Off The Record: మాజీ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వైసీపీకి గుడ్‌బై చెప్పబోతున్నారన్న వార్త ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపుతోంది. కేవలం పార్టీ మారడంతోనే సరిపెట్టకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. 2014 నుంచి 19 వరకు టీడీపీ ఎంపీగా ఉన్న పండుల… 19 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక 2020లో వైసీపీ ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేశారాయన. ఈ క్రమంలో ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరందుకోవడంతో… ఎమ్మెల్సీ చూపు ఎటువైపు ఉందన్న చర్చ మొదలైంది. రేపో మాపో ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. గడిచిన కొద్ది రోజులుగా పండుల జనసేన ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
Read Also: Amaravati: అమరావతి అభివృద్ధి.. ఈ ఏడాది చివరకల్లా రూ.15 వేల కోట్ల రుణం..
అవి కొలిక్కివచ్చాయని, ఇక పవన్ కళ్యాణ్ స్టాంప్ వేసేస్తే… కండువా మార్చేయడం లాంఛనమేనని అంటున్నారు. ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న పండుల రవీంద్రబాబు 2014లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వెంటనే అమలాపురం ఎంపీ టిక్కెట్ దక్కింది. గెలిచాక 2019 వరకు పలు పార్లమెంటరీ సంఘాల్లో సభ్యుడిగా కూడా వ్యవహరించారాయన. అయితే అనూహ్యంగా 19 ఎన్నికలకు ముందు సైకిల్ దిగి ఫ్యాన్ కిందికి చేరిపోయారు పండుల. కానీ.. అప్పటికే అమలాపురం లోక్ సభ టికెట్ విషయంలో వైసీపీ అధిష్టానం ఓ క్లారిటీకి వచ్చేయడంతో రవీంద్రబాబుకు అవకాశం దక్కలేదు. నాడు ఇచ్చిన హామీ మేరకు 2020 జులై 28న గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యునిగా ఎంపిక చేసింది వైసీపీ. ఇంకో రెండేళ్ళ పాటు పదవీకాలం ఉన్నాసరే… పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారన్న సమాచారం ఇప్పుడు కోనసీమలో హాట్ హాట్ చర్చకు తెరలేపింది.
Read Also: Crime: ప్రియురాలిని దూరం చేసిన తండ్రి.. గన్‌తో కాల్చిన ప్రియుడు
వైసీపీ అధిష్టానం పేరుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా… గత ఐదేళ్లలో తనను పూర్తిగా విస్మరించిందన్న అసహనం ఆయనలో ఉందట. ఓ మాజీ సివిల్ సర్వెంట్‌గా ఢిల్లీ స్థాయిలోతనకున్న పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రాన్ని కాదు కదా…. కనీసం సొంత జిల్లాను అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా వైసీపీ ప్రభుత్వం తనకు ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారట ఆయన. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఓ పక్కన పడేశారు తప్ప…నన్ను అస్సలు సరిగా ఉపయోగించుకోలేకపోయాని సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. ఈ అసంతృప్తితోనే ఇప్పుడు పండుల చూపు గ్లాస్ పార్టీ వైపు మళ్ళినట్టు తెలుస్తోంది. పార్టీ మార్పు విషయాన్ని అతి త్వరలోనే ఆయన ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అటు ఇప్పటికే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన కర్రి పద్మశ్రీ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను మండలి చైర్మన్ ఇంకా ఆమోదించలేదు. మరిప్పుడు పండుల రవీంద్రబాబు రాజీనామాను ఆమోదిస్తారా, లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయట. రాజీనామా ఆమోదం పొందినా, పొందకున్నా… పండుల పార్టీ మార్పు మాత్రం ఖాయమైందని అంటున్నారు ఆయన సన్నిహితులు. సో… మాజీ ఎంపీ కమ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ ముచ్చటగా మూడో పార్టీలో చేరబోతున్నారన్న మాట.