Site icon NTV Telugu

Off The Record: బలగం సెంటిమెంట్‌ కాంగ్రెస్‌లో వర్కవుట్ అవుతుందా?

T Cong

T Cong

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య ఐక్యత ప్రధాన సమస్యగా మారింది. సభలు…సమావేశాల్లో కలిసి మాట్లాడుకుంటారు. ఫొటోలకు ఫోజులు ఇస్తారు. ఆ తర్వాత కడుపులో కత్తులు పెట్టుకొంటారనే విమర్శ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ తరుణంలోనే కాంగ్రెస్‌లో నాయకుల మధ్య ఐక్యత ఎక్కడ?అనే చర్చ జరుగుతోందట. అందుకే నాయకులంతా ఏకతాటి మీద ఉన్నారనే ఇండికేషన్ ఇవ్వాలని చూస్తుంది అధిష్టానం. ఇప్పటికే పార్టీకి నష్టం చేసేలా కామెంట్స్ చేసిన నాయకులను బుజ్జగించిందని సమాచారం. కఠినంగా వ్యవహరించాల్సిన సందర్భంలోనూ కాస్త సానుభూతిని ప్రదర్శించిందని టాక్‌. ప్రత్యేక సమావేశాలు పెట్టిన నాయకులను అధిష్టానం దూతలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అందరూ కలిసి ఉండాలనే మంత్రాన్ని విహెచ్ లాంటి సీనియర్ నేతలు ఎత్తుకుంటున్నారు.

Read Also: Off The Record: రజినీకాంత్ను టార్గెట్ చేసిన రోజా..! యాక్షన్‌కు రియాక్షన్‌ తప్పదా..?

ఇక…ఇటీవల నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన నిరుద్యోగ సభలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. నల్గొండ జిల్లాకు రేవంత్ రావాల్సిన అవసరం లేదని చెప్పిన నాయకులు…ఘనంగా స్వాగతం పలికారు. క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి..ఉత్తమ్..రేవంత్ ఈ ముగ్గురు నాయకులు వేదికను పంచుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తటం హాట్ టాపికైంది. పక్కనే ఉన్న ఉత్తంకుమార్ రెడ్డిని ఆలింగనం చేసుకుంటూ మేమంతా ఒకటేననే సంకేతాన్ని ఇచ్చారు కోమటిరెడ్డి. ఇక మాజీ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి కూడా జానారెడ్డి సీనియర్ నాయకులందరితో సరదాగా గడిపారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని…మాజీ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డిని అభినందనలతో ముంచెత్తారు. రేవంత్ రెడ్డిని నల్గొండకు రావద్దని ఎవరు అనలేదంటూ…కోమటిరెడ్డి అదే వేదికపై చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూసిన పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు బలగం సినిమాలో లాగా అందరం కలిసిపోయామంటూ అదే వేదిక మీద నుంచి ప్రకటన చేశారు. ఇప్పటివరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య చాలా గ్యాప్ ఉందనే పరిస్థితి నుంచి మెల్లమెల్లగా కలిసిపోయారని వరకు వ్యవహారం వచ్చింది. ఇక ఉత్తంకుమార్ రెడ్డి ….జానారెడ్డి ఇద్దరూ రేవంత్‌కు సంబంధించిన అంశంలో ఉండే భిన్నాభిప్రాయాలను చర్చించుకొని సాఫీగా సాగిపోయే ప్రయత్నాలు చేస్తుంటారు జానారెడ్డి. నల్గొండలో నిర్వహించిన సభలో కాంగ్రెస్ బలగం సినిమాలో మాదిరిగా ఐక్యతా రాగాన్ని పలికింది. దీంతో ప్రస్తుతానికైతే అందరూ కలిసి ఉన్నారనే ఇండికేషన్ని పంపించగలిగారు. ఇది పార్టీకి కొంత బలం చేకూర్చే అంశంగానే చెబుతున్నారు.

Read Also: Off The Record: బీఆర్ఎస్‌కు హ్యాట్రిక్ విజయం సాధ్యమేనా..?

ఐతే…కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు..ఎలా స్పందిస్తారో తెలియదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులు ప్రస్తుతం కొంత సంయమనం పాటిస్తున్నట్టే కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నాయకులంతా కలిసి ఉన్నట్టే కనబడుతున్నారు. కానీ ఎప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్ మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తోంది. పార్టీలో నాయకులకు స్వేచ్ఛ ఎక్కువ. అంతర్గత అంశాలపైనా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. ఇదే ప్రస్తుతం పార్టీకి తలనొప్పిగా మారింది. అంతర్గత అంశాలను ఎప్పుడూ బయటకు మాట్లాడని ఉత్తంకుమార్ రెడ్డి కూడా అసమ్మతి నేతల సమావేశంలో బయటపడ్డారు. ఇవన్నీ గతం. ఐతే నల్గొండలో కాంగ్రెస్ నేతలు ప్రదర్శించిన ఐక్యత చూసిన వాళ్లకు..బలగం సినిమాను గుర్తుకుతెచ్చింది. ఐతే ఈ ఐక్యత కొనసాగుతుందా?లేదంటే మళ్లీ ఏదో ఒక సమస్య వచ్చి గందరగోళంగా మారుతుందా?అనేది డౌటే. సీనియర్ నాయకులు కోరుతున్న బలగం సినిమా సెంటిమెంట్ హిట్ అవుతుందో..ఫట్ అవుతుందో చూడాలి మరి !?

Exit mobile version