NTV Telugu Site icon

Off The Record: యార్లగడ్డ పార్టీ మారిపోతారా? రిక్వెస్ట్‌ చేశారా? వార్నింగ్‌ ఇచ్చారా?

Gannavaram

Gannavaram

Off The Record: గన్నవరంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ఏం మాట్లాడతారని వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు ఆసక్తిగా ఎదురుచూశాయి. వెంకట్రావు పెట్టేబేడా సర్దేసుకుని టీడీపీలోకి జంప్‌ అవడానికి రెడీగా ఉన్నారన్న ప్రచారంతో.. మీటింగ్‌లో ఆ ప్రస్తావన ఎక్కడా రాకుండా ఆయన జాగ్రత్త పడ్డట్టు తెలిసింది. సమావేశం ప్రధాన అజెండా అధిష్టానం తనకు చేసిన అన్యాయాన్ని అందరి ముందుకు తీసుకువెళ్ళడమేనని, అంతకు మించి మాట్లాడితే టాపిక్‌ డైవర్ట్‌ అయిపోతుందని భావించిన వెంకట్రావు చాలా జాగ్రత్తగా వ్యహరించినట్టు భావిస్తున్నారు. కేవలం జగన్‌ను నమ్ముకుని అమెరికాలో వ్యాపారం వదిలి గన్నవరంలో రాజకీయం చేయటానికి వచ్చానని చెప్పడాన్ని బట్టి చూస్తే.. సింగిల్‌ పాయింట్‌గా వైసీపీ నాయకత్వాన్ని టార్గెట్‌ చేసుకునే యార్లగడ్డ మాట్లాడినట్టు స్పష్టమవుతోంది. జగన్ రమ్మన్నారని సొంత నియోజకవర్గం పెనమలూరును కాదని గన్నవరంలో పార్టీ కోసం పనిచేస్తే అవమానాలు మిగిలాయని చెప్పారాయన.

యార్లగడ్డ ప్రసంగంలో ఎక్కువ భాగం వైసీపీ తనకు అన్యాయం చేసిందని చెప్పడానికే ప్రయత్నం చేశారు. వంశీ వల్ల గన్నవరం కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని చెప్పినా జిల్లా మంత్రులు వారి బాగోగులు పట్టించుకుంటారని జగన్ చెప్పారన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష హోదా తీసేయటానికి వంశీని చేర్చుకుంటామని చెబితే వంశీ వల్ల గన్నవరంలో వైసీపీ వాళ్ల హోదాలే పోయాయంటూ చురకలు అంటించారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారికి రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్సీలు ఇచ్చారని, కానీ… దుట్టాకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని నేరుగా నాయకత్వాన్నే ప్రశ్నించారు. ఒకవైపు పార్టీకి విధేయంగా ఉన్నామని చెబుతూనే… మరోవైపు పార్టీ కార్యకలాపాలను విమర్శిస్తూ, అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడటం ఏంటన్న అనుమానాలు వస్తున్నాయి. అంటే… యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని విడిచిపెట్టాలని డిసైడయ్యాకే ఇలా మాట్లాడుతున్నారా? వెళ్ళబోయే ముందు తన తప్పేమీ లేదని, అంతా అధినాయకత్వమే చేసిందని ఎస్టాబ్లిష్‌ చేయదల్చుకున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి పరిశీలకులకు. కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి యార్లగడ్డ చేరుకోకముందే సభా ప్రాంగణంలో ఓ ఆడియో క్లిప్ ను పదే పదే ప్లే చేశారు.

ఇందులో యార్లగడ్డకు టికెట్ ఇచ్చేలా అధిష్టానంపై ఒత్తిడి తెద్దాం, అధిష్టానంతో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది, మనల్ని కొట్టిన వ్యక్తితో సంధి కంటే రాజకీయాలను వదిలేయటయం మేలనే నినాదాలను పదే పదే ప్లే చేశారు. అంటే… అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకోవాలని డిసైడయ్యాకే యార్లగడ్డ మీటింగ్ పెట్టారని, అందుకే టికెట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేస్తూనే ఇవ్వకపోతే నా జకీయ భవిష్యత్‌ను నేను నిర్ణయించుకుంటానని వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ఎమ్మెల్యే వంశీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయకుండా.. కేవలం వైసీపీ అధిష్టానాన్నే టార్గెట్‌ చేయడం ద్వారా ఫైనల్ గా టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారిపోతాననే సంకేతాలు పంపారన్న చర్చ బెజవాడ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది.