NTV Telugu Site icon

Off The Record: పిలుపే ఇస్తారా..? వైసీపీ నిరసన కార్యక్రమంలో జగన్ పాల్గొంటారా..?

Jagan

Jagan

Off The Record: వైసీపీ అధినేత జగన్.. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని తరచూ చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైంది. ఇప్పట్లో పార్టీ కోలుకోదని అందరూ భావించారు. అయితే మొదటి నెల నుంచి పార్టీని సెట్ చేసే పనిలో పడ్డారు జగన్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదంటూ ఆందోళన మొదలు పెట్టారు. ఇప్పటికే రైతులకు మద్దతుగా నిరసనలు…విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించింది వైసీపీ. వైసీపీ మొదట చేపట్టిన రైతు ధర్నాకు ఆశించిన స్థాయిలో స్పందన లేకున్నా విద్యుత్ పోరుబాట కార్యక్రమం మాత్రం బాగానే సక్సెస్ అయ్యింది. పార్టీ అధినేత జగన్ హాజరుకాకపోయినా…నిరసన కార్యక్రమాలు జనంలోకి వెళ్లాయి. విద్యుత్ పోరుబాటలో జగన్ ఎక్కడో ఓ చోట నిరసనల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు భావించాయట. ఆయన మాత్రం ఎక్కడా పార్టిసిపేట్ చేయకుండా…నిరసన చేపట్టిన రోజే పులివెందుల నుంచి బెంగుళూరుకు వెళ్ళటం…ఆ పార్టీ కార్యకర్తలను కొంత నిరుత్సాహ పరిచిందట. ఆయన ధర్నాల్లో పాల్గొనకపోవటంపై పార్టీ శ్రేణుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.

వైసీపీ ఆవిర్భావం నుంచి దీక్షలతోనే జగన్ అందరికీ చేరువయ్యారు. 12 గంటలు.. 24 గంటలు.. 48 గంటలు అంటూ వినూత్న రీతిలో నిరసన దీక్షలు చేపట్టారు. దాదాపు ప్రతీ దీక్షకు ఆయన హాజరయ్యారు. 2014లోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించినా అది సాధ్యపడలేదు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కార్యక్రమాలను రూపొందించుకున్నారు. ఓ వైపు వరుస దీక్షలు చేస్తూనే.. మరోవైపు సుదీర్ఘ పాదయాత్రను చేశారు. అప్పట్లో ఒక్కటిగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేనలు విడిపోవడానికి… వైసీపీ అధినేత జగన్ చేసిన దీక్షలే ఓ కారణంగా చెబుతుంటారు. ప్రత్యేక హోదా కోసం ఆయన చేసిన దీక్షలు అప్పటి అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేశారు. బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి…అదే పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు సైతం పోరాడారు. అలాంటి పరిస్థితుల నుంచి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన జగన్…కారణాలు ఏవైనా తిరిగి అధికారం కోల్పోయారు. అయితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో ఆయన పాల్గొనక పోవటంపై పార్టీ వర్గాల్లో గట్టి చర్చే జరుగుతోందట. నిస్తేజంలోకి వెళ్లి పోయిన కార్యకర్తలు తిరిగి యాక్టివ్ కావాలంటే…ఆయన కూడా ధర్నాలకు రావాలని పార్టీ కీలక నేతలు భావిస్తున్నారట. అధినేత క్షేత్ర స్థాయికి రావాల్సిన కీలక సమయంలో…పక్క రాష్ట్రాలకు వెళ్తే కేడర్‌కు ఎలాంటి సందేశం వెళ్తుంది ? స్వయంగా పార్టీ అధినేత జగన్ ఆందోళనల్లో పాల్గొంటే బాగుంటుందని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారట. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైన పార్టీ తిరిగి గాడిన పడాలంటే అందరూ మారాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారట.

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై నిరసన కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చింది వైసీపీ. విద్యార్దులకు పరీక్షల సమయం కూడా కావటంతో దాన్ని ఈనెల 29కి వాయిదా వేశారు. పార్టీ అధినేత జగన్ కనీసం ఆ కార్యక్రమానికి హాజరైనా బాగుంటుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయట. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడి స్తబ్దుగా ఉన్న కార్యకర్తలు… పార్టీ వైపునకు నడిపించాలంటే జగన్ జనాల్లోకి రావటమే మంచిదని సీనియర్లు సూచనలు చేస్తున్నారట. అధికారంలో ఉన్న సమయంలో కారణాలు ఏవైనా…ప్రజలకు దూరంగా ఉన్న జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనైనా వారిని ఎక్కువగా కలిసేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని ప్రస్తావిస్తున్నారట. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్…నిరంతరం ప్రజల్లోనే ఉండి మంచి ఫలితాలు రాబట్టారని గుర్తు చేస్తున్నారట. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆందోళనలకు వస్తారా.. రారా.. అన్నది చూడాలి.

https://www.youtube.com/watch?v=xB2Qt6DS3g0VJA YCP JAGAN

Show comments