Site icon NTV Telugu

Off The Record: బీజేపీలో లీడర్ వర్సెస్ కేడర్.. అధ్యక్షుడు సై అంటే కేడర్ నై అంటోందా ?

Nlg Bjp

Nlg Bjp

Off The Record: నల్లగొండ నియోజకవర్గ కమలం పార్టీలో…. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వన్‌మేన్‌ షో చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదీకూడా.. వాళ్ళు వీళ్ళు కాకుండా… డైరెక్ట్‌గా పార్టీ కేడరే అలా మాట్లాడుకుంటోందన్న వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా నల్లగొండ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రారంభ పూజా కార్యక్రమం రచ్చ కూడా ఇందులో భాగమేనంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేదిక మీద ఉండగానే.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చేసిన రచ్చ, జరిగిన రసాభాస, ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం లాంటి ఘటనలు ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. వర్షిత్‌రెడ్డి వ్యవహరించిన తీరు వల్లే శాంతియుతంగా జరగాల్సిన కార్యక్రమంలో రచ్చ జరిగిందన్నది కమలం పార్టీ ఇంటర్నల్‌ టాక్‌. ఒక హోదాలో ఉన్న నాయకుడికి ఎక్కడ తగ్గాలో, దేన్ని వివాదాస్పదం చేయాలో తెలియకుంటే ఎలాగని బీజేపీ శ్రేణులే మాట్లాడుకుంటున్నాయట.ఆయన దూకుడు కారణంగానే… వేదిక దగ్గరే ఉన్నప్పటికీ… కమలం కేడర్‌ జిల్లా అధ్యక్షుడికి అండగా నిలబడలేకపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఇదంతా ఓవైపు జరుగుతుండగా… బీఆర్ఎస్ నేత, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.. బీజేపీ జిల్లా అధ్యక్షుడికి మద్దతు పలకడం, ఆయన కోసం నిరసనకు దిగడం, గొడవ సద్దుమణిగాక ఇద్దరూ కలిసి గణేష్ పూజా కార్యక్రమాలు నిర్వహించడం రాజకీయ కలకలం రేపుతోంది. అది చూసి విస్తుపోవడం కమలం పార్టీ కార్యకర్తల వంతైందట. ఇదెక్కడి కాంబినేషన్ అంటూ షాకవుతున్నారట.

Read Also: Off The Record: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో ఎంత మంది సేఫ్ జోన్ లో ఉన్నారు..?

ఇవన్నీ తాజా ఘటనలు కాగా… కొంత కాలం నుంచి నాగం వర్షిత్‌రెడ్డి వ్యవహారశైలితో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలపై కూడా సీనియర్ లీడర్స్‌, వారి అనుచరగణం పెద్దగా ఆసక్తి చూపడంలేదట.. సీనియర్లకు ప్రాధ్యానత ఇవ్వకపోవడం, పార్టీలో సామాజిక సమీకరణలు పాటించకపోవడం, కీలక నేతల పర్యటనల సమయంలో వేదికల మీద ప్రోటోకాల్ పాటించకపోవడం, అంతా తానే అన్నట్టు వ్యవహరించడం లాంటి కారణాలతో ఆయన్ను కొందరు నేతలు గట్టిగానే వ్యతిరేకిస్తున్నారట. అసలు వర్షిత్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే… కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు వర్గాల మధ్య సయోధ్య కోసం నల్గొండ నుంచి హైదరాబాద్‌ మీదుగా ఢిల్లీదాకా వెళ్ళినా… ప్రయోజనం లేకపోగా…. అసంతృప్త నేతల మీద పైచేయి కోసం జిల్లా అధ్యక్షుడు చేస్తున్న విన్యాసాలు వికటించి పార్టీని కూడా ఇరకాటంలో పడేస్తున్నాయట. ఈ పరిస్థితుల్లో… ఇటీవల నల్గొండ బీజేపీలో నోటితో మాట్లాడుకుంటూ నొసటితో వెక్కిరించుకోవడాలు పెరిగిపోయాయి. కార్యక్రమం ఏదైనా సరే… జిల్లా అధ్యక్షుడు సై అంటే.. సీనియర్‌ నేతలు మరో ఆలోచన లేకుండా నై అంటున్నారట. ఈమధ్య అది పీక్స్‌కు చేరడంతో… బీజేపీ కార్యక్రమాలు కొన్ని అంతర్గత రచ్చకు, మరికొన్ని బహిరంగ అసంత్రుప్తికి కారణం అవుతున్నాయంటున్నారు. సామాజిక సమీకరణలు, పార్టీ సీనియర్స్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి కారణాలతో పార్టీలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నట్టు తెలుస్తోంది. ఇక కొందరు నేతలను పొమ్మనలేక పొగబెట్టే ప్రోగ్రామ్‌ కూడా రొటీన్‌ అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా అందరూ విడివిడిగా.. నల్గొండలో పార్టీని డ్యామేజ్‌ చేస్తున్నారని అంటున్నారు పార్టీ కార్యకర్తలు. పెద్దలు జోక్యం చేసుకోకుంటే… ఇప్పుడు ఓ మాదిరిగా ఉన్న బలాన్ని కూడా పూర్తిగా పోగొట్టుకోవాల్సి వస్తుందని సొంత కేడరే హెచ్చరిస్తోంది.

Exit mobile version