NTV Telugu Site icon

Off The Record: మూడో విడత రుణమాఫీపై విస్తృత చర్చ.. రేవంత్ సర్కార్ మాట నిలబెట్టుకుంటుందా..?

Rythu Runa Mafi

Rythu Runa Mafi

Off The Record: తెలంగాణలో రైతు రుణమాఫీ రెండు విడతలు పూర్తయింది. మరి మూడో విడత ఎప్పుడు? ప్రభుత్వం చెప్పిన డెడ్‌లైన్‌ దగ్గర పడుతోంది. కానీ… మూడో విడతకు సంబంధించిన సంకేతాలు పెద్దగా కనిపించడంలేదు… అలా ఎందుకన్న చర్చ మొదలైంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. అటు రైతాంగం కూడా ఫుల్‌ అండ్‌ ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ ఎప్పుడంటూ ఆసక్తిగా చూస్తోంది. అదే సమయంలో ఏ చిన్న తేడా జరిగినా… ప్రభుత్వాన్ని కార్నర్‌ చేసేందుకు కాచుక్కూర్చున్నాయి ప్రతిపక్షాలు. దీంతో రెండు లక్షల రూపాయల లోపు జరగాల్సిన మూడో విడత మాఫీ కోసం ఉత్కంఠగా చూస్తున్నారు అంతా. మొదటి రెండు విడతల్ని పెద్దగా గ్యాప్‌ తీసుకోకుండా వేగంగా అమలు చేసిన ప్రభుత్వం…ఈసారి మాత్రం టైం తీసుకోవడంతో… ఏం జరుగుతుందోనన్న ఆసక్తి పెరుగుతోంది.

Read Also: Divya Seth Shah : ప్రముఖ టీవీ నటి చిన్న కూతురు హఠాన్మరణం

ఇప్పటివరకు మొదటిగా లక్ష రూపాయలలోపు రుణాలున్న ప్రతి రైతుకి మాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 11లక్షల 34వేల మంది రైతులకు ఆరువేల 34 కోట్ల రుణమాఫీ జరిగింది. ఇక రెండో విడతగా.. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే.. లక్షన్నర లోపు అప్పు ఉన్న రైతులకు మాఫీ చేశారు. ఈ దశలో… 6 లక్షల 40 వేల మంది రైతుల బెనిఫిట్ అయ్యింది. ఇందుకోసం 6వేల 190 కోట్ల నిధులు వెచ్చించారు. ఇక మిగిలింది మూడోది, తుది విడత మాత్రమే. వాస్తవానికి ఆగస్టు 15 లోపు రెండు లక్షల లోపు రుణాలన్నిటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారమే… మొదటి రెండు విడతలు పూర్తయ్యాయి. కానీ… ఈ తుది విడతే ఎక్కువ చర్చనీయాంశం అవుతోంది. లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల రుణాలు ఉన్న రైతుల సంఖ్య తక్కువే అయినా.. నిధులు మాత్రం ఎక్కువ కావాల్సి ఉంటుంది. అదే సమయంలో సీఎం ప్రకటించిన డెడ్‌లైన్‌ టైం కూడా సమీపిస్తోంది.

Read Also: Fraud Case: వీడు మాములోడు కాదు.. 22 ఏళ్లుగా బ్యాంకు అధికారులకు పంగనామాలు

ఇక ఇదే టైంలో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. 11వ తేదీ వరకు ఆయన విదేశీ పర్యటనలోనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో… అనుకున్న టైంకే మూడో విడత మాఫీ జరుగుతుందా లేదా అన్న డౌట్స్‌ వస్తున్నాయట పరిశీలకులకు. ఈనెల 13 నుంచి 15 మధ్యన జరిగే అవకాశం ఉందని ముందంతా ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 15నే కార్యక్రమం ఉంటుందని అన్నారాయన. ఆ దిశగా నిధులు సమకూర్చుకునే కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. మూడో విడతే ఫైనల్‌ కాబట్టి ఆ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకుంటోందట ప్రభుత్వం. ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగ సభ పెట్టి స్వాతంత్ర్య దినోత్సవం రోజునే రెండు లక్షల రూపాయలలోపు బ్యాంక్‌ అప్పుల నుంచి రైతులకు స్వాతంత్ర్యం ఇవ్వాలనుకుంటున్నట్టు చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే… ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మొత్తం మీద రాజకీయ సవాళ్ళు, ప్రతి సవాళ్ళకు వేదికగా మారిన తెలంగాణ రైతు రుణ మాఫీకి ఆగస్ట్‌ 15తో ఒక సానుకూల ముగింపు వచ్చే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. అయితే ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా మారతాయన్న ఆసక్తి పెరుగుతోంది కొన్ని వర్గాల్లో. ఈ విషయమై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు పేలిన క్రమంలో ఫైనల్ రియాక్షన్స్‌ కోసం ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.