NTV Telugu Site icon

Off The Record: గుర్తింపు లేనప్పుడు ఎందుకు..! ఫ్రస్ట్రేషన్‌లో తాడికొండ ఎమ్మెల్యే..

Mla Tenali Sravan Kumar

Mla Tenali Sravan Kumar

Off The Record: ఎమ్మెల్యే… నియోజకవర్గానికి రారాజు లాంటివాడు. అందునా అధికార పార్టీ శాసనసభ్యుడు అయితే… ఆ లెక్కే వేరు. ప్రత్యేకించి అభివృద్ధి పనుల విషయంలో తన ప్రమేయం లేకుండా చీమ చిటుక్కుమన్నా నానా రచ్చ చేసే ఎమ్మెల్యేలకు కొదవే లేదు. కానీ…. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌ పరిస్థితి మాత్రం రివర్స్‌లో ఉందట. ప్లీజ్‌… ఏం జరుగుతోందో నాకు చెప్పండి… లోకల్‌ ఎమ్మెల్యేగా నన్ను గుర్తించండి… అభివృద్ధి పనులకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వండంటూ ప్రభుత్వ పెద్దల్ని ప్రాధేయపడాల్సి వస్తోందట ఆయన. అమరావతి నిర్మాణం తిరిగి పట్టాలెక్కిన క్రమంలో అభివృద్ధి పనుల పరంగా తాడికొండ నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. కానీ… పై స్థాయిలో జరిగిపోతున్న నిర్ణయాలు ఏవీ ఎమ్మెల్యేదాకా రావడం లేదట. తనకు కనీస సమాచారం లేకుండానే… లోకల్‌గా ఎవరెవరో వచ్చి ఏదేదో చేస్తుంటాన్ని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. కనీసం నేనున్నానని గుర్తించకుంటే ఎలాగంటూ ఫ్రస్ట్రేట్‌ అవుతున్నారట ఆయన. ఎంత రాజధాని నిర్మాణం అయినా… పై స్థాయిలో నిర్ణయాలు జరుగుతున్నా… పెద్ద పెద్ద పనులు మొదలవబోతున్నా… నేకు కూడా ప్రజాప్రతినిధినే కదా… నాకు కనీస గుర్తింపు లేకుంటే ఎలాగంటూ… తాడికొండ ఎమ్మెల్యే సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Read Also: CM Chandrababu: ఇసుకపై సీఎం సమీక్ష.. ఫిర్యాదుల నేపథ్యంలో కీలక ఆదేశాలు.. రేపటి నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్

కాస్త దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరన్నా చొరవ తీసుకుని… అన్నా… అదేందీ… మనకు తెలియకుండా లోకల్‌గా ఏవేవో జరిగిపోతున్నాయి. ఇలాగైతే ఎలాగని అడిగితే…. మీరుండండ్రా బాబూ… నాకే అర్ధంగాక ఛస్తున్నా… నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం గురించి అయితే నాతో మాట్లాడండి, అభివృద్ధి పనుల ప్రస్తావన మాత్రం తీసుకురావద్దని తాడికొండ ఎమ్మెల్యే అంటున్నట్టు సమాచారం. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇక మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేయడాన్ని రీ టెండర్స్‌ పిలవబోతున్నారు. ఇక రుణాల సమీకరణ, పనుల్ని పరిగెత్తించడంపై ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెళుతోంది ఏపీ సర్కార్‌. తాడికొండ నియోజకవర్గం పరిధిలో కూడా ఈ పనులు ఎక్కువగానే జరగబోతున్నాయి. కానీ… ఏ అంశానికి సంబంధించిన కనీస సమాచారమూ…. తనకు తెలియడం లేదని, ఇంకా మాట్లాడుకోవాలంటే… పరిస్థితి కూరలో కరివేపాకులా తయారైందంటూ ఎమ్మెల్యే శ్రావణ్‌ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. సన్నిహితులు ఎవరన్నా నిర్మాణ పనుల గురించి అడిగితే… ఏమో సర్ నాకేం తెలీదు, నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తప్ప మరేవీ నాకు అర్ధంకావడం లేదని అంటున్నారట. అంతటితో ఆగలేని వారు … ఆ ప్రాంతం మొత్తం మీ పరిధిలోనిదేకదా అని రెట్టిస్తే… చెబుతున్నాను కదా… ప్రజల సమస్యలే తప్ప నాకు ఇంకేం తెలీదని విసుక్కుంటున్నట్టు సమాచారం.

Read Also: Supreme Court: ‘‘రిలేషన్‌షిప్ చెడిపోయిన తర్వాత రేప్ కేసులు’’.. సుప్రీం ఆందోళన..

ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ కూడా ఉందండోయ్‌. ఒకవేళ తన ప్రాంత ప్రజలు… ఇక్కడ జరగబోయే పనుల గురించి ప్రశ్నిస్తే… వాళ్ళ తరపున నేను కూడా సంబంధిత మంత్రిని క్వశ్చన్‌ చేస్తానని అంటున్నట్టు తెలిసింది. తనకు ఎలాంటి గుర్తింపు లేనపుడు, ఏం జరిగితే ఏముంది? ప్రతిదాంట్లో వేలుపెట్టి మూతికి రాసుకోవడం ఎందుకన్నట్టుగా ఉందట ఎమ్మెల్యే శ్రావణ్‌ వ్యవహారం. మొత్తం మీద ఎంత రాజధాని నిర్మాణం అయితే మాత్రం లోకల్‌ ఎమ్మెల్యేని, అందునా సొంత పార్టీ శాసనసభ్యుడిని నాకు కనీస గుర్తింపు లేకుండా ఎలాగన్నది శ్రావణ్‌ కుమార్‌ బాధగా తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు ఆయన బాధను అర్ధం చేసుకుంటారో… లేక ఇవన్నీ కామన్‌ అని లైట్‌ తీసుకుంటారో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.