Off The Record: తెలంగాణ బీజేపీలో దరఖాస్తు గడువు ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు భారీగా అప్లికేషన్స్ పెట్టేశారు. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. పార్టీ పరంగా కీలకం అనుకున్న నాయకుల్లో చాలా మంది ఈ వ్యవహారానికి దూరంగా ఉన్నారు. జాతీయ పార్టీ గనుక ఎంత సీనియర్, సూపర్ లీడర్ అయినా… దరఖాస్తు చేసుకోవడం అన్నది తప్పనిసరి ప్రక్రియ. అలాంటప్పుటు కీలక నేతలు ఎందుకు దూరంగా ఉన్నారన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వస్తున్నాయి. అంటే వాళ్ళకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదా? లేక హై కమాండ్ నుంచి క్లియరెన్స్ లేక ఆగారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కమలం గుర్తు మీద పోటీ చేయాలని అనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలంటూ.. ఈ నెల నాలుగు నుంచి 10 వరకు సమయం ఇచ్చింది హై కమాండ్. ఈ గడువులోపు 6 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. కొందరు రెండు నియోజకవర్గాలకు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి లాంటి నేతలు అస్సలు అప్లయ్ చేసుకోలేదు. ఈటల రాజేందర్ తరపున అనుచరుడు దరఖాస్తు ఇచ్చారు గానీ.. స్వయంగా ఆయన ఇవ్వలేదు. ఈ ముఖ్యనేతలంతా అలా ఎందుకు చేశారన్న చర్చ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడితో సహా కీలక నాయకులు ఈ ప్రక్రియకు ఎందుకు దూరంగా ఉన్నారంటే.. రకరకాల సమాధానాలు వస్తున్నాయి. కొందరు ఎంపీలుగా ఉన్నందున పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా వేచి చూద్దామనుకుంటున్నారట.
జోడు పదవులు బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకం గనుక ఎంపీగా ఉంటూ.. అసెంబ్లీకి దరఖాస్తు చేయడం భావ్యం కాదని ఆగినట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో హై కమాండ్ ఆదేశిస్తే.. పోటీ చేద్దామనుకుంటున్నట్టు తెలిసింది. మరి మిగతా వాళ్ళ సంగతేంటని ప్రశిస్తే మాత్రం సమాధానం లేదు. అయితే.. సిట్టింగ్ ఎంపీలు కాకుండా అసెంబ్లీకి దరఖాస్తు చేయని పెద్ద తలకాయల్లో ఎక్కువ మంది లోక్‌సభ సీట్లపై కన్నేసినట్టు తెలిసింది. అందుకే అప్పటిదాకా ఆగాలనుకుని ప్రస్తుత కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అప్లికేషన్స్ ఇచ్చేస్తే.. ఇక్కడే ఆగిపోతామని, అందుకే వేచి చూద్దామనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాదు, కూడదు.. గట్టిగా అసెంబ్లీ బరిలో దిగాల్సిందేనని అధిష్టానం గట్టిగా చెబితే అప్పుడు చూద్దామనుకుంటున్నారట సదరు నేతలు. మరి ఈ విషయంలో ఢిల్లీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
