NTV Telugu Site icon

Off The Record : TDPలో కాలు పెట్టిన రోజే Gummanur Jayaram కాకరేపుతున్నారా..?

Jayaram Otr

Jayaram Otr

ఆలూ లేదు చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది ఆ మాజీ మంత్రి వ్యవహారం. పార్టీ మారిన గంటల్లోనే తనకు ఫలానా అసెంబ్లీ టిక్కెట్‌ ఫిక్స్‌ అంటూ సొంతగా ప్రకటించేసుకున్నారు. ఆ ప్రకటన విన్నాక అక్కడి టీడీపీ లీడర్స్‌కు కిందా మీదా కాలిపోతోందట. ఇన్నాళ్ళు తన్నులు తిన్నది మేము, ఖర్చుపెట్టింది మేము, ఇప్పడొచ్చి ఈయనగారి హంగామా ఏంటని రగిలిపోతున్నారట. కాలు పెట్టిన రోజే కాక రేపిన ఆ నాయకుడు ఎవరు? ఏమా కథ? గుమ్మనూరు జయరాం…. మొన్నటి దాకా వైసీపీలో కీలక నేత, రాష్ట్ర మంత్రి కూడా. కానీ… ఇప్పుడు ప్రతిపక్షం గూటికి చేరి హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఇంకా చెప్పాలంటే… ఎప్పుడూ కేరాఫ్‌ కాంట్రవర్శీ అన్న పేరుబడ్డ గుమ్మనూరు ఇప్పుడు పార్టీ మారాక కూడా అదే మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేశారా? లేక బర్తరఫ్‌ అయ్యారా అన్నది ఒక వివాదం అయితే… ఇటు టీడీపీ కూడా ఆయన రాక అలజడి రేపుతోంది. ఆలూరు నియోజకవర్గానికి చెందిన గుమ్మనూరు జయరామ్‌కు మొదట్లోనే మంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్‌. బలమైన బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ప్రయారిటీ ఇచ్చారు జగన్‌. భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదన్నది వైసీపీ వర్గాల మాట. కానీ… ఎన్నికల టైం వచ్చేసరికి సీన్‌ మారిపోయింది. నియోజకవర్గాల మార్పులు చేర్పుల్లో భాగంగా గుమ్మనూరును కర్నూల్‌ ఎంపీగా పోటీ చేయమంది పార్టీ అధిష్టానం. కానీ… ఆయన మాత్రం అసెంబ్లీ వైపే మొగ్గుచూపారు. భీష్మించుకు కూర్చున్నారు కూడా. అదే సమయంలో డబుల్‌ రోల్‌ పోషించారని అంటారు పొలిటికల్‌ పరిశీలకులు. ఓవైపు అసెంబ్లీ టిక్కెట్‌ కోసం వైసీపీ పెద్దలతో చర్చలు జరుపుతూనే… మరోవైపు టీడీపీతో రాయబారాలు నడిపారట. సైకిల్‌ పాచిక పారడంతో ఇక ఫ్యాన్ కు గుడ్ బై చెప్పి పసుపు కండువా కప్పేసుకున్నారు. వెళ్తూ వెళ్తూ.. సహజంగానే ఇన్నాళ్ళు మంత్రి పదవి ఇచ్చి ఆదరించిన పార్టీ మీద నాలుగు రాళ్ళు కూడా వేసేశారు. అంత వరకూ ఓకే… పార్టీ మారే నాయకుల్లో చాలా మంది అప్పటిదాకా అద్భుతమని పొగిడిన పార్టీని, దాని అధ్యక్షుడిని తిట్టడం లేటెస్ట్‌ ఫ్యాషన్‌ కదా…. అనుకున్నా… ఆయన వోవర్‌ కాన్ఫిడెన్స్‌ ఏంటన్న చర్చ ఇటు టీడీపీలో మొదలైందట. పార్టీ మారిన వెంటనే మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి టీడీపీలో తనకు టికెట్ ఖరారైందని.. సొంత నియోజకవర్గం ఆలూరు కానీ, అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి కానీ పోటీ చేస్తానని ప్రకటించేశారు. ఈ మాటలు విన్నాకే టీడీపీ నేతలకు కాలిపోతోందట. పార్టీ కోసం నానా కష్టాలు పడ్డ నాయకులు కూడా టిక్కెట్‌ కన్ఫర్మేషన్‌ కోసం ఎదురు చూస్తుంటే… చేరిన గంటల వ్యవధిలోనే తనకు తానుగా నియోజకవర్గాన్ని ప్రకటించేసుకోవడం ఏంటన్నది క్వశ్చన్‌.

 

టీడీపీలో అసలు ఇలాంటి కల్చర్‌ లేదని, ఎవర్ని చూసుకుని, ఏ ధైర్యంతో జయరామ్‌ టిక్కెట్‌ ప్రకటన చేసుకుంటారని ఫైర్‌ అవుతున్నారట అనంతపురం జిల్లా నేతలు. దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకుని పని చేస్తున్నవారు ఉన్నారు. పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి, అనేక కేసులతో కిందా మీదా పడుతున్న వాళ్ళు ఉన్నారు. అయినా సరే…అధిష్టానం పర్మిషన్‌ లేకుండా మామూలు విషయాలు మాట్లాడటానికే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ… ఈయనగారు చేరిన గంటల వ్యవధిలోనే తనకు తానుగా టిక్కెట్‌ ప్రకటించుకోవడాన్ని ఏ పదంతో పిలవాలని ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారట టీడీపీ లీడర్స్‌. వాస్తవంగా మాట్లాడుకుంటే… గుమ్మనూరు జయరాంపై టీడీపీ చేయని ఆరోపణ లేదు. సాక్షాత్తూ చంద్రబాబు దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు మాజీ మంత్రి అవినీతి, దౌర్జన్యాలపై మాట్లాడారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నారు సరే.. ఇప్పుడు చంద్రబాబుతో సంబంధం లేకుండా ఆ రెండు నియోజకవర్గాల్ని నాకు రాసిచ్చేశారన్నట్టు మాట్లాడ్డాన్ని పార్టీ అధిష్టానం ఎలా చూస్తుందని టీడీపీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశం మీద గుంతకల్లులో టీడీపీ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసలు పార్టీలోకి ఎవర్ని బడితే వారిని ఎలా తీసుకొస్తారని కూడా ఫైరవుతున్నారు. గుమ్మనూరు జయరాం పార్టీలో చేరిన వెంటనే గుంతకల్లులో సమావేశమయ్యారు లోకల్‌ లీడర్స్‌. అలాంటి వ్యక్తి టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని తేల్చి చెప్పేశారు. గుంతకల్లు టీడీపీ టిక్కెట్‌ కోసం ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నేతలు బలంగా పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆలూరులో పనికిరాడని వైసీపీ పక్కన పెట్టిన నాయకుడిని తీసుకొచ్చి మా నెత్తిన రుద్దుతామంటే ఎలాగని అంటున్నారట గుంతకల్లు తెలుగుదేశం నేతలు. పార్టీ ఫస్ట్‌ లిస్ట్‌లో గుంతకల్లు పేరు లేదు. అప్పటికే గుమ్మనూరు చేరతారన్న ప్రచారం ఉంది. ఆయన కోసం వెయిట్‌ చేసి మరీ టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానిక నాయకులు. చంద్రబాబు నిర్ణయం ముందే తీసుకున్నారా.. లేక గుమ్మనూరు ఊహించి చెప్పారా.. తెలియదు కానీ ఆయన పార్టీలోకి రావడం ఒక తుఫాన్ సృష్టిస్తే..తనకు ఫలానా నియోజకవర్గ టికెట్ వస్తుందని చెప్పి ఇంకో రచ్చకు దారి తీశారంటున్నారు పరిశీలకులు. ఏదో ఒక గట్టి హామీ లేకుండా ఎందుకు అలాంటి ప్రకటన చేస్తారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి ఫైనల్‌ లిస్ట్‌లో గుమ్మనూరు పేరు ఉంటుందా లేదా అన్నది చూడాలి.