NTV Telugu Site icon

Off The Record : చెన్నమనేనికి బీఆర్‌ఎస్‌ అధిష్టానం చెక్ పెడుతుందా ? అందుకే KTR ని టార్గెట్ చేశాడా ?

Vemulawada Otr

Vemulawada Otr

ఆర్‌ఎస్‌ నాయకత్వం ఆ ఎమ్మెల్యేని భారం అనుకుంటోందా? పొమ్మనకుండానే పొగ పెడుతోందా? ఓవైపు సిట్టింగ్‌లకే సీట్లు అంటూ మరోవైపు అక్కడ మాత్రం ఇంకో బలమైన నేతకు నీ పని నువ్వు చేసుకోమని కన్ను గీటిందా? అధిష్టానం వైఖరితో కొత్త కుంపట్లు రాజుకున్నాయా? ఎవరా ఎమ్మెల్యే? ఏదా నియోజకవర్గం?

పౌరసత్వ వివాదంతో బాగా పాపులర్‌ అయ్యారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు. వివాదాల మాట ఎలా ఉన్నా…అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి వరుసగా ఆయనే ఎమ్మెల్యే అవుతున్నారు. కానీ.. అదంతా గతం. ఇప్పుడు ఆయనకు అంత సీన్‌ లేదని అర్ధమైందట బీఆర్‌ఎస్‌ అధినాయకత్వానికి. ఎన్‌ఆర్‌ఐ కోటా ఎమ్మెల్యే అంటూ సెటైర్లు వేస్తున్న ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇవ్వలేకపోతోందట అధికార పార్టీ. ఎమ్మెల్యే పౌరసత్వం కేసే అందుకు కారణమని చెబుతున్నారు. ప్రతిపక్షాల ప్రచారం నష్టం చేస్తోందని పార్టీ సర్వేల్లో సైతం తేలిందట. దీంతో ఇక ఆయన్ని రెస్ట్‌ మోడ్‌లోకి పంపి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు అనుకుంటున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే అదే సామాజికవర్గానికి చెందిన, ఆర్థికంగా బలమైన నేతను రంగంలోకి దింపారట… నీ పని నువ్వు చేసుకో… అని సిగ్నల్స్‌ కూడా పంపేసిందట గులాబీ నాయకత్వం. దీంతో వేములవాడ బీఆర్‌ఎస్‌లో గ్రూపులు తయారై పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా మారిపోయాయి.

ఓవైపు కొత్త లీడర్ రంగప్రవేశం…మరోవైపు ఎమ్మెల్యే ఒత్తిడితో కొందరు ప్రజాప్రతినిధులు నలిగిపోతున్నట్టు చెబుతున్నారు. ఈ పరిణామ క్రమంలోనే వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టించబోయారట ఎమ్మెల్యే రమేష్ బాబు. మరోనేత చల్మెడ లక్ష్మీనరసింహారావు అండతో ఆ గండం నుంచి తప్పించుకున్నారు మున్సిపల్ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం ఒక్కతాటిపైకి వస్తోంది. అందులో భాగంగానే వేములవాడ పట్టణంలో పార్టీ పరంగా ఎమ్మెల్యే సహకరించేది లేదని తేల్చేశారట కౌన్సిలర్లు. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ భర్త ,పార్టీ సీనియర్ నేత రామతీర్ధపు రాజు నాయకత్వంలో గోవాలో వారం రోజులు క్యాంపు వేశారట 20 మంది కౌన్సిలర్లు. దానివెనక ఎవరున్నారో తనకు తెలుసునంటూ రుసరుసలాడటం తప్ప ఎమ్మెల్యే ఏమీ చేయలేకపోతున్నట్టు చెబుతున్నారు.

ఈసారి కూడా వేములవాడ నుంచి నేనే పోటీ చేస్తానని రమేష్ బాబు పదే పదే ప్రకటించుకునేటట్టు చేయగలిగారు ఆయన ప్రత్యర్థులు. కొద్ది రోజుల క్రితం వరకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ఇక్కడ నుంచి బరిలోకి దిగబోతున్నారని ప్రచారం జరిగింది… ఆ తర్వాత చల్మెడ రంగంలోకి వచ్చి ట్రస్ట్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్యే లక్ష్యంగా చల్మెడ చేస్తున్న కామెంట్లతో ద్వితీయ శ్రేణి నేతలకు ఎటూ పాలుపోవడం లేదట…ఓ అడుగు ముందుకేసిన చల్మెడ ఎమ్మెల్యే ఏం చేయలేడు.. నేనున్నా అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ వివరించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తే పార్టీ పెద్దల నుంచి సానుకూల స్పందనే లేదట. దీంతో ఈసారి ఆయనకు సీటు డౌటేనన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వేములవాడ బీఆర్‌ఎస్‌ టికెట్ ఈసారి తమలో ఎవరో ఒకరికి రావాలి తప్ప రమేష్ బాబుకు దక్కనివ్వకూడదన్న పట్టుదలతో ఉన్నారట ఆశావహులు. పైకి గుంభనంగా ఉన్నా..ఎమ్మెల్యేకి పరిస్థితి పూర్తిగా అర్దమైనట్టు తెలిసింది. అందుకే కొద్ది రోజులుగా కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారట…ఇటీవల ఓ సమావేశంలో కేటీఆర్‌ను ఉద్దేశించి రమేష్‌బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇంతకాలం అండగా ఉన్న కేడర్‌ దూరం కావడం, అధిష్టానం పట్టించుకోకపోవడంతో చెన్నమనేని ఒంటరివాడయ్యాడన్న మాటలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన తదుపరి అడుగులు ఎటువైపు ఉంటాయో చూడాలి.