NTV Telugu Site icon

Off The Record: బీజేపీకి జనసేనపై ఉన్న ప్రేమ టీడీపీపై లేదా..? ఎందుకు పిలవలేదు..?

Tdp

Tdp

Off The Record: లోక్‌సభ ఎన్నికల టైం ఇక నెలల్లోకి వచ్చేసింది. ఇన్నాళ్ళు మాకేంటన్న ధీమాతో…పాత మిత్రుల విషయంలో పట్టీపట్టనట్టుగా ఉన్న బీజేపీ అధినాయకత్వం మారుతున్న రాజకీయ పరిస్థితుల్ని గమనించి, ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగానే…. ఇన్నాళ్ళు ఎక్కడున్నారో కూడా పట్టించుకోని ఎన్డీఏ మిత్రుల భుజాల మీద చేతులేసి రా… రమ్మంటోంది. మనం మనం బరం పురం అంటూ… ఎక్కడలేని…ఇన్‌స్టెంట్‌ ప్రేమ ఒలకబోస్తున్నారు కమలనాథులు. కూర్చుని మాట్లాడుకుందాం.. రమ్మని ఢిల్లీకి పిలిచారు. ఆ ప్రేమలో అవసరం ఉందా? నిజంగానే ఆప్యాయత ఉందా? అన్న సంగతి పక్కనబెడితే…. పిలుపుల మేటర్‌ మీద మాత్రం పెద్ద చర్చే జరుగుతోంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో ఈ మీటింగ్‌ హాట్‌ టాపిక్‌ అయింది. టీడీపీ కూడా పాత మిత్రుడే అయినా…. ఆ పార్టీని మీటింగ్‌కు ఎందుకు పిలవలేదన్న అంశం మీద రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అంటే…. బీజేపీ, తెలుగుదేశం పార్టీని పూర్తిగా వదిలేసినట్టేనా? లేక ప్రస్తుతానికి ఆపి ఎన్నికలకు ముందు చూసుకోవచ్చనుకుంటోందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఎన్డీఏ మిత్రుల మీటింగ్‌కు ఏపీ నుంచి జనసేనకు మాత్రమే పిలుపువచ్చింది. జనసేనతో ఆల్రెడీ పొత్తు ఉన్నందున అంతవరకు ఓకే… కానీ… మరోవైపు తెలుగుదేశం, జనసేన దగ్గరవుతున్న పరిస్థితుల్లో బీజేపీ… టీడీపీని వదిలేసి జనసేనను మాత్రమే పిలవడంతో రేపు ఎన్నికలక టైంలో పొత్తులు ఎలా ఉంటాయన్నది హాట్‌ టాపిక్‌ అయింది. గతంలో ఉంటే ఉందిగానీ… ఇక టీడీపీని వదిలించుకోవాలనే బీజేపీ పెద్దలు డిసైడయ్యారా? ఒకవేళ అదే జరిగితే…. పవన్‌ వైఖరి ఎలా మారుతుంది? టీడీపీని వదిలేసి మనం ఇద్దరమే కలిసి నడుద్దామని కాషాయ పార్టీ పెద్దలు అంటే… రియాక్షన్స్‌ ఎలా ఉంటాయన్న చర్చలు ఇప్పుడు ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జోరుగా జరుగుతున్నాయి. గతంలో ఎన్డీయేను వీడిన శిరోమణి అకాళీ దళ్‌కు మళ్లీ ఆహ్వానం పంపింది కమల దళం. ఆ లెక్కన చూస్తే… నాడు అంతకంటే కీలక పాత్ర పోషించిన టీడీపీకి కూడా పిలుపు వచ్చి ఉండాలి. కానీ…అది జరగలేదు. అంటే… ఇక తెలుగుదేశాన్ని బీజేపీ…పూర్తిగా పక్కనపెట్టినట్టేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎన్డీఏలో యాక్టివ్‌గా ఉన్న… చిన్నా చితకా… అన్ని పార్టీలకు సైతం….ఆహ్వానాలు వచ్చేశాయి. నిషాద్‌ పార్టీ, ఐపీఎఫ్‌టీ త్రిపుర,బీపీపీ లాంటి వాటిని కూడా పిలిచిన కమలనాథులు టీడీపీని పిలవకపోవడమంటే… కావాలని పక్కనపెట్టినట్టేకదా? అన్న మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో…ఇదే ఫైనలా? లేక పునరాలోచన ఉంటుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. టీడీపీని ప్రస్తుతానికి పక్కన పెట్టినా… ఎన్నికలకు ఇక 10 నెలల టైం ఉన్నందున అప్పటి పరిస్థితుల్నిబట్టి చూసుకోవచ్చన్నది వాళ్ళ ఆలోచనగా ఉందేమోనంటున్నారు.

మరోవైపు ఎట్నుంచి ఎటు చూసినా….ఏపీలో, అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షాలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్ని వ్యతిరేకించి గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇది కూడా బీజేపీ పెద్దల ధీమాకు ఒక కారణం అయి ఉండవచ్చంటున్నారు. ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లు ఉంటే… వాటిని ఎవరు గెల్చుకున్నా… చివరికి అవి మన ఖాతాలోవే కదా… ఆ మాత్రం దానికి కంగారెందుకు అన్న ఆలోచన కూడా బీజేపీ పెద్దలకు ఉన్నట్టు తెలిసింది. అలాంటప్పుడు ఎవర్ని పిలిస్తే ఏంటి? పిలవకుంటే ఏంటి… సమయం, సందర్భాన్ని బట్టి ఎవర్ని ఎక్కడైనా వాడుకోవచ్చన్నది కాషాయ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. అయితే…రాష్ట్రంలో వైసీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ మొదట్నుంచీ అంటున్నారు. అంటే, బీజేపీ కూటమిలో టీడీపీ కూడా ఉండాలన్నది పవన్ ఆలోచన. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబుతో పొత్తు వద్దంటే…. పవన్ రియాక్షన్ ఎలా ఉంటుంది? బీజేపీ పెద్దలను ఒప్పించి కూటమిలోకి రప్పించగలరా? అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు పరిస్థితి ఎటూ కాకుండా ఉంది. అటు విపక్ష కూటమి యూపీయే ముఖం చాటేసింది. ఇటు అధికార ఎన్డీయే కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టింది. ఈ పరిస్థితుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలపై ఆసక్తి పెరుగుతోంది.