Off The Record: కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఆసక్తి గా ఎదురు చూస్తోంది. మరీ ముఖ్యంగా ఆ ప్రభావం తెలంగాణ మీద ఎక్కువగా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు ఇక్కడి కమలనాధులు. దాన్ని బట్టి రాజకీయ సమీకరణలు సైతం మారతాయన్న చర్చోపచర్చలు పార్టీలో జరుగుతున్నాయి. కన్నడ నాట గెలిస్తే తెలంగాణలో రెట్టించిన ఉత్సాహంతో పని చేయవచ్చని, ఓడితే మోరల్‌గా దెబ్బ పడుతుందని మాట్లాడుకుంటున్నారు టి బీజేపీ నాయకులు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణే అనుకుంటున్న తమకు అక్కడ గెలవడం చాలా అవసరం అనే భావనతో ఉన్నారు. ప్రధానితో సహా బీజేపీ అధినాయకత్వం అంతా సర్వ శక్తులు ఒడ్డిందని, అక్కడ ఓడితే మోడీ కరిష్మా తెలంగాణలో కూడా పని చేయదని ఇక్కడి పార్టీలు ప్రచారం చేస్తాయని భయపడుతున్నారట కమలనాథులు .
కర్ణాటకలో బీజేపీ గెలిస్తే…తెలంగాణలో చేరికలు ఉంటాయని, టి కాంగ్రెస్ ఖాళీ అవుతుందని అంటున్నారు. అదే ఓడితే తమ పార్టీలోకి వలస వచ్చిన నేతల్లో ఎందరు ఉంటారో చెప్పలేమని, రివర్స్ జంపింగ్‌లు కూడా ఉంటాయని పార్టీలో అంతర్గతంగా అనుకుంటున్నట్టు తెలిసింది. అందుకే..కర్ణాటక ఎన్నికలు తెలంగాణ బీజేపీకి సంకటంగా మారాయట. అదంతా ఒక ఎత్తయితే.. ఓడిపోతే, కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌లు బీజేపీని టార్గెట్ చేస్తాయని… ప్రజల్లో అభిప్రాయం మారుతుందన్న భయం కూడా పెరుగుతోందట కమలనాథుల్లో. కర్ణాటక తర్వాత, తెలంగాణ ఎన్నికలకు మధ్య వేరే అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవీ లేవు. దీంతో పక్కరాష్ట్ర ప్రభావం ఇక్కడ ఖచ్చితంగా ఉంటుందన్నది తెలంగాణ బీజేపీ నేతల అంచనా. అందుకే పోలింగ్ సరళిని తెలంగాణ బీజేపీ నేతలు రకరకాలుగా విశ్లేషిస్తున్నారట. ఫలితాలు వచ్చేదాకా మాకు ఈ టెన్షన్ తప్పదన్నది టి బీజేపీ నేతలు అంతర్గతంగా చెబుతున్న మాట.