తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారుతోందా? పొలిటికల్ పావులు చిత్ర విచిత్రంగా కదులుతున్నాయా? రెండు జాతీయ పార్టీల నేతల మధ్య ఉన్నట్టుండి మాటల యుద్ధం ఎందుకు మొదలైంది? ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? ఆవులు ఆవులు పొడుచుకుంటే… దూడలు బలైనట్టు అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు తెలంగాణలో మొదలైన కొత్త పొలిటికల్ గేమ్ ఏంటి? తెలంగాణ పొలిటికల్ స్ర్కీన్ మీద సరికొత్త సీన్స్ కనిపిస్తున్నాయి. తమలపాకుతో నువ్వు ఒకటంటే… తలుపు చెక్కతో నే రెండంటానన్నది రాజకీయాల్లో సహజమే అయినా… ఇప్పుడు కూడా అదే స్థాయిలో వ్యవహారం నడుస్తున్నా… గమనించే వారికి మాత్రం సీన్ కొంచెం కొత్తగా కనిపిస్తోందట. ఇన్నాళ్ళు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్‌గా ఆ స్థాయిలో నడిచిన రాజకీయం ఇప్పుడు అంతకు మించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోవడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ జాతీయ రాజకీయ ప్రత్యర్థులు అయినా…. ఇన్నాళ్ళు తెలంగాణలో అంత సీన్ లేదు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ గనుక రాష్ట్ర ప్రభుత్వానికి, గులాబీ పార్టీకి మధ్యనే అన్నట్టుగా నడిచింది రాజకీయం. కానీ…ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి రెండు జాతీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండటంతో… అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొందరు బీజేపీ నేతలు కాపాడుతున్నారని ఆరోపిస్తోంది బీఆర్‌ఎస్. రేవంత్ రెడ్డి, సంజయ్ ఆర్‌ఎస్ బ్రదర్స్ అని కామెంట్ చేస్తున్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలోనే… రేవంత్, కిషన్, సంజయ్ మధ్య మాటల యుద్ధం మొదలైనట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. పరస్పరం పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు నాయకులు. కేంద్ర మంత్రులు ఇద్దరూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సీఎం అంటుంటే….. పాలన చేతకాక తమ పై విమర్శలు చేస్తున్నారని కౌంటర్ చేస్తున్నారు కిషన్‌రెడ్డి, బండి సంజయ్.
ఫోన్ ట్యాపింగ్, కుల గణన, రాష్ట్ర అభివృద్ధి , సంక్షేమం… ఇలా రకరకాల అంశాల మీద మాటల పంచాయతీ నడుస్తోంది. అన్నిటికీ మించి ఎన్నడూ లేనిది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తన సహజశైలికి భిన్నంగా స్ట్రాంగ్ రియాక్షన్స్ ఇవ్వడం, మునుపెన్నడూ వాడని భాష వాడుతుండటంపై రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. పాలన చేతకాక పోతే దిగిపో అంటూ సీఎం రేవంత్‌ని ఉద్దేశించి కిషన్ కామెంట్ చేశారంటే… ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ ఆకస్మిక మార్పునకు కారణం ఏంటన్నది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని, ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు అనుకుంటూ ముందుకెళ్తున్న నాయకులు ఇప్పుడు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడం వెనక ఏదో… మతలబు ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడే కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేందుకే… ఈ పొలిటికల్ గేమ్ మొదలైందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. బీఆర్‌ఎస్‌ను నామ మాత్రం చేస్తే….తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నది ఆ పార్టీ అధిష్టానం లెక్కగా తెలుస్తోంది. అదే సమయంలో… బీజేపీని కొడితేనే బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్ పూర్తిగా తమ వైపు డైవర్ట్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే జాతీయ పార్టీలు రెండూ యుద్ధం మొదలుపెట్టి… బీఆర్‌ఎస్ సీన్‌లో లేకుండా చేస్తున్నాయన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. అలాగే మరో వాదన సైతం వినిపిస్తోంది కొన్ని వర్గాల్లో. సీఎం రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య వ్యక్తిగతంగా ఎక్కడో చెడి ఉంటుందని, అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా తిట్టుకుంటూన్నారన్న చర్చ సైతం ఉంది. ముందు ముందు ఈ పొలిటికల్ గేమ్‌లో ఏ పావులు ఎటు కదులుతాయో చూడాలి మరి.