NTV Telugu Site icon

Off The Record: ఆ విషయంలో వంగవీటి రాధా విఫలమయ్యారా?

Vangaveeti

Vangaveeti

Off The Record: తమకు కంచు కోటలుగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను వదిలి వెళ్ళటానికి నాయకులెవరూ పెద్దగా ఇష్టపడరు. గెలుపు గుర్రాలుగా రేస్‌లో ఉండి ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని ఢీ కొట్టాలంటే….బేస్‌ బలంగా ఉన్న సెగ్మెంట్సే కావాలని కోరుకోవడం సహజం. కానీ… అలాంటి నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలో టీడీపీ నేత వంగవీటి రాధా విఫలమయ్యారా అన్న చర్చ జరుగుతోంది. 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక టర్మ్ మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశారు రాధా. రెండు ఎన్నికల్లో ఓటమి, ఒకసారి అసలు పోటీకే దూరంగా ఉన్నారాయన. దివంగత ఎమ్మెల్యే రంగా కుమారుడిగా రాధాకు పాపులారిటీ బాగానే ఉంది. తన తండ్రి అభిమానులతో పాటు సొంత సామాజిక వర్గం కూడా ఆయనకు మరో బలం. అలాంటి వ్యక్తి గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంపై అప్పట్లో బాగానే చర్చ జరిగింది. ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పిన రాధా టీడీపీ కండువా కప్పుకోవటానికి కారణాలు చాలా ఉన్నా…వాటిలో నియోజకవర్గం కూడా ఒకటి. 2004లో తొలిసారి బెజవాడ తూర్పు నుంచి పోటీ చేసి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారాయన. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగటంతో కొత్తగా ఏర్పడిన విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి మల్లాది విష్ణుపై 848 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్లీ 2014లో వైసీపీ తరపున తూర్పున బరిలోకి దిగి 15వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019లో తిరిగి సెంట్రల్ నుంచి పోటీ చేయాలని రాధా భావించగా..వైసీపీ అధిష్టానం ఆయన్ని తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని సూచించిందట. ఆ క్రమంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోచేరి అసలు పోటీకి దూరంగా ఉన్నారట.

వాస్తవానికి వంగవీటి ఫ్యామిలీకి విజయవాడ తూర్పు నియోజకవర్గం కంచుకోట. ఇక్కడ నుంచి రంగా ఒకసారి, ఆయన భార్య రత్నకుమారి రెండుసార్లు, రాధా ఒకసారి గెలిచారు. అయితే.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తూర్పు సెగ్మెంట్‌లో ఉన్న గాంధీనగర్, సత్యనారాయణపురం, గవర్నరుపేట, హనుమాన్ పేట, గిరిపురం వంటి అనేక ప్రాంతాల్ని తీసి సెంట్రల్‌లో కలిపారు. కొత్తగా సింగ్ నగర్, పాయకాపురం వంటి ప్రాంతాలు వచ్చి కలిశాయి. తూర్పులోని చాలా ప్రాంతాలు కలిశాయన్న ఉద్దేశ్యంతో… 2009లో సెంట్రల్ నుంచి పోటీచేశారు రాధా. ఆ ఎన్నికల్లో ప్రజా రాజ్యం గుర్తు రైలింజన్, స్వతంత్ర్య అభ్యర్థి సింబల్‌ రోడ్డు రోలర్ కావటంతో రాధాకు రావాల్సిన ఓట్లు చాలా రోడ్డు రోలర్‌కు పడ్డాయని, సింబల్‌ తికమక లేకుంటే… ఆయన గెలిచేవారని చెబుతారు సన్నిహితులు. ఇక 2014లో తూర్పు నుంచి పోటీ చేసిన రాధాకు అక్కడ చేదు అనుభవం ఎదురవటంతో పాటు స్థానికంగా కొందరు నేతల తీరుతో విసుగెత్తిపోయారట. అందుకే ఇక తూర్పులో పోటీ చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. సెంట్రల్ తో పోలిస్తే తూర్పులో భారీ తేడాతో ఓటమి పాలవటం, నేతల తీరుతో విసుగెత్తిపోవటం లాంటి కారణాలతో ఇక పోటీ చేయడమంటూ జరిగితే…అది సెంట్రల్ నుంచేనని ఫిక్సయ్యారట ఆయన. 2019లో వైసీపీని వీడటానికి కూడా ఇదే కారణమంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం టీడీపీలో ఉన్నా…. జనసేన లోకి జంప్‌ అయి ఆ పార్టీ తరపున సెంట్రల్‌ బరిలో ఉండాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ జనసేన-టీడీపీ పొత్తు ఫైనల్‌ అయితే…. తెలుగుదేశం బలం కూడా ప్లస్‌ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. రెండు పార్టీల అధినేతలతో సత్సంబంధాలు ఉన్నందున ఏ పార్టీ టిక్కెట్‌ అయినా వస్తుందని, అదేమీ వివాదం కాదని అనుకుంటోందట రాధా వర్గం. దీంతో ఆయన జనసేనకు వెళ్తారా? లేక టీడీపీ తరపునే బరిలో దిగుతారా అన్న చర్చ బెజవాడ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది.