Site icon NTV Telugu

Off The Record: ఎస్.కోట టీడీపీలో మూడు గ్రూపుల మంట..

Otr S Kotha Tdp

Otr S Kotha Tdp

Off The Record: విజయనగరం జిల్లా శృంగవరపుకోట టీడీపీలో ప్రస్తుతం మూడు ప్రధాన వర్గాలు మంట పెడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి, మరోవైపు గొంప కృష్ణ, ఇంకోవైపు ఇటీవల పార్టీలో చేరిన ఇందుకూరి సుబ్బలక్ష్మి వర్గాలు… ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. ఒకప్పుడు రెండు వర్గాలకే పరిమితమైన రాజకీయ సమీకరణాలు ఇప్పుడు మూడవడంతో… పార్టీ కేడర్‌లో కూడా గందరగోళం పెరిగిపోతోందంటున్నారు. పార్టీ కార్యక్రమాలైనా, ఇతర సమావేశాలైనా ఎవరికి వారే… నిర్వహించుకుంటూ… విభజనను క్లియర్‌ కట్‌గా చెప్పేస్తున్నారు. అంతకు ముందు రెండు గ్రూపులు ఉన్నా…. పెద్దగా సమస్యలు రాలేదని, ఇందుకూరి సుబ్బలక్ష్మి పార్టీలో చేరాకనే సమీకరణలు పూర్తిగా మారిపోయాయని చెప్పుకుంటున్నారు. ఆమె ఎమ్మెల్సీ రఘురాజు భార్య కావడంతో విమర్శలకు ప్రాధాన్యం పెరిగింది. రఘురాజు వైసీపీ తరపునే ఎమ్మెల్సీ అయినా… తర్వాతి పరిణామాలతో ఆయన మా సభ్యుడు కాదంటూ ప్రకటించింది ఫ్యాన్‌ పార్టీ. ఈ క్రమంలో ఆయన కొత్త రాజకీయ వేదిక కోసం ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది నియోజకవర్గంలో. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ అనుచరులను పదవుల్లో స్థిరపరచుకోవాలని ప్రతి వర్గం ప్రయత్నిస్తుండటం పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది. రఘురాజును ఎలాగైనా టీడీపీలోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో జరుగుతున్న ప్రయత్నాలే సమస్యల్ని పెంచుతున్నాయన్న వాదన సైతం బలపడుతోంది.

ఇదే సమయంలో జిందాల్ బాధిత రైతుల సమస్య కూడా రాజకీయ రంగు పులుముకుంది. అసలైన రైతులు ఎవరనే ప్రశ్నను లేవనెత్తుతూ… వాళ్ళకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతోంది ఓ వర్గం. ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకునేందుకు రఘురాజు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కావాలనే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి తాను రాజకీయంగా లాభపడాలనే వ్యూహంతో ఆయన ఉన్నారన్న చర్చలు నడుస్తున్నాయి. ఎమ్మెల్సీ వెనకుండి కొంతమందిని ప్రోత్సహిస్తూ… సమస్యను జటిలం చేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. గొంప కృష్ణ, సుబ్బలక్ష్మి వర్గాల మధ్య గ్యాప్ పెరిగితే అది తమకే లాభమన్న లెక్కల్లో ఉన్నారట ఎమ్మెల్యే. ప్రత్యేకంగా శృంగవరపుకోట మండలంపై మూడు వర్గాలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మండలంలో ఆధిపత్యం సాధిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక స్థానాలు దక్కే అవకాశం ఉంది. అందుకే ఎవ్వరూ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ అంతర్గత పోరు కూడా… అదే స్థాయిలో కొనసాగుతోందని..

ఇది ఇలాగే కొనసాగితే…. ఈ ప్రభావం రేపు స్థానిక ఎన్నికలపై పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఒకవైపు కొత్త సమీకరణలు, మరోవైపు పాత విభేదాలు… మధ్యలో స్థానిక సమస్యలు ఇవన్నీ కలిపి శృంగవరపుకోట రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నాయి. ప్రస్తుతం అందరి చూపు ఒకటే ప్రశ్న. మూడు గ్రూపుల మధ్య జరుగుతున్న ఈ అంతర్గత పోరు పార్టీని ఎటువైపు తీసుకువెళ్తుందన్నదే. చివరికి ఎవరి వ్యూహం ఫలిస్తుంది, పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుంటుందా.. లేక స్థానిక నాయకులే పరిష్కారం చూసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి శృంగవరపుకోట టీడీపీలో వర్గపోరు మాత్రం పీక్స్‌కి చేరింది. దీని ప్రభావం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎంత మేరకు పడుతుందన్నది చూడాలి.

Exit mobile version