NTV Telugu Site icon

Off The Record: ఆమదాలవలసలో తమ్మినేని సీతారామ్‌కు సెగలు

Thammineni Seetharam

Thammineni Seetharam

Off The Record: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు సొంత నియోజకవర్గం ఆమదాలవలసలో సెగలు రేగుతున్నాయట. ఇన్నాళ్ళు సెగ్మెంట్‌లో బలమైన నేతగా ఉన్న తమ్మినేనికి ఇప్పుడు సొంత సామాజిక వర్గం నేతలే ఎర్త్‌ పెట్టే ప్రయత్నాల్లో ఉన్న్టటు తెలిసింది. 2019 ఎన్నికల తరువాత సైలెంట్‌గా ఉన్న అసమ్మతి నేతలు ఇటీవల యాక్టివ్‌ అయ్యారని, అందుకే వారు ఎమ్మెల్యేతో అంటీ ముట్టనట్టుగా ఉన్నారన్నది లోకల్‌ టాక్‌. స్థానిక వైసిపి సీనియర్ నేతలు సువ్వారి గాంధీ , చింతాడ రవికుమార్‌ తోపాటు కోటా బ్రదర్స్ సమాంతర రాజకీయం నడుపుతూ… ఆయనకు సవాల్‌ విసురుతున్నారట. ఆమదాల వలస వైసీపీలో రెబెల్స్‌ మూడు గ్రూపులుగా ఉన్నారు. వీళ్లందర్నీ ఒకతాటి మీదికి తీసుకువచ్చి తాను నాయకత్వం బాధ్యతలు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట సువ్వారి గాంధీ. అధిష్టానానికి అభ్యర్థిని మార్చాలన్న ఆలోచన వస్తే… ఆ ఛాయిస్‌ తానే కావాలన్నది ఆయన ప్లాన్‌.

ఈ ఎత్తులు, పై ఎత్తులతో నియోజకవర్గ పార్టీ కేడర్‌లో గందరగోళం పెరుగుతుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే… ఇక్కడ వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవడం అంత తేలికకాదని వైసిపి క్యాడరే అంటోందట. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కూడా మండలాల వారిగా విడిపోయి మీది సువ్వారి వర్గం , మాది తమ్మినేని వర్గం అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. బర్త్‌ డేల పేరుతో బల ప్రదర్శలు జరుగుతున్నాయి. గతంలో కోట బ్రదర్స్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించి తమ్మినేనికి సవాలు విసిరారు. తర్వాత సువ్వారి గాంధీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు బర్త్‌ డే పేరుతో ఆత్మీయ సమావేశం పెట్టారు. పొందూరు , సరుబుజ్జిలి , బూర్జ , ఆమదాలవలస మండలాల నుంచి పెద్ద ఎత్తున వైసిపి నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది చూస్తున్న వారంతా అసమ్మతి గ్రూపులను కట్టడి చేయటంలో విఫలమైన తమ్మినేని రాజకీయంగా సవాల్‌ ఎదుర్కొంటున్నారని కామెంట్‌ చేస్తున్నారు.

ఈసారి ఎన్నికల్లో తమ్మినేనికి కాకుండా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలుస్తామని అంటున్నారు రెబెల్స్‌ సువ్వారి గాంధీ , చింతాడ రవికుమార్. ఆ అసమ్మతి గ్రూపుల నేతలు ధర్మాన ప్రసాదరావుతో కలిసి మంత్రాంగం నడపడం ఇక్కడ చెప్పుకోవాల్సిన ట్విస్ట్‌. మరో వైపు వైసీపీ అంతర్గత విభేదాలు…. టీడీపీకి కలిసి వస్తున్నాయట. ఇక్కడ ప్రతిపక్ష కేడర్‌ ఇప్పటికీ బలంగానే ఉంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు. మూడు ముక్కలాటతో వైసీపీ సతమతం అవుతుంటే… దాన్ని అనుకూలంగా మలుచుకుని పాగా వేసే దిశగా తెలుగుదేశం వ్యూహాలు సిద్దం చేసుకుంటోందట. ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్‌ అవుతాయో చూడాలి.

తమ్మినేని సీతారామ్కు సెగలు..వైసీపీ కేడర్లో పెరుగుతున్న గందరగోళం l Off the Record l NTV