Off The Record: తెలంగాణ కమలం కల్లోలంగానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కేడర్‌లో పెరుగుతోందట. నాయకుల పరస్పర విరుద్ధ ప్రకటనలు, కూడికలు, తీసివేతలు, గ్రూపులతో వ్యవహారం మొత్తం నివురు గప్పిన నిప్పులా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ ఆఫీస్ దాకా ఎక్కడా పాజిటివ్ వైబ్స్ కనిపించడం లేదని, పార్టీకి అనుకూలంగా ఏదో ఒక పెద్ద పరిణామం జరిగితే తప్ప ఈ అభద్రతా భావం పోదన్న చర్చ నాయకుల మధ్య గట్టిగానే జరుగుతోందట. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత… ఒక్కసారిగా ఊహించని కుదుపునకు గురైన రాష్ట్ర పార్టీ.. ఇంకా కుదురుకోలేదన్నది అంతర్గతంగా నాయకులు చెప్పుకుంటున్న మాట. ఆ ఫలితాల దాకా మాంచి ఊపు మీద ఉన్న పార్టీకి సడన్ బ్రేకులు పడ్డాయని, దానికి తోడు కొందరు నేతలు చేసిన కామెంట్స్, అధ్యక్ష మార్పుతో పార్టీ శ్రేణులు తీవ్ర గందరగళంలో ఉన్నాయంటున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షనే అందుకు కారణమన్నది ఇన్‌సైడ్ టాక్.
చాలా మంది నేతలు పార్టీని వీడతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. రోజుకో నాయకుడి పేరు తెరపైకి రావడం… ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో కొంత మంది సూట్ కేస్ సర్దుకుని రెడీగా ఉన్నారన్న ప్రచారంతో ఉండేదెవరు? వెళ్లేదెవరన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఈ అనవసరమైన చర్చలే నెగెటివ్ వైబ్స్‌ని పెంచుతున్నాయంటున్నారు కొందరు నాయకులు. పనికిరాని వ్యవహారాలతో అసలు పార్టీలో ఏం జరుగుతోందోనన్న అయోమయం పెరిగిపోతోందంటున్నారు. ఇప్పుడిప్పుడే అంతా సద్దుమణుగుతున్నట్టు పైకి కనిపిస్తున్నా… లోపలి వాతావరణం మాత్రం అలాగే ఉందట. పార్టీని వదులుతారని ఎవరి మీదైతే ప్రచారాలు జరిగాయో… వారంతా ప్రస్తుతానికి కామ్‌గానే ఉన్నా….ఇక వదిలి వెళ్ళబోమని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. వాటికి సమాధానాలు మాత్రం ఏ నాయకుడి దగ్గరా లేవు. పరిస్థితిని చక్కదిద్దేందుకు హై కమాండ్ రంగంలోకి దిగింది. వరుస మీటింగ్‌లతో కేడర్‌లో నైతిక స్థైర్యం పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కిషన్ రెడ్డి , ఈటలతో మిగతా రాష్ట్ర స్థాయి నేతలు కొందరు పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నాలు చేస్తున్నా…అవి సత్ఫలితాలనిస్తున్నాయా లేదా అన్న అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయట.
గందరగోళాన్ని తొలగించి భరోసా నింపే ప్రయత్నాలు ఓవైపు జరుగుతున్నా…బీజేపీ నేతల్లో భయం మాత్రం పోవడం లేదట. చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంది. అయినా… ఏదో తెలీని వెలితి టీ బీజేపీ నేతల్ని వెంటాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్ని మాటలు చెప్పినా… మీటింగ్‌లు పెట్టినా…పార్టీకి అనుకూలంగా ఏదో ఒక బలమైన మార్పు జరిగితే తప్ప… కార్యకర్తల్లో ఉన్న అభద్రతా భావం పోదని ముఖ్య నేతలే అంటున్నారు. పార్టీకి టర్నింగ్ పాయింట్ అంటూ ఒకటి రావాలని, లేకుంటే నైరాశ్యం వీడదని అంటున్నారు. మరిప్పుడు ఆ టర్నింగ్ పాయింట్ ఏంటన్నది మాత్రం ఎవరికీ అర్ధం కావడంలేదట.
