NTV Telugu Site icon

Off The Record : మల్కాజిగిరి లోక్ సభ స్థానాన్ని అన్ని ప్రధాన పార్టీలు ఎందుకంత ఫోకస్ చేస్తున్నాయి?

Otr Malkajgiri

Otr Malkajgiri

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం ఎందుకు హాట్‌ సీటైంది? అన్ని ప్రధాన పార్టీలు అక్కడే ఎందుకు ఫోకస్‌ చేస్తున్నాయి? అదే నియోజకవర్గం కేంద్రంగా సీఎం రేవంత్‌ని టార్గెట్‌ చేసుకుని కేటీఆర్‌ మాటల తూటాలు పేల్చడానికి కారణాలేంటి? అన్ని పార్టీల్లో మల్కాజ్‌గిరి మల్లగుల్లాలకు కారణాలేంటి? లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం ప్రత్యేకమే అయినా… తెలంగాణలోని ఆ ఒక్కటి మాత్రం హాట్‌ సీటుగా మారిపోయింది. అన్ని పార్టీల్లో దాని కోసం విపరీతమైన పోటీ ఉంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో దాదాపు 31 లక్షల మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు ఈ నియోజకవర్గం కోసమే ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలో విపరీతమైన పోటీ ఉంది. మిగతా చోట్ల అభ్యర్థుల్ని వెదుక్కోవాల్సి వస్తున్న పార్టీల టిక్కెట్స్‌కు సైతం ఇక్కడ ఫుల్‌ డిమాండ్‌ ఉంది. 2014లో మల్కాజ్‌గిరి నుంచి గెలిచిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఈసారి తన కొడుకు భద్రారెడ్డిని బీఆర్‌ఎస్‌ తరపున బరిలోకి దింపాలనుకుంటున్నారు. ఆయన ఆ ప్రయత్నాల్లో ఉండగానే… కాలేజీ నిర్మాణం అక్రమం అంటూ కూల్చివేతలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసి కూలగొట్టద్దని వేడుకున్నారట మల్లారెడ్డి. దీంతో పోటీ సంగతి అటుంచితే పార్టీలో ఉంటారా? లేదా అన్న అనుమానాలు కొత్తగా వస్తున్నాయి. ఇంకోవైపు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, కాసాని జ్ఞానేశ్వర్‌ అన్న కొడుకు కూడా ఇక్కడ బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తామని కాలు దువ్వుతున్నారు. కూల్చివేతలకు ముందు వరకైతే బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ తన కుటుంబాన్ని దాటి పోనివ్వకుండా చాలా జాగ్రత్తపడ్డారు మల్లారెడ్డి. తన కొడుకు, లేదా కోడల్ని ఇక్కడి నుంచి బరిలో దింపాలన్నది ఆయన ప్లాన్‌. ఇక శంభీపూర్‌ రాజుకు కేసీఆర్‌, కేటీఆర్‌కు దగ్గరి వ్యక్తి అన్న పేరుంది. అటు ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే రాగిడి లక్ష్మా రెడ్డి పేరు కూడా ఈ సీటు రేస్‌లో వినిపిస్తోంది.

 

వీరే కాకుండా మరో ఇద్దరు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్‌ టికెట్ వస్తే చాలు ఖర్చుకు వెనుకడబోమంటున్నారట ఆ పారిశ్రామికవేత్తలు. ఒక దశలో కేటీఆర్ కూడా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ చివరికి అదంతా ప్రచారమేనని తేలిపోయింది. బీఆర్‌ఎస్‌లో ఈ సీటుకు మాత్రమే ఇంత డిమాండ్‌ పెరగడానికి కారణాలున్నాయంటున్నారు. మల్కాజ్‌గిరి పరిధిలోకి వచ్చే ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో అయితే భారీ మెజారిటీలు సైతం వచ్చాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల సాయంతో తేలిగ్గా గెలవ వచ్చన్నది ఇక్కడి ఆశావహుల అంచనా. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో అంతా కాంగ్రెస్‌ హవా నడిచినా….హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాలు బీఆర్‌ఎస్‌కే జై కొట్టాయి. దీనితో మల్కాజిగిరి సీటుకు గులాబీ పార్టీలో ఫుల్ డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్‌ తరపున సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పోటీచేస్తారని ఇన్నాళ్ళు ప్రచారం జరిగింది. కానీ… తన కుటుంబం నుంచి ఎవరూ పోటీచేయరని, కుటుంబ రాజకీయాలను తాను ప్రోత్సహించేది లేదని చెప్పి ఆ ప్రచారానికి తెర దించారు రేవంత్‌రెడ్డి. ఆ పార్టీ తరపున కంచర్ల చంద్రశేఖర్‌, మైనంపల్లి హన్మంతరావు రేస్‌లో ఉన్నారు. ఇక బిజెపి నుంచి సీనియర్‌ లీడర్‌ ఈటల రాజేందర్‌ పేరు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లోనే తాజాగా కేటీఆర్‌ మల్కాజ్‌గిరి కేంద్రంగానే సీఎం రేవంత్‌కు సవాల్‌ విసరడం కలకలం రేపుతోంది. దమ్ముంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీచెయ్‌…. నువ్వో నేనో తేల్చుకుందామని కేటీఆర్‌ అనడం చూస్తుంటే… ఇక్కడ గెలుపు మీద బీఆర్‌ఎస్‌ ఎంత నమ్మకంతో ఉందో అర్ధమవుతోందంటున్నాయి రాజకీయ వర్గాలు.