Site icon NTV Telugu

Off The Record: రాజమండ్రి టీడీపీ ఎంపీ టికెట్ ఎవరికి..? సీన్‌ మారిందా?

Rajahmundry

Rajahmundry

Off The Record: ఇన్నాళ్ళూ… ఎవరు బాబూ…. ఎవరని భూతద్దం వేసి వెదికినా…. రాజమండ్రి టీడీపీ లోక్‌సభ సీటు కోసం ఎవరూ కనిపించలేదట. కానీ… ఇప్పుడు ఏకంగా ఇద్దరు పోటీ పడుతున్నారు. మహానాడు వేదికగా ఇద్దరూ ముందుకు వచ్చి ఈసారి రేసులో నేనున్నానంటే…నేనున్నానని ప్రచారం చేసుకున్నారు. వీరిలో ఒకరు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లోహిత్ శిష్టా కాగా మరొకరు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకట రమణ చౌదరి. వీరిద్దరి వ్యవహారశైలి ఇప్పుడు రాజమండ్రి పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. కులాలు, ప్లస్‌లు, మైనస్‌ల లెక్కలు వేస్తూ… ఈసారి ఎవరికి టిక్కెట్‌ రావచ్చో జోస్యాలు చెప్పేవారు కూడా పెరిగిపోయారు.

వాస్తవానికి గడిచిన నాలుగేళ్లుగా రాజమండ్రి ఎంపీ టిక్కెట్ కోసం టీడీపీలో ఆశావాహులు ఒక్కరు కూడా కనిపించ లేదు. గత ఎన్నికల్లో మాజీ ఎంపీ, నటుడు మురళీమోహన్ కోడలు మాగంటి రూప పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మురళీమోహన్ సహా ఆయన కోడలు కూడా రాజమండ్రి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇటీవల మహానాడులో సైతం ఆయనగానీ, ఆ కుటుంబ సభ్యులుగానీ ఎవరూ కనిపించలేదు. మాగంటి రూప మరోసారి పోటీకి దిగే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలోనే టిక్కెట్‌ కోసం ఇద్దరు యువ నాయకులు పోటీ పడటం టీడీపీ వర్గాలకు కూడా కాస్త ఆశ్చర్యంగానే ఉందట. ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న వారిలో ఒకరైన లోహిత్ శిష్టా… కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వ్యాపారవేత్త. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం కోఆర్డినేటర్‌గా ఉన్నారు. రాజమండ్రి నియోజకవర్గంతో లోహిత్‌కు ఎలాంటి సంబంధం లేకున్నా…ఇక్కడ ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నించటం ఆసక్తికరంగా మారింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోహిత్‌ను రాజమండ్రికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారట. గతంలో బ్రాహ్మణుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి నుంచి రెండుసార్లు గెలుపొందటంతో అదే ప్రయోగాన్ని ఈసారి తెలుగుదేశం ఎందుకు చేయకూడదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. లోహిత్‌ కూడా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌కు చెందిన ఇన్ఛార్జ్‌లతో ఇప్పటికే టచ్‌లో ఉన్నారట.

మరోవైపు పార్టీ శ్రేణులు ఊహించని విధంగా పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన బొడ్డు వెంకట రమణ చౌదరి రాజమండ్రి ఎంపీ టిక్కెట్ రేసులోకి వచ్చారు. సీనియర్‌ లీడర్‌ బొడ్డు భాస్కర రామారావు కుమారుడే వెంకట రమణ. నిరుడు టీడీపీలో చేరి ప్రస్తుతం పెద్దాపురం అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారు వెంకటరమణ. అయితే అనూహ్యంగా ఆయన రాజమండ్రి సీన్‌లోకి రావడం వెనక ఆసక్తికరమైన పరిణామం ఉందట. రాజమండ్రి టీడీపీ ఎంపీ టిక్కెట్‌ను కమ్మలకు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మురళీమోహన్‌ వెనక్కి తగ్గాక ఆ కులం నుంచి ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే స్థానికంగా ఉన్న కమ్మ పెద్దలు బొడ్డు వెంకటరమణను ముందుకు తీసుకువచ్చినట్టు చెప్పుకుంటున్నారు. గతంలో బొడ్డు ఇక్కడే పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత ఆయన అస్సలు రాజమండ్రికి టచ్‌లో లేరు. మరోవైపు బ్రాహ్మణులకు టిక్కెట్ ఇవ్వాలనుకోవడం ప్రయోగమే అయినా… ప్రస్తుతం రేసులో ఉన్న లోహిత్ స్థానికేతరుడవడం మైనస్‌ కావచ్చంటున్నారు. అటు వైసీపీ గత ఎన్నికల్లో ఈ టిక్కెట్‌ను బీసీ వర్గాలకు ఇచ్చి చేసిన ప్రయోగం ఫలించింది. ఈసారి కూడా సిట్టింగ్‌ మార్గాని భరత్‌కో, లేక మరో బీసీ నేతకో ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు టీడీపీ కమ్మ, లేదా బ్రాహ్మణులకు ఇచ్చి ఎంతవరకు నెగ్గుకు రాగలదన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఏదేమైనా… ఇన్నాళ్ళు ఎవరూ లేరనుకున్న దగ్గర ఇప్పుడు ఇద్దరు పోటీ పడటం టీడీపీకి కాస్త ఊరట అయితే…ఎన్నికల నాటికి కులాల కూడికలు, తీసివేతలు ఎలా ఉంటాయో చూడాలి.

Exit mobile version