NTV Telugu Site icon

Off The Record: పోలింగ్ ముంగిట్లో టీడీపీకి స్కీమ్‌ల టెన్షన్ పట్టుకుందా..?

Ap

Ap

Off The Record: ఏపీలో కొన్ని సంక్షేమ పథకాల అమలును అడ్డుకుంటున్నారంటూ కూటమి పార్టీలను టార్గెట్‌ చేసుకుంటున్న రాజకీయం జోరుగా సాగుతోంది. ఆసరా, ఇన్పుట్ సబ్సిడీ, చేయూత, ఈబీసీ నేస్తం వంటి పథకాలను ఆపేయమని ఎన్నికల సంఘం చెప్పిందని.. వాటిపై కూటమి పార్టీలే ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకున్నాయని సీఎం జగన్‌ సహా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. ఇప్పటికే పెన్షన్ల పంపిణీలో టీడీపీ కావచ్చు.. కూటమి పార్టీలు కావచ్చు.. పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాయి. అందులో తమ ప్రమేయం లేదని జనానికి వివరణ ఇచ్చుకునేందుకు నానా తంటాలు పడింది టీడీపీ. ఈ పరిస్థితుల్లో కొన్ని సంక్షేమ పథకాల విషయంలో అదే తరహా ఆరోపణలు ఎదుర్కొవడమనేది మహా ఇబ్బందిగా మారుతోందన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు.. పేదలకు అందిస్తున్న పథకాలను అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి పార్టీలు కావాలనే పని గట్టుకుని ఈసీకి ఫిర్యాదులు చేయడమో.. లేక ఈసీ మీద ఒత్తిడి తేవడమో చేస్తున్నాయనేది వైసీపీ ఆరోపణ. దీంతో వీటికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత టీడీపీ మీద.. ఇతర కూటమి పార్టీల మీద పడ్డట్టు కన్పిస్తోంది. దీంతో పథకాల నిలిపివేత అనే అంశంపై అధికార పార్టీకి గట్టిగా కౌంటర్లు ఇవ్వక తప్పని పరిస్థితి.

ఇప్పటికే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా తాము ఇబ్బందుల్లో పడుతున్నామనే అంశాన్ని గుర్తించిన అధికార పార్టీ.. అందుకు కౌంటర్‌గా సంక్షేమాన్ని కూటమి పార్టీలు అడ్డుకుంటున్నాయనే ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తోందట. ఈ క్రమంలో దీనికి సరైన కౌంటర్‌ ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవనే ఆందోళన టీడీపీలో కన్పిస్తోందంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో జగన్‌ ఆ సంక్షేమ పథకాలకు ఎప్పుడు బటన్‌ నొక్కారు.. లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ కావాల్సి ఉంది..? ఇన్నాళ్ళు ఎందుకు ఆగాయన్న విషయాన్ని తెర మీదకు తెస్తున్నారట టీడీపీ నేతలు. జనవరి 23 తేదీన ఆసరాకు 6వేల 394 కోట్ల రూపాయల మేర నిధులను విడుదల చేస్తూ జగన్‌ బటన్‌ నొక్కారని గుర్తు చేస్తున్నారు. అలాగే మార్చి ఒకటో తేదీన 2023 అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య కాలానికి చెందిన విద్యా దీవెన నిధులు 708 కోట్ల 68 లక్షల రూపాయలను విడుదల చేస్తూ మరో బటన్‌ నొక్కారని టీడీపీ గుర్తు చేస్తోంది. అలాగే మార్చి ఆరో తేదీన 1294 కోట్ల 58 లక్షల రూపాయల మేర నిధులను ఇన్పుట్‌ సబ్సిడీ కోసం విడుదల చేసినట్టు లెక్కలు వేసి చెబుతోంది టీడీపీ.

వాటితో పాటు మార్చి ఏడో తేదీన చేయూత పథకం కోసం బటన్‌ నొక్కారు సీఎం. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ రావడానికి కంటే ముందు మార్చి 14వ తేదీన ఈబీసీ నేస్తానికి నిధులు విడుదల చేశారన్నది టీడీపీ వాదన. మార్చి 14వ తేదీన జగన్‌ చివరిసారిగా బటన్‌ ప్రెస్‌ చేశారని గుర్తు చేస్తోంది టీడీపీ.ఈ క్రమంలో ఇప్పటి వరకు నిధులు చేరలేదంటే దానికి బాధ్యులెవరని అడుగుతూ అదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలనుకుంటున్నారట టీడీపీ నేతలు. ఖాజానాను ఖాళీ చేసేసి.. ఉత్తుత్తి బటన్‌లు నొక్కడం ఎంత వరకు కరెక్ట్‌ అని ప్రశ్నిస్తోంది తెలుగుదేశం పార్టీ. అయితే… సమయం అతి తక్కువగా ఉన్నందున ఈ వాదనను ప్రజల్లోకి ఎంతవరకు తీసుకువెళ్ళగలుగుతామన్న డౌట్స్‌ టీడీపీ వర్గాల్లో కూడా ఉన్నాయట. చివరి మూడు రోజుల్లో ఎవరి వాదన ఎంత మేర ప్రజల్లోకి వెళ్తుందో చూడాలంటున్నారు పరిశీలకులు.