NTV Telugu Site icon

Off The Record : సడెన్గా ఎందుకు తప్పుకున్నట్లు?

Alla Nani

Alla Nani

వైసీపీ పదవులకు రాజీనామా చేసిన ఆ నాయకుడిది వ్యూహమా? లేక వైరాగ్యమా? పార్టీలోనే కొనసాగుతూ…. జిల్లా అధ్యక్ష పదవికి మాత్రం రాజీనామా చేయడాన్ని ఎలా చూడాలి? పవర్‌లో లేని పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? లేక ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకుంటున్నారా? ఎవరా నాయకుడు? ఇలాంటి వ్యవహారాల్లో ఆయన గతం ఏం చెబుతోంది? ఏపీలో పొలిటికల్‌గా కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏలూరు ఒకటి. ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని ఇక్కడి నుంచి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు సైతం నిర్వహించారాయన. ఇక మంత్రివర్గ విస్తరణలో అధికారిక పదవులు పోవడంతో… ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగారు ఆళ్ళ. ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత పార్టీ పదవులకు రాజీనామా చేయడంతోపాటు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ…తమ అధినేత జగన్‌కి లేఖ రాయడం పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. నాడు కాంగ్రెస్‌లో, నేడు వైసీపీలో లోకల్‌గా తనకి తప్ప మరొక నేతకు అవకాశం లేకుండా మూడు దశాబ్దాల పాటు రాజకీయం చేసిన ఆళ్ల నాని ఇప్పుడు సడన్‌గా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు లేఖ పంపడం వెనక ఏం జరిగిందన్నది ఇప్పుడు ఏలూరులో జరుగుతున్న చర్చ. రాజీనామాకు ముందు వరకు ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న నాని… ఈసారి ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత ఘోరంగా ఓడిపోయారు. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయన్నది లోకల్‌ కేడర్‌ మాట. నియోజకవర్గంలో తనకి తప్ప మరో నేతకి ప్రాధాన్యత కల్పించకుండా ఒంటెద్దు పోకడలకు పోవడంతో ముఖ్యమైన నాయకులంతా పక్క పార్టీల్లో చేరిపోతున్నారు. దీంతో ఏలూరు అసెంబ్లీలో వైసిపి దాదాపు ఖాళీ అయిపోయిందని కార్యకర్తలే చెప్పుకుంటున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగితే ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం అంత తేలికైన పనేం కాదు. పైగా అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకోవడం మరో సవాల్. అందుకే… ఈ తలనొప్పులు, అనవసరమైన బాధ్యతలన్నీ నాకెందుకు అన్నట్టుగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు చెప్పుకుంటున్నారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. మాజీ మంత్రి ప్రస్తుతానికి పక్కకి జరిగినా.. మళ్ళీ ఎన్నిక నాటికి తిరిగి ఆయనే తెరపై కొస్తారన్నది లోకల్‌ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. గతంలో ఇలాగే చేసిన చరిత్ర కూడా ఉంది ఆయనకు. 2014లో వైసీపీలో చేరిన ఆళ్ల నాని ఆ ఎన్నికల్లో చివరి నిమిషంలో సీటు సంపాదించి ఓడిపోయారు. తర్వాత పార్టీ కార్యక్రమాలకు, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించినా… అంతంతమాత్రంగానే నెట్టుకొచ్చారు. ఇక 2017 లో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న ఆళ్ళనాని 2019 ఎన్నికల నాటికి ఏలూరు అసెంబ్లీ నుంచి పోటీలో ఉంటారా లేదా అనే చర్చ చాలా కాలం కొనసాగింది. ఆ క్రమంలోనే… పార్టీ అధినేత పాదయాత్రలో ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం పేరు ప్రకటించారు. కానీ… అలా పేరు ప్రకటించారో లేదో ఇలా యాక్టివ్‌ అయిపోయారు నాని. అప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆళ్ళ తనదైన మార్క్‌ రాజకీయం చేసి చివరి నిమిషంలో సీటు సంపాదించుకుని ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్‌ మినిస్టర్‌ అయ్యారు. ఇప్పుడు కూడా అదే తరహా వ్యూహాలకు పదును పెడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలో లేని సమయంలో జిల్లా అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నికల దాకా పోరాడడం కంటే పక్కకి తప్పుకోవడమే ఉత్తమంగా భావించారన్నది లోకల్‌ లీడర్స్‌ అనుమానం. ఇప్పుడు పక్కకు తప్పుకున్నా… మళ్ళీ ఎన్నికల నాటికి ఎలాగోలా తెరమీదికి వచ్చి… టిక్కెట్‌ ఎగరేసుకుపోతారని, ఈలోపు కష్టపడ్డవాళ్ళంతా అప్పటికి పులుసులో కలిసిపోతారన్న అభిప్రాయం బలంగా ఉందట కేడర్‌లో.ఇప్పటికే ఏలూరు అసెంబ్లీలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన నేతలు అంతా పక్కకి జరగడంతో వైసిపి బలహీనపడుతోందన్న అభిప్రాయం ఉంది. అందుకే నాని ఏలూరు అసెంబ్లీ ఇన్చార్జి పదవికి రాజీనామా చేసినా.. ఆ బాధ్యత భుజానికెత్తుకోవడానికి ముందుకు వచ్చే నాయకులే కరువయ్యారని అంటున్నారు. ఆళ్ళనాని పదవులకు మాత్రమే రాజీనామా చేసి పార్టీలోనే కొనసాగుతున్నందున మళ్ళీ ఎన్నికల నాటికి ఆయనే ముందుకు వస్తారని, ఈలోపు మనం చించుకోవడం ఎందుకన్నది మిగిలి ఉన్న అరకొర నేతల అభిప్రాయంగా చెబుతున్నారు. ఏలూరు వైసీపీకి చివరికి ఎవరు పెద్ద దిక్కు అవుతారో చూడాలి మరి.