Off The Record: పాలకొల్లు వైసీపీకి ఎందుకు కలిసిరావడం లేదు?

  • వైసీపీకి అస్సలు మింగుడు పడని పాలకొల్లు నియోజకవర్గం..
  • ఒక్కసారి కూడా గెలవలేకపోవడంపై సీరియస్‌ పోస్ట్‌మార్టం..
  • ఇన్ఛార్జ్‌లను మారుస్తున్నా కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితి..
  • ఎప్పటికప్పుడు ప్రత్యర్థికి పెరుగుతున్న మెజార్టీ..
  • ప్రస్తుత ఇన్ఛార్జ్ గుడాల గోపి ఎన్నికల డబ్బు మింగేశారన్న ఆరోపణలు..
  • పార్టీ కార్యక్రమాలను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్న విమర్శలు..
  • ఈసారి ఆర్థిక, కులాల లెక్కల్ని సరిచేయాలన్న ప్లాన్‌..
  • కాపు నేతను రంగంలోకి దించేందుకు వెదుకులాట..
  • పాత ఇన్ఛార్జ్‌ గుణ్ణం నాగబాబుతో చర్చలు జరిపారా?..
Otr Ysrcp Palakollu

Otr Ysrcp Palakollu

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ అంతటా వైసీపీ వ్యవహారం ఒకలా ఉంటే…. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం బాగా తేడాగా ఉందట. ఇక్కడ ఇన్ఛార్జ్‌గా ఎవర్ని నియమించినా… ఎడ్డెమంటే తెడ్డెమనడం తప్ప… కలిసి పార్టీని విజయతీరాలకు చేరుద్దాం, విభేదాలన్నిటిని ఓ కొలిక్కి తీసుకువద్దామన్న ధ్యాసే లేకుండా పోతోందంటున్నారు. అసలు పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా ఇక్కడ గెలవకపోవడం అధిష్టానానికి అస్సలు మింగుడు పడ్డంలేదు. ఎన్నిసార్లు అభ్యర్థులను మార్చినా… కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడానికి కారణాలపై ప్రస్తుతం సీరియస్‌గా పోస్ట్‌మార్టం జరుగుతోందట. ఈసారి లెక్క తప్పకూడదనే టార్గెట్‌తో పక్కాగా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే మూడు నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చిన అధినేత జగన్‌…. ప్రస్తుతం పాలకొల్లు పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడిక్కడ పార్టీ ఇన్చార్జిగా గుడాల గోపి ఉన్నారు. ఈయన కంటే ముందు కవురు శ్రీనివాస్, డాక్టర్ బాబ్జి, గుణ్ణం నాగబాబు, అంతకంటే ముందు మేకా శేషుబాబు… ఇలా రకరకాలుగా మార్చి మార్చి ప్రయోగాలు చేసినా పెద్దలు ఆశిస్తున్న మైలేజ్ మాత్రం దక్కలేదు. దీంతో పాలకొల్లులో ఎప్పుడు పోటీ చేసినా ఓటమి తప్ప కనీస పోటీ ఇవ్వలేకపోతున్నట్టు పరిస్థితులే చెబుతున్నాయి. కార్యకర్తల బలమున్నా.. అధినేత ఆశీస్సులు అందిస్తున్నా.. ఇన్ఛార్జ్‌లుగా వస్తున్న నాయకులు మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది.

కొత్తగా ఎవరొచ్చినా… ప్రత్యర్థికి ప్రతి ఎన్నికలో మెజారిటీ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఈ పరిణామాలు బట్టి పాలకొల్లులో వైసిపి పరిస్థితి ఏరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చని సొంత నేతలే అంటున్నారు. ఇలాంటి వాతావరణంలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పశ్చిమ గోదావరి జిల్లా పై ఫోకస్ పెట్టిన
జగన్… ఇప్పటికే తాడేపల్లిగూడెం ,భీమవరం, ఉండి నియోజకవర్గాలకు బాధ్యులుగా కొత్త వాళ్ళను నియమించారు. దీంతో… ఆయా నియోజకవర్గాల కంటే అట్టడుగున ఉన్న పాలకొల్లు పై ఎప్పుడు ఫోకస్ పెడతారా అని ఎదురు చూస్తున్నారు ఇక్కడి నాయకులు, కార్యకర్తలు. ప్రస్తుత ఇన్చార్జ్‌ గోపి కూడా… ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం ఒక కారణం అయితే, ఎన్నికలకు ముందు పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న ఆయన…ఎలక్షన్‌ ఖర్చుల డబ్బును సైతం దాచుకున్నారన్న ఆరోపణలున్నాయి. పార్టీ కార్యక్రమాలైనా, కార్యకర్తలతో మీటింగ్స్‌ అయినా… తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని, అసలు తనకేమీ పట్టనట్టు ఉంటున్నారని వైసీపీ నాయకులే విమర్శిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నాలుగో సారి ఓటమి తప్పదని అంచనాతో ఉన్నాయి పాలకొల్లు వైసిపి శ్రేణులు. దీన్ని దృష్టిలో ఉంచుకునే… కొత్త ఇన్చార్జి కోసం వేట మొదలైందని సమాచారం. ఈసారి ఆర్థికంగా బలంతోపాటు సామాజిక సమీకరణాలను సరి చేయగల అనుభవం ఉన్న నేత కోసం వెదుకుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఇన్ఛార్జ్‌ గోపి బీసీ కాగా… కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో ఈసారి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రంగంలోకి దించాలని భావిస్తున్నారట.

గతంలో వైసిపి ఇన్చార్జిగా పనిచేసి పోటీ చేసే అవకాశం దక్కక అసంతృప్తికి లోనైన గుణ్ణం నాగబాబుతో ఇప్పటికే పార్టీ పెద్దలు చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూపులుగా విడిపోయిన నేతలు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేపడుతుంటే వారిని సమన్వయం చేసే నాయకత్వలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వీలైనంత త్వరగా కొత్త ఇన్చార్జి లేకుంటే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందనే అభిప్రాయంతో ఉన్నారు ఇక్కడి నేతలు.