NTV Telugu Site icon

Off The Record : లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ వ్యూహాలు

Bjp Otr

Bjp Otr

పార్లమెంట్ ఎన్నికలను బిజెపి తెలంగాణలో లాంచింగ్ ప్యాడ్‌లా ఉపయోగించుకోవాలని అనుకుంటోందా? కేవలం ఎంపీ సీట్లతో సరిపెట్టకుండా… ఆ బేస్‌తో రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికలు ఉన్నాయా? కాషాయదళం ఏక కాలంలో అమలు చేయాలనుకుంటున్న ఆ ప్లాన్స్‌ ఏంటి? ఎన్ని ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలవాలన్న టార్గెట్‌తో టీ బీజేపీ రంగంలోకి దిగింది? తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. ఆ పరంగా క్లారిటీ వచ్చేసింది గనుక ఇక ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించింది. అన్నిటికీ ఒకటే మంత్రం అన్నట్టుగా కాకుండా… తమకు బలం ఉన్న, బలంలేని నియోజకవర్గాలను విడి విడిగా లిస్టౌట్‌ చేసుకుని ఎక్కడికక్కడ ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. పార్టీ శ్రేణులకు సైతం ఆ కోణంలోనే దిశా నిర్దేశం జరుగుతోందట. రాష్ట్రంలో కనీసం పది లోక్‌సభ సీట్లు,35 శాతానికి పైగా ఓట్లు సాధించాలని అదిష్టానం టార్గెట్‌ పెట్టినట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభావం తెలంగాణలోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి… ఇక్కడే కట్టడి చేయాలన్న ఆలోచనతో బీజేపీ పెద్దలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నది పార్టీ వర్గాల టాక్‌. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుండి రిపోర్ట్‌లు ఢిల్లీ వెళ్తున్నాయట. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సర్వేలను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ విశ్లేషించి వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. బీజేపీ నాలుగు సిట్టింగ్ స్థానాలైన సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌తోపాటు మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజ్ గిరి, భువనగిరి స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో కాషాయ జండా ఎగురేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలిసింది. అలాగే నాగర్ కర్నూల్, వరంగల్ నియోజక వర్గాలలో కూడా పార్టీ గ్రాఫ్‌ రోజు రోజుకూ పెరుగుతున్నట్టు అంచనా వేస్తున్నారు టీ బీజేపీ నేతలు. ఈ 12 నియోజక వర్గాలను A, B కేటగిరీలుగా విభజించి ప్లాన్స్‌ రెడీ చేసుకుంటున్నారట.

ఇక బలహీనంగా ఉన్నామనుకుంటున్న పెద్దపల్లి, మహబూబాబాద్‌, ఖమ్మం, నల్గొండల్లో ఇంప్రూవ్ కావడానికి ఏం చేయాలనే దాని పై కమలం కసరత్తు జరుగుతోందంటున్నారు. మోడీ చరిష్మా, పార్టీ పట్ల ఉన్న సానుకూల వాతావరణంతో ఆ నియోజక వర్గాల్లో కూడా బలపడే ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రతి బూత్ నుంచి కనీసం ఐదురుగు కార్యకర్తలు తయారు చేయాలన్నది పార్టీ ప్లాన్‌గా తెలిసింది. వివిధ క్షేత్రాలు, ధార్మిక సంస్థల సహకారంతో బలహీన నియోజకవర్గాల్లో పాగా వేయాలన్న ప్లాన్‌ ఉన్నట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణలో లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారట బీజేపీ పెద్దలు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రభావం తగ్గకుండా స్థానిక సంస్థల ఎన్నికలకి ఉపయోగ పడేలా చూసుకోవాలన్నది పార్టీ ప్రణాళికగా తెలిసింది. మొత్తంగా ఎంపీ ఎలక్షన్స్‌ ప్లానింగ్‌నే పక్కాగా చేసుకుని బలమైన శక్తి గా ఎదగడంతో పాటు స్తానిక సంస్థల ఎన్నికల ద్వారా మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటోంది కమలం పార్టీ. అదే సమయంలో ఎంపీ ఎలక్షన్స్‌ ఫలితాలను బట్టే తదుపరి అడుగులు ఉంటాయన్న వాదన సైతం వినిపిస్తోంది. దీంతో కాషాయ పార్టీ ప్లాన్స్‌ని జాగ్రత్తగా గమనిస్తున్నారు పరిశీలకులు, రాజకీయ ప్రత్యర్థులు.