Off The Record: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు బీఆర్‌ఎస్ నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ రాని వారు, టిక్కెట్ దక్కించుకున్నా… ఓడిపోయిన వాళ్లు ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నారట. ఈసారి తమకు గులాబీ బీ ఫామ్ దక్కుతుందో..లేదోనన్న అనుమానంతో పార్టీలో ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి సిట్టింగ్‌లకే సీట్లన్న మాట గట్టిగానే వినిపిస్తుండటంతో… ఎన్నికల దాకా అంటిపెట్టుకుని ఉన్నా… ఉపయోగం ఉండదన్న అంచనాతో పక్క చూపులు చూస్తున్నారట కొందరు బీఆర్‌ఎస్ నేతలు. దీనికి తోడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు అంతా తామై నియోజకవర్గాల్లో పర్యటించడంతో పాటు ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టినట్లు అంతా భావిస్తున్నారు. అందుకే ఆశావహులు వేరేదారి చూసుకుంటున్నట్టు తెలిసింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలువురు మాజీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరే ప్రయత్నాల్లో ఉన్నారట. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గత ఎన్నికల టైం నుంచి అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా టీ కాంగ్రెస్ నేతలు ఆయన్ను సంప్రదించడంతో పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మల్లారెడ్డి మరోసారి టిక్కెట్ తనకేనని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని సుధీర్ రెడ్డిపై ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరోవైపు మహేశ్వరం నియోజకవర్గంలో రెండు గ్రూపులు అధికార పార్టీలో ఉన్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్గం, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వర్గంగా కార్యకర్తలు విడిపోయారు. సబిత కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి తీగల పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈసారి మహేశ్వరం టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ మారేందుకు సిద్ధమని ఇటీవల అధిష్టానానికి హెచ్చరికలు పంపారు తీగల.
ఇక ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన పార్టీ సీనియర్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి అలానే ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో అంతంత మాత్రంగానే పాల్గొంటున్నారాయన. సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే చంద్రశేఖర్‌రెడ్డి ఇతర పార్టీల వైపు చూస్తున్నట్టు తెలిసింది. మరోవైపు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేనుందుకు రెడీ అయ్యారు. 2018 ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉన్న రత్నం ఈసారి బీఫామ్ తనకే వస్తుందని మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. కానీ.. మరోసారి టిక్కెట్ తనకే ఇస్తారని సిట్టింగ్ ఎమ్మెల్యే యాదయ్య ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవేళ చేవెళ్ళ బీఆర్‌ఎస్ టిక్కెట్ దక్కకుంటే…ఇతర పార్టీలు పిలిచి టిక్కెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని కేఎస్ రత్నం తన అనుచరులకు చెబుతున్నారట.
అధికార పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో… ప్రతిపక్షాలు వారికి గాలం వేస్తున్నాయట. కానీ ప్రతిపక్షాల పేరు చెప్పి సొంత పార్టీని బ్లాక్ మెయిల్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలన్న చర్చ బీఆర్‌ఎస్‌లో జరుగుతోంది. మరి టిక్కెట్ల ఖరారు టైంకి ఎవరు ఏ పార్టీలో ఉంటారో చూడాలి.
