NTV Telugu Site icon

Off The Record: ఆ వైసీపీ ఎమ్మెల్యే సొంత పార్టీకి దూరం అవుతున్నారా?

Balanagi Reddy

Balanagi Reddy

Off The Record: కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీరు ఆ పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఒకప్పుడు జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేసిన వైసీపీ… ఇప్పుడు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలకే పరిమితమైంది. ఆలూరులో విరూపాక్షి, మంత్రాలయం నుంచి బాలనాగి రెడ్డి మాత్రమే గెలిచారు. జిల్లా అంతటా పార్టీ తరపున వాణి వినిపించాల్సింది ప్రధానంగా ఆ ఇద్దరే. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి దాదాపు అన్ని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నా… మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాత్రం గడిచిన ఏడు నెలల్లో పాల్గొన్న కార్యక్రమాలు చాలా తక్కువ అని పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నపుడు, అధికారం లేనపుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారిపై బాధ్యతలు ఎక్కువగా వుంటాయని, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే చురుగ్గా ఉండాల్సిన టైంలో… బాలనాగిరెడ్డి కనిపించడమే కష్టమైతే ఎలాగన్న చర్చ వైసీపీలో జరుగుతోందట. అధిష్టానం పిలుపిచ్చిన రెండు ఆందోళన కార్యక్రమాల్లో మాత్రమే బాలనాగిరెడ్డి పాల్గొన్నారంటూ లెక్కలు తీస్తోంది కేడర్‌. అతితక్కువ సందర్భాల్లో మాత్రమే అధికారపార్టీపై విమర్శలు చేసారని, ప్రభుత్వ తీరుపైన, ఫలానా విషయాల మీద మీడియా సమావేశాల్లో మాట్లాడాలని అధిష్టానం పంపిన అదేశాలపై కూడా ఆయన స్పందించడం లేదట.

Read Also: Brinda Karat: ఎన్డీఏపై బృందా కారత్‌ ఫైర్‌.. చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు..?

కర్నూలులో వైసీపీ రీజినల్ ఇంచార్జి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, పులివెందుల సతీష్ రెడ్డి హాజరైన జిల్లా కార్యవర్గ సమావేశానికి కూడా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వెళ్ళకపోవడం చర్చనీయాంశం అయింది. వైసీపీ జిల్లా ఉపాధ్యక్ష పదవిలో ఉన్నందున బాలనాగిరెడ్డి కుమారుడు మాత్రం మీటింగ్‌కు వెళ్ళారని చెప్పుకుంటున్నారు. బాలనాగి రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నియోజకర్గాల పునర్విభజనలో ఏర్పడింది మంత్రాలయం. అప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన. ఆ తరువాత కొన్నాళ్ళకే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక వైసీపీ ఆవిర్భావం తరువాత ఆపార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించారంటూ అనర్హత వేటు కూడా పడింది. 2009, 2014, 2019, 2024 లో వరుసగా ఎమ్మెల్యే అయ్యారాయన. ఇంత సీనియార్టీవున్న నేత ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయి ఉండి కూడా… కష్టకాలంలో మౌనంగా ఉంటే ఎలాగన్న టాక్‌ నడుస్తోంది.

Read Also: Hezbollah: ఫిబ్రవరి 23న హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా అంత్యక్రియలు..

2019-24 మధ్య మంత్రి పదవి ఆశించారు బాలనాగిరెడ్డి. దక్కక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా కొన్నాళ్లకే రాజీనామా చేశారు. ఆ అసంతృప్తులతోనే ఇప్పుడు పెద్దగా నోరు విప్పడం లేదన్న అంచనాలు ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకూడదని అధిష్టానం నిర్ణయించడంతో ఎలాగూ అసెంబ్లీ లో ప్రజల సమస్యలపై తన వాణి వినిపించే అవకాశం లేదు. కనీసం జిల్లా స్థాయిలో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించి పరిష్కారానికి అవకాశం ఉన్నా, ఆ పని కూడా చేయడం లేదన్న అసంతృప్తి ఉందట వైసీపీ వర్గాల్లో. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా… జడ్పీ మీటింగ్‌ లాంటి వేదికల్ని ఉపయోగించుకుని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నా…ఆయన ఆ పని చేయకపోవడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట సెగ్మెంట్‌లో. దీనికి కాలమే సమాధానం చెప్పాలి అని సర్దుకుంటోందట పార్టీ క్యాడర్.