Off The Record: ఎన్టీఆర్ స్మారక వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అంతా తానై వ్యవహరించారు. ఇదే సందర్భంలో లక్ష్మీపార్వతికి ఆహ్వానం పంపలేదు. దీంతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారామె. పురంధేశ్వరిని రాష్ట్రం నుంచి తరిమి కొడతానంటూ మంగమ్మ శపథం చేశారు. ఇదే సందర్భంలో బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు కుదిర్చేందుకు పురంధేశ్వరి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని.. టీడీపీని బీజేపీకి దగ్గరగా చేయడం ద్వారా తమను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది వైసీపీ ఆగ్రహం. పురంధేశ్వరి టీడీపీ ఏజెంటుగా బీజేపీలో పని చేస్తున్నారనే వాదనను చాలా ఎగ్రెసివ్‌గా తెర మీదకు తెస్తోంది వైసీపీ. ఇక సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతిపరులైతే బీజేపీ అధ్యక్షురాలిని టార్గెట్ చేసుకుని చెలరేగిపోతున్నారు. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
ఇకపై పురంధేశ్వరి వెళ్లే ప్రతి చోటుకూ తాను వెళ్తాను. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ని చేయడంలో చంద్రబాబు కంటే ఎక్కువగా కీలక పాత్ర పోషించింది పురంధేశ్వరే అనే రీతిలో లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్స్‌పై గరం గరం చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు కంటే పురంధేశ్వరే ఆ ఎపిసోడ్‌లో కీలక పాత్ర పోషించారనే రీతిలో మాట్లాడ్డం.. ఆమెను వదిలేదే లేదని ప్రతిజ్ఞ చేయడం చూస్తుంటే.. భవిష్యత్తులో లక్ష్మీ పార్వతి టార్గెట్ పురందేశ్వరేనన్నది రాజకీయ వర్గాల మాట. మరోవైపు వైసీపీ కూడా అదే స్థాయిలో పురంధేశ్వరిని టార్గెట్ చేస్తున్నట్టే కన్పిస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఇలా బాధ్యతలు స్వీకరించారో.. లేదో.. వైసీపీని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే కాకుండా.. కేంద్రానికి వివిధ సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారాలను వైసీపీ కూడా సీరియస్‌గా తీసుకుందట అధికార పక్షం.
ఇక ఇదే సందర్భంలో ఢిల్లీలో జరిగిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి పొలిటికల్ టచ్ వచ్చింది. ఆ టైంలోనే పొత్తుల చర్చ జరిగిందనే ప్రచారం మొదలైంది. ఆ కార్యక్రమంలో చంద్రబాబు-నడ్డా మాట్లాడుకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఆ తర్వాత కూడా జేపీ నడ్డా-చంద్రబాబు మధ్య చిన్న పాటి చాయ్ పే చర్చ జరిగింది. దీంతో బీజేపీ – టీడీపీ దగ్గర అవుతున్నాయా..? అనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలను కలిపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షురాలి హోదాలో పురంధేశ్వరి ట్రయల్స్ కూడా చాలా వరకు సఫలమైనట్టే కన్పిస్తున్నాయనేది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ టాక్. దీనికి తగ్గట్టే ఢిల్లీలో చంద్రబాబు మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్‌లో కూడా బీజేపీకి తాను వ్యతిరేకం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టార్గెట్‌గా పొత్తుల రాజకీయం తెర లేస్తోందనే భావన బలంగా వ్యక్తమవుతోందంటున్నారు. దీనికి పురంధేశ్వరి కీలక పాత్ర పోషిస్తున్న క్రమంలో ఆమెను ఇప్పటి నుంచే టార్గెట్ చేసుకోవాలని వైసీపీ భావిస్తున్నట్టుగా కన్పిస్తోంది. మరోవైపు లక్ష్మీ పార్వతి పురంధేశ్వరిని టార్గెట్ చేస్తోన్నా.. బీజేపీ నుంచి ఎవ్వరూ పెద్దగా రియాక్ట్ కాలేదు. ఆమెను మరింత టార్గెట్ చేస్తే ఒంటరి అవుతారా..? లేక పార్టీ నుంచి ఏమైనా సహకారం ఉంటుందా..? అన్న చర్చ మొదలైంది.
