Site icon NTV Telugu

Off The Record: పొత్తులపై జనసేన కేడర్‎లో తీవ్ర గందరగోళం..!

Tdp Js

Tdp Js

Off The Record: పొత్తు…. అన్న మాట వింటే చాలు…. జనసేన కేడర్‌ ముఖాల్లో ఇది అని చెప్పడానికి వీల్లేని రకరకాల భావాలు కనిపిస్తున్నాయట. ఫేస్‌ రీడింగ్‌లో కాకలు తీరిన వారు సైతం వాటికి అర్ధాలు వెదుక్కోలేక కిందా మీదా అవ్వాల్సి వస్తోందట. అలా ఎందుకయ్యా…. అంటే, పొత్తులపై తమ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా మాట్లాడుతుండడంతో…అడిగే వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వెర్రి చూపులు చూడాల్సి వస్తోందట కార్యకర్తలు. ఓ సందర్భంలో పొత్తు ఉంటుందని.. మరో సందర్భంలో మన మర్యాద తగ్గకుండా ఉంటుందని.. ఇంకో సందర్భంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని.. వేరే సందర్భంలో బీజేపీ లేకున్నా ఫర్వాలేదనే రీతిలో … తీరుకో రకంగా పవన్ కామెంట్లు చేస్తుండడంతో కేడర్‌కు చుక్కలు కనిపిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదంతా చాలదన్నట్టు తాజాగా మరో గందరగోళం మాట మాట్లాడారట పవన్‌. పూర్తిగా అధ్యయనం చేశాకే పొత్తులపై నిర్ణయం అనే రీతిలో మాట్లాడిన తాజా మాటలతో పార్టీ కేడర్‌కు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతోందట. అంటే ఇన్నాళ్ళు అధ్యయనం లేకుండానే అధినేత ఇన్ని రకాల మాటలు మాట్లాడారా అని వాళ్ళలో వాళ్ళే గుసగుసలాడుకుంటున్నారట.

Read Also: Off The Record: వైఎస్‌ జయంతికి ట్వీట్‌ చేసిన రాహుల్‌.. రాజకీయ వ్యూహం ఉందా?

పొత్తులపై ఇప్పుడు కొత్తగా అధ్యయనం చేయడమేంటీ..? గతంలో అవన్నీ ఆలోచించకుండా ఏదో నోటికొట్టిన మాటలు మాట్లాడేశారా ఏంటీ? అని ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో కొత్త చర్చ మొదలైపోయింది. జనసేనకు ఉభయ గోదావరి జిల్లాల్లో తప్ప వేరే చోట అంతగా బలం లేదని, సీట్ల విషయంలో ఆ బలాబలాను బేరీజు వేసుకునే.. పోటీ గురించి ఆలోచించాలని గతంలో అన్నారు పవన్‌. మరి ఈ కామెంట్లు ఏ అధ్యయనం చేయకుండానే చేసేశారా..? ఒక ప్రధాన రాజకీయ పార్టీకి సారధ్యం వహిస్తున్న, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదామనుకున్న వ్యక్తి మాట్లాడాల్సింది ఇలాగేనా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఒక పద్ధతంటూ లేకుండా ఏదో… గాలి పోగేసి ..ఇలా పూటకో మాట మాట్లాడితే క్రెడిబులిటీ దెబ్బ తినదా అంటూ.. తలలు పట్టుకుంటున్నారట జనసేన నేతలు. ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడితే ప్రజల్లో కామెడీ అయిపోవడంతో పాటు కేడర్ కూడా కన్ఫ్యూజనులో పడి.. అసలుకే మోసం వస్తుందని అంటున్నారు. ఆల్రెడీ పొత్తుల విషయంలో పవన్‌ది నిలకడలేని తత్వం అంటూ విమర్శలు వస్తున్నందున తాజాగా చేసిన అధ్యయనం కామెంట్స్‌ ఇంకా డ్యామేజ్‌ చేస్తాయని భయపడుతున్నారట పార్టీ సీనియర్స్‌. ఇప్పటికైనా మునిగిపోయిందేం లేదని, పూటకో మాట కాకుండా పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న విషయంలో క్లారిటీగా ఉంటే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, అలా కాకుండా పిల్లి మొగ్గలు వేస్తూ పోతే… చివరికి అభాసుపాలవుతామని కంగారు పడుతోందట కేడర్‌.

Exit mobile version