధికార కాలంలో కనిపించని సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఇన్నాళ్ళు తాము ఎవరికి దూరం అయ్యామో… పవర్‌ పోయాకగానీ తెలిసి రాలేదా? ఇంతకీ బీఆర్‌ఎస్‌ కొత్త స్కెచ్‌ ఏంటి? దగ్గరికి తీయాలనుకుంటున్న వర్గాలేవి? అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములు, తగులుతున్న ఎదురుదెబ్బలతో కారుకు గట్టి రిపేరే చేయాలని అనుకుంటోందట బీఆర్ఎస్ అధిష్టానం. అందుకే ఎక్కడ పోగొట్టుకున్నామో… అక్కడే వెదుక్కునే కార్యక్రమం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్న పదేళ్ళలో జరిగిన పొరపాట్లపై సింహావలోకనం మొదలైనట్టు చెప్పుకుంటున్నారు. రాష్ట్రం సాధించిన పార్టీగా… పదేళ్ళ పాటు పొత్తిళ్ళలో కాపాడుకున్న ప్రజలు ఇంత తొందరగా ఎత్తి కింద పడేస్తారని అనుకోలేదని, తాము ఎందుకు ఓడిపోయామో త్వరగానే తెలిసివచ్చిందని అంటున్నారట బీఆర్‌ఎస్‌ ముఖ్యులు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు నాడు గులాబీ జెండాను ఎత్తుకున్నారు. రాష్ట్రం కోసం పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అలాగే…. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లో కూడా ఆ వర్గాలన్నీ సర్కార్‌కు అనుకూలంగానే ఉండేవి. కానీ… తర్వాత తర్వాత మార్పు మొదలైందన్నది పరిశీలకుల మాట. ఏ ఆశలు, ఆకాంక్షలతోనైతే తాము రాష్ట్రాన్ని సాధించుకున్నామో… వాటిని నెరవేర్చడంలో పదేళ్ళ బీఆర్‌ఎస్‌ సర్కార్‌ విఫలమైందన్న ఆవేదన ఆయా వర్గాల్లో పెరిగిపోయిందట. మరీ ముఖ్యంగా, రాజకీయ నియామకాలు తప్ప ఉద్యోగ నియామకాలు లేవంటూ… నిరుద్యోగులు బీఆర్‌ఎస్‌ మీద కోపం పెంచుకున్నారన్న విశ్లేషణలు బలంగానే ఉన్నాయి. ఆ క్రమంలోనే గత ఎన్నికల్లో విద్యార్థి, నిరుద్యోగ వర్గాలు బీఆర్‌ఎస్‌ను ఓడించడంలో కీలకపాత్ర పోషించినట్టు గుర్తించిందట పార్టీ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే అశోక్ నగర్ కోచింగ్ సెంటర్స్‌ దాకా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు బీఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే ఉద్యోగాలు వస్తాయంటూ ఎన్నికల టైంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఆ ఎఫెక్ట్ ఫలితాల్లో కనిపించిందంటూ… ఇప్పుడు వాస్తవంలోకి వచ్చిందట గులాబీ దళం.

తెలంగాణలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ పవర్‌లోకి రావడానికి ఈ వర్గాలు గట్టిగానే పని చేసినట్టు క్లారిటీ వచ్చిందట. దానికి తోడు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక పోవడంతో ఆలోచనలో పడిందట బీఆర్‌ఎస్‌ అధిష్టానం. ఆ క్రమంలోనే తమకు దూరమైన, శక్తివంతమైన వర్గాలను తిరిగి దరి చేర్చుకుంటూ…. ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెదుక్కునే పని మొదలుపెట్టినట్టు తెలిసింది. అందుకోసం పార్టీ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసే ప్లాన్‌లో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం రగులుతున్న గ్రూప్ 1 అంశాన్ని ఎత్తుకోవడంతో పాటు విద్యారంగ సమస్యలపై పోరాడాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇలా విద్యార్థుల సమస్యలు ఎత్తుకోవాలి అంటే.. ముందు వాళ్ళ నుంచి సపోర్ట్ ఉండాలి కాబట్టి…. పార్టీకి చెందిన మిగతా అనుబంధ విభాగాల ప్రక్షాళన కాస్త ఆలస్యం అయినా… స్టూడెంట్‌ వింగ్‌ని మాత్రం వెంటనే బలోపేతం చేయాలనుకుంటున్నారట. అందుకోసం ఇంటర్, డిగ్రీ కాలేజి స్థాయిలోనే కమిటీలు వేయబోతున్నట్టు సమాచారం. జూనియర్‌ కాలేజీల నుంచి యూనివర్సిటీల వరకు కమిటీలు వేస్తే….. అదే విద్యార్థులు గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తారన్నది బీఆర్‌ఎస్‌ ప్లాన్‌గా తెలిసింది. అయితే… ఇది అంత ఈజీ టాస్క్‌ కాదని, ఇన్నాళ్ళు పార్టీ మీదున్న వ్యవతిరేకతను పోగొట్టి తిరిగి యాక్టివేట్‌ చేయడానికి కాస్త సమయం, సహనం అవసరం అనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. ఆ క్రమంలోనే పార్టీ విద్యార్థి విభాగంతో తెలంగాణ భవన్‌లో మీటింగ్‌ పెట్టారు కేటీఆర్‌. ఇదే టైం లో గ్రూప్1 వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు కేటీఆర్ ను కలిసి తమకు సహాయం చేయాలని కోరారు. దీంతో కార్యాచరణకు ఇదే కరెక్ట్‌ టైం అనుకుంటూ ప్లాన్‌ అమలుకు పదును పెడుతోందట బీఆర్‌ఎస్‌ అధిష్టానం. గులాబీ దళానికి ఆ పోగొట్టుకున్నదేదో… అక్కడే దొరుకుతుందా లేదా అన్నది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందేనంటున్నారు తెలంగాణ పొలిటికల్‌ పండిట్స్‌.

Show comments