NTV Telugu Site icon

Off The Record: రాజమండ్రి సిటీ టిక్కెట్‌ కోసం టీడీపీలో వార్‌..! జనసేనకు ఇస్తే పరిస్థితేంటి..?

Tdp

Tdp

Off The Record: రాజమండ్రి అర్బన్‌ టిక్కెట్‌ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్‌ టాపిక్‌ అవుతోందట. ఈసారి కూడా సీటు తమ కుటుంబానికే ఖరారు చేశారని ఇటీవల సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేసిన ప్రకటనే ఇందుకు కారణమట. పనిలో పనిగా తన కుమారుడు వాసు ఈసారి పోటీలో ఉంటారని కూడా క్లారిటీ ఇచ్చేశారట ఆయన. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్తే వాసు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారాయన. వాళ్ళు ఎవరైనా.. ఏ పదవిలో ఉన్నా… పార్టీ టిక్కెట్‌ ఖరారు విషయాన్ని అధిష్టానం ప్రకటించాలిగానీ… ఎవరికి వాళ్ళు చెప్పేసుకోవడం ఏంటన్నది ఇప్పుడు రాజమండ్రి టీడీపీలో జరుగుతున్న చర్చ అట. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ టిక్కెట్ కోసం తానూ పోటీలో ఉంటానని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దీంతో ఆదిరెడ్డి, గోరంట్ల ఫ్యామిలీల మధ్య ఈసారి టిక్కెట్‌ వార్‌ తప్పదేమోనన్న అనుమానాలు కేడర్‌లో పెరుగుతున్నాయి. వచ్చే నెలలో టీడీపీ మహానాడు రాజమండ్రిలోనే జరగనుండటంతో… ఈ టిక్కెట్‌ వ్యవహారం ఆసక్తిగా మారిందట.

పార్టీ ఆవిర్భావం నుంచి రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుసగా ఆరు సార్లు పోటీ చేశారు బుచ్చయ్యచౌదరి. 2014లో ఆనూహ్యంగా ఆయన్ని రూరల్ నియోజకవర్గానికి పంపింది అధిష్టానం. ఆ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సిటీ టిక్కెట్ ను బీజేపీకి కేటాయించింది. తర్వాత 2019లో కూడా బుచ్చయ్యను రూరల్‌కే పరిమితం చేసి సిటీ టిక్కెట్‌ను ఆదిరెడ్డి భవానీకి ఇచ్చింది నాయకత్వం. వైసీపీ హవాలో కూడా ఇద్దరూ గెలిచారు. కానీ.. బుచ్చయ్య తన సొంత నియోజకవర్గమైన రాజమండ్రి సిటీని వదులుకోలేకపోతున్నారట. అందుకే ఈసారి ఎలాగైనా తిరిగి అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారట. దీంతో ఈసారి ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పి కాబోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆదిరెడ్డి అప్పారావు చేసిన వ్యాఖ్యలే అందుకు బలమిస్తున్నాయి.
ఎవరెవరో టిక్కెట్ తమదే అంటుంటారనీ… చంద్రబాబు మాత్రం క్లారిటీ ఇచ్చేశారని, ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడినట్టేనని కార్యకర్తలతో చెప్పారట అప్పారావు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో వెంటనే కౌంటర్‌ వేసే బుచ్చయ్య ఈసారి మాత్రం తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారట. పైగా రూరల్‌లో తనపని తాను చేసుకుపోతున్నారట.ఆదిరెడ్డి వాసుని రాజమండ్రి ఎం.పీ అభ్యర్థిగా పోటీ చేయించాలని గతంలో ప్రతిపాదించింది టి.డి.పి అధిష్టానం. అందుకు తాను సుముఖంగాలేనని అప్పట్లో చెప్పారట ఆయన. దీంతో పీటముడి మరింత బిగుసుకుంటోందట.

ప్రస్తుతం బుచ్చయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీకి పట్టు ఉంది. ఒకవేళ పొత్తు కుదిరితే..ఈ సీటును జనసేన ఖచ్చితంగా వదులుకోబోదని అంటున్నారు. అదే జరిగితే గోరంట్లకు టిక్కెట్ ఎక్కడ అనేది ప్రశ్నగా మారింది. అయితే ఈసారి టిక్కెట్‌ తమదేనని ఆదిరెడ్డి ఫ్యామిలీ ప్రకటించుకుంటోంది తప్ప అధినాయకత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు కదా? అన్న ప్రశ్నలు కూడా కేడర్‌లో ఉన్నాయట. గోరంట్లకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఆదిరెడ్డి కుటుంబం విషయంలో ఏకపక్ష నిర్ణయాలు చంద్రబాబు తీసుకోబోరన్న చర్చలు కూడా నడుస్తున్నాయట. మరోవైపు పక్కనే ఉన్న రాజానగరంలో టీడీపీ ఇన్ఛార్జ్‌ లేరు. దీంతో బుచ్చయ్య చౌదరిని అక్కడికి పంపవచ్చన్న ఊహాగానాలు సైతం ఉన్నాయి. మహానాడు టైంకి బుచ్చయ్య చౌదరి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.

Show comments