NTV Telugu Site icon

Off The Record: ఉండవల్లి ఎందుకు ఎంటరయ్యారు..? అసలు ఆయన టార్గెట్ ఎవరు..?

Undavalli Arun Kumar

Undavalli Arun Kumar

Off The Record: ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హాట్‌ హాట్‌ చర్చ జరుగుతోంది. ఇప్పుడు సడన్‌గా ఆయన పిల్‌ వెనకున్న ఉద్దేశ్యం ఏంటంటూ ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీలు ఆరా తీస్తున్నాయి. ఆయన ఎవరిని టార్గెట్‌ చేసుకున్నారన్న చర్చోపచర్చలు మొదలయ్యాయి. స్కిల్‌ స్కామ్‌పై వైసీపీ, టీడీపీ మధ్య ప్రచండ యుద్ధం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కేసును సిబిఐకి అప్పగించాలంటూ ఉండవల్లి హైకోర్టులో పిల్‌ వేయడం, ఈ వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉండటంతో ఇది ఎవరికి ముల్లుగా మారే ప్రమాదం ఉందన్న చర్చ జరుగుతోంది. ఆయన అలా ఎందుకు చేశారని వైసీపీ నేతల్లో సైతం అనుమానాలు పెరుగుతున్నాయట.

సిఐడి పకడ్బందీగా దర్యాప్తు చేస్తూ చంద్రబాబును అరెస్ట్‌ చేసేదాకా వెళ్లినప్పుడు ఆ సంస్థను కాదని ఉండవల్లి సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరుతున్నారో అర్ధం కావడం లేదని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. మరోవైపు టిడిపి నేతలైతే.. ఉండవల్లిపై నేరుగానే మాటల దాడి చేస్తున్నారు. ఉండవల్లి ముసుగు తీసేశారని, వైసిపి ప్రభుత్వంతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. దీంతో తీవ్ర స్థాయి విమర్శలు వస్తున్నా.. ఉండవల్లి నోరు మెదపడం లేదు ఎందుకు? అంటే.. టీడీపీ ఆరోపణల్లో వాస్తవం ఉందా అన్న అనుమానాలు సైతం వస్తున్నాయట పరిశీలకులకు. ఎప్పుడూ మీడియాకు అందుబాటు లో ఉండే ఉండవల్లి తాను వేసిన పిల్ మీద మాత్రం ఎందుకు మాట్లాడటం లేదన్న ప్రశ్నకు సమాధానం వెదుకుతున్నారు కొందరు.

అయితే… హైకోర్టులో వేసిన పిల్‌ విషయంలో ఆయనే స్వయంగా వాదించుకోబోతున్నారట. తన వాదనలను న్యాయమూర్తి ముందు వినిపించాల్సి ఉన్నందునే మీడియాకు దూరంగా ఉంటున్నారన్న సమాచారం వస్తోంది. ఆర్థిక విషయాలతో ముడిపడిన స్కిల్ స్కాం కేసు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉండటం, ప్రముఖ వ్యక్తులు నిందితులుగా ఉండటం వల్లే దర్యాప్తును కేంద్ర సంస్థతో జరిపించాలన్నది ఆయన వాదనగా చెబుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్‌ స్కీమ్‌ పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలవుతోంది. అక్కడ కూడా ఇలాంటి స్కామ్స్‌ జరిగి ఉండవచ్చన్నది ఆయన అనుమానమని ప్రచారం జరుగుతోంది. అందుకే సీబీఐ రంగంలోకి దిగితే ఏయే రాష్ట్రాల్లో ఏమేం జరిగిందన్న సంగతి బయటికి వస్తుందని, పరోక్షంగా ఉండవల్లి టీడీపీతో పాటు బీజేపీని కూడా టార్గెట్‌ చేశారా అన్న అనుమానాలు సైతం వస్తున్నాయట కొందరికి. బీజేపీ టార్గెట్‌గానే ఉండవల్లి పిల్‌ వేసినట్టయితే… రాజకీయంగా అది సంచలనం అవుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సమీకరణలు కూడా మారే ఛాన్స్‌ ఉందని అంటున్నారు విశ్లేషకులు. అసలు ఉద్దేశ్యం ఏంటన్నది ఉండవల్లి నోరు తెరిచాకే తేలాల్సి ఉంది.