Off The Record: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో హీట్ పుట్టిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి సాధారణ ఎన్నికలను తలపించేలా నడుస్తోంది వ్యవహారం. కూటమి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందట. అలాగే ప్రధాన పోటీదారుగా భావిస్తున్న.. పిడిఎఫ్‌తోపాటు ఇతర ఉద్యోగ సంఘాలుకూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపి.. సవాల్ విసురుతున్నారు. ఇటు ప్రభుత్వం, అటు ఆయా సంఘాల తరపున అనేకమంది ఎమ్మెల్సీ బరిలో నిలవడంతో.. మేటర్ మామూలుగా లేదని అంటున్నారు. ఓట్లు చీల్చడం కోసమే కొందరి బరిలో ఉన్నారన్న ప్రచారం సైతం జరుగుతోంది. మొత్తంగా…ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ బరిలో 35 మంది అభ్యర్థులు ఉన్నారు. మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే ప్రధాన పోటీ… అధికార కూటమి నుంచి టిడిపి అభ్యర్థిగా ఉన్న పేరాబత్తుల రాజశేఖరం, వామపక్ష పార్టీల పిడిఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీటు పిడిఎఫ్‌కు సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి నిలబెట్టుకునేందుకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి తన ఖాతాలో వేసుకుని శాసనమండలిలో బలపడాలని పట్టుదలగా ఉందట టీడీపీ. దీంతో ఇక్కడ గెలుపును సీరియస్ తీసుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు గోదావరి జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలను పదేపదే హెచ్చరిస్తున్నారట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో 14 మంది తమ అభ్యర్థి గెలుపును అంతగా సీరియస్‌గా తీసుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 10 వేల మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల్లో సెటిలైన వాళ్ళే. కానీ…టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా… సాధారణ ఎన్నికల తరహాలోని వార్డులు… గ్రామాల్లోకి వెళ్లి డోర్ టు డోర్ తిరిగేసి… మమ అనిపిస్తున్నారట. అసలైన ఓటర్లు గ్రాడ్యుయేట్స్ దగ్గరికి వెళ్ళకుండా…తమ విధానాలేంటో వివరించకుండా… నియోజకవర్గాల్లో సాధారణ ఎన్నికల్లోలాగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే… నో ఆన్సర్. అందుకే… టీడీపీ ఎమ్మెల్యేలకు తమ అభ్యర్థి గెలవాలన్న తపన కంటే… షోఆఫ్ ఎక్కువైందన్న మాటలు వినిపిస్తున్నాయి.
అందుకే… ఇంత చేయమంటే… వాళ్ళు అంత చేస్తున్నారేంట్రా బుజ్జా… అంటూ గోదావరి ఎటకారపు సెటైర్స్ పడుతున్నాయట. టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కోనసీమ జిల్లాలోని ఓ మండలానికి చెందిన మాజీ జెడ్పిటిసి. గతంలో సీఎం చంద్రబాబుకు ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ గా పని చేశారు. ఆరు జిల్లాలుగా ఉన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల్లో ఆయనకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇమేజ్ లేదని అంటారు. కేవలం కూటమి అభ్యర్థి కావడం..పార్టీ అధినేత ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టడంతో గెలుపుపై ఆశలు పెట్టుకున్నారన్నది లోకల్ టాక్. ప్రధానంగా గత నాలుగు నెలల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన టిడిపి గోదావరి జిల్లాల్లోని ఎమ్మెల్యేల ద్వారా లక్ష మంది పైగా ఓటర్లను జాయిన్ చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తం ఓటర్లు 3 లక్షల 26 వేల మంది. దీంతో టిడిపి ఎమ్మెల్యేలు గెలుపు పై ధీమాగా ఉన్నారట. ఎంత ధీమా ఉంటే మాత్రం ప్రచారంలో నాన్ సీరియస్ గా ఉండటంతో… పట్టభద్రుల ఆలోచన ఎలా మారుతుందో… వారు ఎలాంటి తీర్పు ఇస్తారోనన్న ఆసక్తి పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.