NTV Telugu Site icon

Off The Record: టెక్కలి వైసీపీలో మూడు గ్రూపులు..! దువ్వాడ గెలుస్తాడా..?

Tekkali

Tekkali

Off The Record: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఆయన్ని ఓడించి తీరాలన్న పట్టుదలతో ఉంది అధికార పార్టీ. కానీ…స్థానికంగా ఉన్న గ్రూపులు వైసీపీని ఇరుకున పెడుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి , కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్ పేరాడ తిలక్ … ఇలా ముగ్గురు మూడు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోటాపోటీగా గ్రూపులు మెయిన్‌టేన్‌ చేస్తూ..ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. ఈ గ్రూప్‌ వార్‌ మీద ఫోకస్‌ పెట్టిన వైసీపీ అగ్ర నాయకత్వం విభేదాలు వీడాల్సిందేనని తేల్చి చెప్పేసిందట. తాజాగా మూలపేట పోర్ట్ శంకుస్థాపనకు వచ్చిన సిఎం జగన్ టెక్కలిలో తమ అభ్యర్ది దువ్వాడ శ్రీనివాస్ అంటూ సభలోనే ప్రకటించారు. శ్రీనుని మీచేతుల్లో పెడుతున్నానని కూడా చెప్పేశారు. గందరగోళం ఉండకూడదనే దువ్వాడ శ్రీను పేరును ముందుగానే ప్రకటిస్తున్నానని అన్నారు ముఖ్యమంత్రి . ఇంత వరకూ బాగానే ఉంది.

కానీ, గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్‌కు కాళింగ కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవి ఇచ్చినా.. ఆయనకు సంతృప్తి లేదట. మరో వైపు కిల్లి కృపారాణి పార్టీలో చేరిననాటి నుంచి పదవి మాత్రం అందని ద్రాక్షలా ఊరిస్తోందట. బయటపడకపోయినా కృపారాణి వర్గం లోలోన రగిలిపోతోందట. తమ నాయకురాలిని వైసిపి కరివేపాకులా చూస్తోందని ఆవేదనగా ఉన్నారట ఆమె అనుచరులు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఇంకా పదవీకాలం ఉండగానే…దువ్వాడ అభ్యర్థిత్వాన్ని ఇంత ముందుగా జగన్‌ ప్రకటించడం స్థానికంగా కలకలం రేపుతోంది. దువ్వాడ ముందు ఇప్పుడు అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. ముందు టెక్కలి వైసీపీలో ఉన్న మూడు గ్రూపులను ఒకే తాటి మీదికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కిల్లి కృపారాణికి సముచిత స్థానం ఇప్పించి ఆమె వర్గంతో ఓకే అనిపించుకోవాల్సి ఉంది. అలా కాకుంటే క్యాడర్ కలసి పనిచేయలేదన్నది లోకల్ టాక్ . ఎన్నికలకు ఏడాది ముందే.. అభ్యర్ధిని ప్రకటించడంతో ప్లస్‌ పాయింట్స్‌ కనిపిస్తున్నా , గ్రూపుల గోల మాత్రం చాపక్రింద నీరులా పెరుగుతూనే ఉందని అంటున్నారు. ఆ గొడవ తగ్గకుంటే… ప్రత్యర్దిగా ఉన్న అచ్చెన్నాయుడుని ఢీ కొట్టడం కష్టమన్నది పార్టీ పార్టీ నాయకుల మనసులో మాట అట.

దువ్వాడకు ఎమ్మెల్సీ ఇచ్చారు కనుక తమకు ఎమ్మెల్యేగా అవకాశం ఉంటుందని ఆశించారట మిగతా నేతలు. ఇన్నాళ్ళు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి సీఎం ప్రకటన మింగుడుపడటం లేదట. ఈ విషయంలో సభా వేదిక దగ్గరే కొందరి ముఖాల్లో మార్పు వచ్చేసిందట. క్షేత్ర స్థాయి పరిస్థితులు పెద్దలకు తెలియడం లేదు…దువ్వాడ అందర్నీ కలుపుకుని పోవడం లేదని నిట్టూర్చారట. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. దువ్వాడ మిగతా వారితో సమన్వయం చేసుకుని కలుపుకుని పోవడానికి ఈ టైం చాలు. మరి ఆయన ఆపని చేస్తారా? లేదా? ఎన్నికల నాటికి అన్ని గ్రూపులు కలిసి తనకు పని చేసేలా మార్చుకుంటారా? అన్నది చూడాలి.

Show comments