Site icon NTV Telugu

Off The Record: తెలంగాణ పెద్దల సభలో ఆ రెండు ఖాళీల భర్తీ జరగదా.?

Mlc

Mlc

Off The Record: తెలంగాణ రాజ్‌భవన్‌, ప్రగతి భవన్ మధ్య గ్యాప్‌ అంతకంతకూ పెరుగుతోందే తప్ప ఏ మాత్రం సెట్‌ అవుతున్న సూచనలు కనిపించడం లేదు. పెండింగ్‌ బిల్లులకు ఆమోద ముద్ర కోసం ఏకంగా సుప్రీం కోర్ట్‌ తలుపుతట్టాల్సి రావడంపై ఇప్పటికీ రగిలిపోతున్నాయట ప్రగతి భవన్‌ వర్గాలు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా రెండు పవర్ సెంటర్స్‌ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వారు ట్రిగ్గర్‌ నొక్కుతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఆశావహులు నలిగిపోతున్నారట. గవర్నర్ కోటాలోని రెండు MLC స్థానాలు మే చివర్లో ఖాళీ అయ్యాయి. మామూలుగా అయితే… ఏ ప్రభుత్వమైనా ఆ సీట్లను ఇన్నాళ్ళు ఖాళీగా ఉంచదు. రాజకీయ అవసరాలు, ఆశావహుల నుంచి వచ్చే వత్తిళ్ళతో ఖాళీ అవక ముందే కొత్త అభ్యర్థుల ఎంపిక జరిగిపోతుంది. కానీ… ఈసారి మాత్రం తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. రాజ్‌భవన్‌తో పెరిగిన గ్యాప్‌ దృష్ట్యా తాము ఎంపిక చేసిన అభ్యర్థులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేస్తారో, లేదోనన్న అనుమానం ప్రభుత్వ పెద్దల్ని వెంటాడుతోందట. అందుకే మీన మేషాలు లెక్కిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సాధారణంగా.. ఎంపిక చేసిన అభ్యర్థులకు కేబినెట్‌ మీటింగ్‌లో ఆమోద ముద్ర వేసి తర్వాత గవర్నర్‌కు పంపుతారు. అయితే ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో అసలు ఎమ్మెల్సీల ప్రస్తావనే రాలేదట. అనుమానాలు ఉంటే ఉన్నాయిగానీ… రెండు పదవులు ఖాళీ అయి ఇన్నాళ్ళయినా…ప్రభుత్వం ఇంత తాత్సారం చేయడం ఏంటని చేతులు నలుపుకుంటున్నారట ఆశావహులు.

Read Also: Off The Record: తెలంగాణలో పవన్‌ని బీజేపీ పూచికపుల్లతో సమానంగా చూస్తోందా.?

రాజ్ భవన్… ప్రగతి భవన్ మధ్య సంబంధాలు బాగా ఉన్నంత కాలం ఈ వ్యవహారమంతా గ్లాసులోని మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా జరిగిపోయింది. గవర్నర్ కోటాలో ఒక పేరును కేసీఅర్ క్యాబినెట్ ప్రతిపాదించడం…ఆ పేరుకు రాజ్‌భవన్‌లో స్టాంప్‌ వేయడం చకచకా జరిగిపోయేవి. కానీ… ఇప్పుడు రెండు అధికార కేంద్రాల మధ్య అంతరం పెరిగిపోయి అనుమానాలు, భయాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాము ఎవరి పేరు ప్రతిపాదిస్తే.. గవర్నర్‌ ఏ రూపంలో అభ్యంతరం చెబుతారోనన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో ఉందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ నేతలు, సానుభూతి పరులను ప్రతిపాదించిన తరువాత అట్నుంచి రెడ్‌ సిగ్నల్‌ పడితే అనంతర పరిణామాలు ఎలా మారతాయోనని చర్చిస్తున్నారట గులాబీ పార్టీ అగ్రనాయకులు. ఒకవేళ తేడాపడితే… లేని సమస్యను కొని తెచ్చుకున్నట్టు అవుతుందన్న అభిప్రాయం బీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఉందట. అందుకే ఏ మాత్రం తొందరపడకుండా… గవర్నర్ కోటా MLCల భర్తీ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల హీట్ రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితుల్లో… ఆ రెండు ఎమ్మెల్సీ సీట్ల భర్తీ విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి అన్ని వర్గాల్లో పెరుగుతోంది.

Exit mobile version