NTV Telugu Site icon

Off The Record: తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది..?

Bjp

Bjp

Off The Record: వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రగతి భవన్‌లో పాగా వేయాలని కలలుగంటున్నారు తెలంగాణ కమలనాథులు. ఆ దిశగా ముమ్మర కసరత్తులే చేస్తున్నట్టు పైకి కనిపిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల దాకా ఏదో జరిగిపోతోందన్న బిల్డప్‌లు కూడా బాగానే ఉన్నాయి. కానీ… ఆ తర్వాత ఎందుకో తెలీని… పైకి చెప్పుకోలేని భావన ఏదో తమ నేతల్లో కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఎవరికి వారు ఢిల్లీ వెళ్ళి అధినాయకత్వాన్ని కలిసి వస్తున్నారు. కానీ… ఎవ్వరూ ఏమీ చెప్పడం లేదు. ఇదంతా చూస్తున్న కొందరు నాయకులు మాత్రం ఏదో జరగబోతోందని అనుకుంటున్నారు.

టీ బీజేపీలో ముందు నుంచి ఉన్న నేతలకు, వలస నేతలకు మధ్య అంతరం ఏర్పడిందన్నది ఇంటర్నల్‌ టాక్‌. రాను రాను ఆ అంతరం పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే….ఇప్పుడున్నట్టుగా నడిపిస్తే సరిపోదని అంటున్నారు వలస నాయకులు. స్పీడ్‌ అందుకోవాలని, మార్పులు జరగాలని అంటున్నారు. కానీ.. ఆ మార్పులు ఏంటన్నది పైకి చెప్పడం లేదు. ఈటల రాజేందర్‌ ఇటీవల ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా సింగిల్‌ సింగిల్‌గా వెళ్ళారు. ఎవరికి వారు వెళ్తున్నారు.. వస్తున్నారు తప్ప మేటర్‌ ఎక్కడా ఓపెన్‌ కావడం లేదు. ఈ సందట్లోనే… రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చబోమన్న సంకేతాలు ఢిల్లీ నుంచి వచ్చాయట. అంటే.. అసలు మార్చాలన్న ప్రతిపాదన ఎలా వచ్చింది? ఎవరు చేశారన్న విషయంలో స్పష్టత లేదు. ఎన్నికల ముంగిట్లో ఇప్పుడా ప్రస్తావన ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు.

జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే… కొత్త నేతలు పార్టీని ఇప్పుడున్న స్థితిలోగాక ఇంకోలా చూడాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే… అది ఎలాగన్న విషయం మాత్రం చెప్పడం లేదు. అంతా ముసుగులో గుద్దులాట వ్యవహారంలాగే ఉంది. నేను ఏ పదవి అడగబోనని ఈటల రాజేందర్‌ గతంలోనే స్పష్టంగా చెప్పారు. కానీ…చేతలు అస్పష్టంగా ఉన్నాయని అంటున్నారు పార్టీలోని కొందరు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా గట్టిగా ఆరు నెలల సమయం కూడా లేదు. పార్టీ పరంగా ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు లేరు. అందుకే వలసలను ప్రోత్సహించాలని నిర్ణయించి చేరికల కమిటీని పెట్టి దానికి ఛైర్మన్‌గా ఈటలనే నియమించింది పార్టీ. ఇప్పుడా కమిటీ ఏం చేస్తోందో ఎవరికీ తెలియదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కమలం గూట్లోకి జంప్‌ అవడానికి ఇతర పార్టీల నాయకులు పెద్దగా ఇష్టపడటం లేదని తెలిసింది. ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా బయటి చూపులు చూస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. దీంతో పార్టీ పరంగా పాత ముఠా, కొత్త ముఠా అని స్పష్టమైన విభజనరేఖ ఏర్పడ్డట్టు చెప్పుకుంటున్నారు. ఈ సమస్యలన్నిటినీ అధిగమించి అధినాయకత్వం రాష్ట్ర పార్టీని అసెంబ్లీ యుద్ధానికి ఎలా సిద్ధం చేస్తుందో చూడాలి.