NTV Telugu Site icon

Off The Record : ఆ జిల్లాలోని వైసీపీ బలమైన నేతలను తిప్పుకునే ప్లాన్ లో టీడీపీ..

Simhapuri Otr

Simhapuri Otr

సింహపురి పొలిటికల్‌ సీన్‌ ఇంకా మారుతోందా? ఇప్పటికే జిల్లాను టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేయగా… ఇప్పుడిక నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్తోందా? స్థానిక సంస్థల్లో పట్టు కోసం అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు వేస్తున్న మంత్రం ఏంటి? నెల్లూరు జిల్లా పొలిటికల్‌ పరిణామాలు ఎలా మారిపోబోతున్నాయి? లెట్స్‌ వాచ్‌. ఏపీలో ఇన్నాళ్ళు వైసీపీకి గట్టి బలం ఉన్న జిల్లాలలో నెల్లూరు ఒకటి. 2014, 19 ఎన్నికల్లో జిల్లాలో సత్తా చాటింది పార్టీ. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం మారిపోయింది. 10 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్ సభ సీట్లను కూటమి గెలుచుకుంది. తర్వాత వైసీపీ కేడర్‌ నెలకొన్న నైరాశ్యాన్ని అనుకూలంగా మల్చుకునే పనిలో ఉంది అధికార పార్టీ. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి తీసుకుంటే ..వారి వెంటే కేడర్ కూడా వస్తుందని భావిస్తున్నారట. జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం ఈ ఆపరేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలోనే ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్… మండల పరిషత్ అధ్యక్షుడి తో పాటూ.. పలువురు కౌన్సిలర్లు సర్పంచులను టిడిపి వైపు తిప్పుకున్నారాయన. ఇప్పుడు జిల్లాలోని ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పార్టీలోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. నెల్లూరు నగరంలో ఆనం కుటుంబానికి కొంత పట్టు ఉంది. నగరపాలక సంస్థలోని 54 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులే అప్పట్లో గెలుపొందారు. కానీ… మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పటికే 14 మంది కార్పొరేటర్లు టిడిపిలో చేరగా… మరో 15 మందిని లాగేందుకు మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. అదేవిధంగా జిల్లాలోని 46 మంది జడ్పిటిసిలు..46 మంది ఎం.పి.పి.లకు కూడా టీడీపీ కండువాలు కప్పే ప్రయత్నం జరుగుతోందట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి ఆనం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు.

అంతేగాక పదవిలోకి వచ్చిన మూడేళ్లు ఏమీ అభివృద్ధి చేయలేకపోయారని… ఇక మిగిలి ఉన్న రెండేళ్లలో నైనా అభివృద్ధి పనులు చేసుకుని.. మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. అంటే… ఆ మాటల మర్మం ఏంటో అందరికీ తెలుసునని అంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు. తనకు సన్నిహితంగా ఉన్న వారితో ఆనం నేరుగా మాట్లాడుతూ… అధికార పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారట. మరికొందరితో వారికి సన్నిహితంగా ఉండే వారి ద్వారా మాట్లాడిస్తున్నట్టు తెలిసింది. వచ్చే జెడ్.పి.. సమావేశం నాటికి వీలైనంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతిని టిడిపిలోకి తీసుకువస్తే భవిష్యత్తులో ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారాయన. రెండేళ్ల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఇప్పటినుంచినే ఆ దిశగా పావులు కదుపుతున్నారు ఆనం. వైసీపీలో బలమైన నేతలను తమ వైపునకు తిప్పుకుంటే వారికి అభ్యర్థుల కొరత.. ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారట. ఇప్పటికే పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు… మంత్రి ఆనంను కలిసి తమ ప్రాంతాలకు చెందిన సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు ఇస్తున్నారు. ఆనం కూడా దృష్టి సారిస్తూ వీలైన వాటిని పరిష్కరిస్తున్నారు. ప్రస్తుతం అధికారం లేకపోవడంతో… గ్రామస్థాయిలో చిన్న పనులు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు చేయలేకపోతున్నారు. దీంతో అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటే పనులు అవుతాయని పలువురు నేతలు భావిస్తున్నారు. ఇలా దగ్గరకు వస్తున్న నేతలను చేర్చుకునేలా మంత్రి వ్యూహాలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద మంత్రి ఆనం చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర ఫలిస్తాయో వేచి చూడాలి.