Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పీక్స్‌కు చేరుతోంది. నేతల విమర్శల వాడి కూడా పెరుగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో కేవలం మాటలతోనే కాకుండా చేతల్లో కూడా ప్రత్యర్థుల్ని బలహీనపరిచే వ్యూహాలను అమలు చేస్తున్నాయి పార్టీలు. ఆ క్రమంలోనే ఆయా పార్టీల్లో అసమ్మతి,అసంతృప్త నేతలకు రా.. రమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి. దీంతో పెద్ద నేతల సంగతి ఎలా ఉన్నా…ఓటర్లను నేరుగా ప్రభావితం చేయగల ద్వితీయ శ్రేణికి మాత్రం ఫుల్ డిమాండ్ వచ్చేసిందట. ఆయా నియోజకవర్గాలలో ఉన్న రాజకీయ సమీకరణలను బట్టి.. కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తోందట ద్వితీయ శ్రేణి నాయకత్వం. తమకున్న పలుకుబడి, ఓట్లదన్నును బట్టి గట్టి ప్యాకేజీలే డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కోరుకున్న ఆఫర్ వస్తే.. ఇక వెనకా ముందూ చూడకుండా రాత్రికి రాత్రే కండువాలు మార్చేస్తున్నారట కొందరు లోకల్ లీడర్స్. ప్రధానంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన సర్పంచ్ లు, ఎంపిటిసి,జెడ్పీటీసీలు , మున్సిపల్ కౌన్సిలర్ లు, కార్పొరేటర్స్ ఈ లిస్ట్‌లో ఉన్నట్టు తెలిసింది. తర్వాతి సంగతి తర్వాత చూసుకుందాం.. ముందైతే మంచి ప్యాకేజీ వస్తే మొహమాటం లేకుండా మారిపోదాం అన్నట్టుగా ఉందట వ్యవహారం.
Read Also: South Central Railway: విజయవాడ డివిజన్‌లో భారీగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
స్థానిక నేతలు ఆకస్మికంగా కండువాలు మార్చడం వెనక పెద్ద మొత్తంలోనే డబ్బు చేతులు మారుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నా… ప్రధానంగా అధికార పార్టీ అభ్యర్థులకు ఇబ్బంది ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. నిన్నటిదాకా తన వెనక తిరిగిన ఛోటా నాయకుడు ఇవాళ కండువా మార్చేసి వేరే పార్టీ కండువాతో కొత్త కారులో కనిపిస్తుండటంతో అవాక్కవుకున్నారట. నియోజకవర్గాల్లో కొత్త కార్లు రయ్ రయ్‌మనిని తిరగడానికి, పార్టీల మార్పులకు ఏదైనా సంబంధం ఉందా అని చెవులు కొరుక్కుంటున్నారట ఈ తతంగాన్ని చూస్తున్నవారు. ఈ పరిస్థితుల్లో… పోలింగ్ తేదీదాకా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కాపాడుకోవడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తోందట అభ్యర్థులు. పార్టీలకు సంబంధించిన కీలక సమావేశాలు ఉంటే…మన వాళ్ళు ఎవరైనా అటు వైపు వెళ్తున్నారా అని నిఘా పెట్టడంతోనే సరిపోతోందట కొందరు అభ్యర్థులకు. మొత్తంగా చూస్తే….అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులకు వణుకు పుట్టిస్తున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. ఈ కండువాల మార్పిడి కార్యక్రమం ఎవరికి లాభిస్తుందో… ఎవరి ఓట్ బ్యాంక్‌కు చిల్లు పెడుతుందో తెలియాలంటే నెలాఖరుదాకా ఆగాల్సిందే.