Site icon NTV Telugu

Off The Record: చంద్రబాబు ఎపిసోడ్‌పై తారక్‌ ఎందుకు స్పందించలేదు..? బాబు.. బాగా.. బిజీనా?

Ntr

Ntr

Off The Record: కొంచెం రచ్చ.. ఎక్కువ చర్చ. ఎన్టీఆర్‌ ఫ్యామిలీ సంబంధిత కార్యక్రమాలు జరిగినప్పుడు, మిగతా సభ్యులకు, జూనియర్‌ ఎన్టీఆర్‌కు మధ్య సంబంధాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి జరుగుతున్నది ఇదే. ఈ క్రమంలోనే.. తాజాగా చంద్రబాబు ఎపిసోడ్‌లో తారక్‌ ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు, అనుమానాలు పొలిటికల్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. శనివారం నుంచి చంద్రబాబు కుటుంబం మొత్తం రోడ్డు మీదే ఉంది. నంద్యాలలో ఆయన్ని అరెస్ట్‌ చేసి విజయవాడ తరలించి, తర్వాత రాజమండ్రి జైలుకు పంపేదాకా తీవ్రమైన హైడ్రామా నడిచింది. ఈ టైంలోనే భువనేశ్వరి, లోకేష్‌, బ్రాహ్మిణికి సంఘీభావంగా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు వెళ్ళారు. బాలకృష్ణ, రామకృష్ణతో పాటు మరికొంతమంది హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ ఫ్లైట్‌లో విజయవాడ వెళ్ళి బాసటగా నిలబడ్డారు. అయితే… ఇంత జరుగుతున్నా.. జూనియర్‌ ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఎందుకు లేదన్న ప్రశ్నకు సమాధానాలు వెదుకుతున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

ఎంత.. దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా.. మామ అరెస్ట్‌పై ఒక చిన్న స్టేట్‌మెంట్‌ ఇచ్చే తీరిక కూడా లేకపోయిందా అంటున్నాయి టీడీపీ వర్గాలు. పైగా ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కూడా హైదరాబాద్‌లోనే జరుగుతోంది. నేరుగా వెళ్ళ గలిగేంత దూరంలో ఉన్నా.. వెళ్ళకపోగా.. కనీసం ఒక్క స్టేట్‌మెంట్‌ కూడా ఇవ్వలేకపోయారా అని ప్రశ్నిస్తోంది పార్టీ కేడర్‌. అంటే.. ఆ ఫ్యామిలీ నుంచి మానసికంగా తారక్‌ దూరమైనట్టేనా? లేక అనవసరమైన రాజకీయ వివాదాలు ఎందుకనుకుంటున్నారా అన్న సందేహాలు వస్తున్నాయట కేడర్‌కు. గతంలో చాలా సందర్భాల్లో తారక్‌ తీరు ఇలాగే ఉంది. ఇటీవల ఢిల్లీలో యుగపురుషుడి స్మారకంగా ఎన్టీఆర్‌ బొమ్మతో 100 రూపాయల నాణేన్ని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నాణెం విడుదలైంది. పెద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా అందులో పాల్గొన్నారు. కొడుకులు, కుమార్తెలు, అల్లుళ్లు.. మనవళ్లు ఇలా అంతా హాజరయ్యారు. కానీ.. తాతే నా ప్రాణం అని చెప్పుకునే మనవడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వెళ్ళలేదు. నందమూరి కుటుంబం నుంచి చాలా మంది మంది హీరోలుగా వచ్చినా.. పెద్ద ఎన్టీఆర్‌ సినీ వారసత్వాన్ని మాత్రం బాలకృష్ణ తర్వాత అందుకున్నది జూనియర్‌ ఎన్టీఆర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అలాంటి వ్యక్తి ఇంత అతి ముఖ్యమైన కార్యక్రమానికి ఎందుకు వెళ్ళలేదన్నది నాడు అభిమానుల్ని, ఇటు రాజకీయ వర్గాలను వేధించిన ప్రశ్న.

తర్వాత కూడా తారక్‌ నుంచి ఈ విషయంలో ఎలాంటి స్పందన లేదు. కనీసం ఒక్క స్టేట్‌మెంట్‌ కూడా బయటికి రాలేదు. ఎన్టీఆర్ మిగతా కుటుంబ సభ్యులకు జూనియర్ దూరంగా ఉంటున్నారా..? లేక చంద్రబాబు హాజరవుతున్న కార్యక్రమానికి వెళ్ళడం ఇష్టం లేదా? అన్న ప్రశ్నలు అప్పుడు కూడా వచ్చాయి. ముఖ్యంగా చంద్రబాబుతో కలిసి డయాస్ పంచుకోవడం కానీ.. ఓ కార్యక్రమంలో పాల్గొనడం కానీ జూనియర్ ఎన్టీయార్‌కు ఇష్టం లేదనే వాదన అప్పట్లో బలంగా వినిపించింది. ఇక అంతకు ముందు విజయవాడలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు జూనియర్‌కు ఆహ్వానం లేదు. తర్వాత హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి పిలిచినా.. ఆయన వెళ్ళలేదు. కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరైన ఆ ప్రోగ్రామ్‌కి.. నాడు తన బర్త్‌ డే వేడుకల పేరుతో తారక్‌ డుమ్మా కొట్టడంపై గట్టిగానే విమర్శలు వచ్చాయి.

ప్రతిసారి ఇలా ఎందుకు జరుగుతోంది? కుటుంబ కార్యక్రమాల్లో సైతం తారక్‌ అంటీ ముట్టనట్టుగా ఎందుకు ఉంటున్నారంటే.. సమాధానం మాత్రం సూటిగా రావడం లేదంటున్నారు పరిశీలకులు. అటు ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న మరో చర్చ ప్రకారం చూసుకుంటే.. రాజకీయంగా చంద్రబాబుకు, టీడీపీకి ఉపయోగపడే ఏ కార్యక్రమానికైనా వెళ్లకూడదని జూనియర్ ఎన్టీఆర్ డిసైడైనట్టు సమాచారం. 2009 ఎన్నికల తర్వాత టీడీపీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు తారక్‌. అదే సందర్బంలో చంద్రబాబుతో కలిసి డయాస్ షేర్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువే. ఇక హరికృష్ణ చనిపోయిన తర్వాత పార్టీకి జూనియర్‌తోపాటు, మామా అల్లుళ్ళకు మధ్య కూడా గ్యాప్ పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు. రాజకీయంగా ఇబ్బంది ఉండదు అనుకున్న కార్యక్రమాలకు మాత్రం చంద్రబాబు వస్తున్నా ఎన్టీఆర్‌ కూడా హాజరవుతున్నట్టు తెలిసింది. ఆ మధ్య తన అక్క సుహాసిని ఇంట్లో జరిగిన పెళ్ళికి వెళ్ళారు జూనియర్‌. అదే కార్యక్రమానికి చంద్రబాబు ఫ్యామిలీ కూడా వెళ్ళింది. అయినా ఇద్దరి మధ్య మాటల్లేవని, వ్యవహారం మొత్తం అంటీ ముట్టనట్టుగానే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

అంతకు ముందు ఏపీ అసెంబ్లీలో భువనేశ్వరి పేరు ప్రస్తావించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా జూనియర్‌ స్పందనపై తీవ్ర స్థాయి విమర్శలు వెల్లువెత్తాయి. ఎక్కడా ఆమె గురించి మాట్లాడకుండా… జనరలైజ్‌ చేసి ఇచ్చిన నాటి స్టేట్‌మెంట్‌పై నందమూరి కుటుంబ అభిమానులు తీవ్రంగానే మండిపడ్డారు. అయితే… ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. ఇప్పుడు జూనియర్ పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టారు. రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. అందుకే రాజకీయంతో ముడిపడ్డ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటున్నారని అంటున్నారు. తన సినీ కెరీర్‌కు ఇబ్బంది కలుగుతుందని భావిస్తే.. అలాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నట్టు అంచనా వేస్తోంది ఓ వర్గం. అయితే…. ఎంత కెరీర్‌ పరంగా జాగ్రత్త తీసుకున్నా… కేంద్ర ప్రభుత్వం తాతకు గుర్తింపు ఇచ్చిన కార్యక్రమానికి వెళ్ళకపోవడం, ఇప్పుడు సొంత మేనత్త భర్త అరెస్ట్‌ అయితే… కనీస స్పందన లేకపోవడం ఎంత వరకు కరెక్ట్‌ అని ప్రశ్నించేవారు సైతం ఉన్నారు.

Exit mobile version