OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ

Otr

Otr

గూడూరు ఫ్యాన్‌ రిపేర్స్‌ వర్కౌట్‌ అవుతున్నాయా? నేరుగా వైసీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది? ఆయన మీటింగ్‌ పెట్టినా మార్పు వచ్చిందా? లేక ఆ… ఇలాంటివి చాలా చూశామన్నట్టు ఉంటున్నారా? ఇంతకీ… సమస్య ఎక్కడ వచ్చింది? పార్టీ అధ్యక్షుడు స్వయంగా దూతను ఎందుకు పంపాల్సి వచ్చింది?

సింహపురి ఫ్యాన్‌కు రిపేర్ వర్క్ స్టార్ట్ అయింది. పనిచేయలేని నేతలను పక్కనపెట్టి.. పనికొచ్చే వారికి ప్రాధాన్యత ఇచ్చే ప్రోగ్రామ్‌ మొదలైందట. గూడూరు ఇన్ఛార్జ్‌ మార్పు కూడా ఇందులో భాగమేనని అంటున్నారు.అయితే తమకు మాట మాత్రం చెప్పకుండా కొత్త ఇన్చార్జ్‌ని నియమించడంపై నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వర్గంతో పాటు.. కీలక నేతలు పార్టీ కార్యక్రమాలకి డుమ్మా కొడుతూ వచ్చారు. మండల నాయకులతో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సమావేశమైనా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో.. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకమాండ్‌… రీజనల్ కో ఆర్డినేటర్ మిధున్ రెడ్డిని పంపిందట.గూడూరు నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, కీలక నేతలతో పాటు.. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాకానిని కలిపి మిధున్ రెడ్డి ప్రత్యేకంగా మీటింగ్‌ పెట్టారు. అధినేత నిర్ణయంతో విబేధించడానికి ఉన్న కారణాల గురించి ఆరా తీసినట్టు సమాచారం.

అయితే.. తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని రామ్ కుమార్ రెడ్డి మిధున్ రెడ్డితో చెప్పినట్టు తెలిసింది. ఇక మండల అధ్యక్షులతో మాట్లాడినప్పుడు… తమకు మాట మాత్రం చెప్పకుండా ఇన్చార్జిని ప్రకటించడాన్ని ప్రస్తావించారట. దీర్ఘకాలంగా తాము పార్టీలో ఉన్నామని.. ఆ మాత్రం గౌరవం ఇవ్వరా అని అడిగినట్టు తెలిసింది. అందరి మాటలు విన్న మిథున్ రెడ్డి.. పార్టీ అభిప్రాయాన్ని వారికి చెప్పారట. 2014, 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున పాశం సునీల్, వరప్రసాద్ పోటీ చేశారు. వీరికి టికెట్ కేటాయిస్తే గెలిపించుకుంటామని స్తానిక నేతలు జగన్ దృష్టికి తీసుకువెళ్ళారట. ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం అయినా… స్థానికంగా ఉన్న బలాన్ని దృష్టిలో ఉంచుకుని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల నిర్ణయానికి ప్రాధాన్యం ఇచ్చారట జగన్‌. ఇక 2014లో పాశం సునీల్ వైసీపీ నుంచి గెలిచి టిడిపిలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో సునీల్ కు టికెట్ ఇప్పించిన నేతలు ఆయన్ని ఆప్ ప్రయత్నం చేయలేదని అంటారు. అలాగే 2019లో వరప్రసాద్‌కి వైసీపీ టిక్కెట్ దక్కింది.
అది కూడా స్థానిక నేతల సిఫారసుతోనే ఖరారైంది. నాడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై గూడూరు నేతలు అనేకసార్లు అధినేతకు ఫిర్యాదు చేశారట. ఈ రెండు విషయాలని మిధున్ రెడ్డి గూడూరు నేతల ముందు ప్రస్తావించారట. ఈసారి అలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతోనే అధిష్టానం గురవయ్యను ఖరారు చేసిందని క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది.

 

ఈసారి స్వయంగా పార్టీ అధ్యక్షుడే అభ్యర్థిని ఖరారు చేశారన్న విషయాన్ని మీటింగ్లో స్పష్టం చేశారట. జగన్ రెండుసార్లు గూడూరు నియోజకవర్గ నేతలకు అవకాశం ఇచ్చారని.. ఆ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వకపోవడంతో.. ఈసారి ఆయనే నేరుగా ఖరారు చేసి బాధ్యతలు అప్ప చెప్పారని అన్నట్టు తెలిసింది. నియోజకవర్గంలోని మండల, రాష్ట్ర స్థాయి పదవులు అలాగే కొనసాగుతాయని.. ఇది నా మాట కాదు, జగన్‌ మాట అని కూడా క్లారిటీ ఇచ్చేశారట మిధున్‌రెడ్డి. అనంతరం కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లిన మిథున్…. ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. గూడూరు ఇంచార్జి గురవయ్య నియామకంపై అభిప్రాయాన్ని తీసుకున్నారట. మొత్తంగా గూడూరు అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేసిన మిధున్‌రెడ్డి…రాబోయే లోకల్ బాడీస్‌ ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు అందరూ కలిసి పనిచేయాలని సూచించారట. అయితే… పార్టీ అధినేత నిర్ణయం అని డైరెక్ట్‌గా చెప్పినందున ఇప్పటికైనా సెట్‌ అవుతారా? లేక ఇగోలతో సమస్యను పొడిగిస్తారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.