NTV Telugu Site icon

Off The Record: రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ ఇంకా తగ్గలేదా..? తమిళిసై నెక్స్ట్ స్టెప్ ఏంటి ?

Rajbhavan

Rajbhavan

Off The Record: ప్యాచ్‌వర్క్‌ పూర్తిగా జరగలేదా? ఆ మాటకొస్తే.. అసలా ప్రయత్నమే లేదా? అంతరాల్లోని అగాధాలను అలాగే ఉంచుకుని తెలంగాణలోని రెండు పవర్‌ సెంటర్స్‌ సందర్భం వచ్చినప్పుడు పై పూతతో కవర్‌ చేసుకుంటున్నాయా? అంటే.. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను చూసి గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిరిందని అనుకున్నారు అంతా. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గవర్నర్ తో కలిసి స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్‌. ఇటు చీఫ్ జస్టిస్ పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం కోసం రాజ్ భవన్‌కు కూడా వెళ్లారు. రెండూ ప్రోటోకాల్‌ ప్రోగ్రామ్సే అయినా… ఆ సందర్భంగా గవర్నర్ , సిఎం మాట్లాడుకున్నారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అది చూసి వాతావరణం చల్లబడుతోందనుకున్న వాళ్లకు తాజాగా కొత్త డౌట్స్‌ వస్తున్నాయట.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తాజాగా గవర్నర్‌కు పంపింది కేబినెట్‌. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను జులై 30న జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపింది సర్కార్‌. 15 రోజులు అవుతున్నా.. ఆ పేర్లకు ఇంతవరకు ఆమోద ముద్ర పడలేదు. అటు గతంలో తిప్పి పంపిన 4 బిల్లులతో పాటు మరో 8 బిల్లులను గవర్నర్‌కు పంపింది ప్రభుత్వం.దీంతో ఇప్పుడు మొత్తం 12 బిల్లులు, రెండు ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్‌ ఏం చేస్తారన్న విషయమై ఉత్కంఠ పెరుగుతోంది. అంతకుముందున్న అంతరాలు తొలిగిపోయి సాధారణ పరిస్థితులు వచ్చి ఉంటే.. బిల్లుల ఆమోదం విషయంలో ఇంత జాప్యం జరగదని, వాతావరణం చూస్తుంటే.. మేటర్‌ మళ్ళీ మొదటికి వచ్చిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు.

గతంలో గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర క్యాబినెట్ ప్రతిపాదించడం, దాన్ని గవర్నర్‌ తిరస్కరించడం, తర్వాత మధుసూదనాచారికి ఓకే చెప్పడం లాంటి పరిణామాలతో పాటు పెండింగ్‌ బిల్లుల విషయంలో కూడా రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య మాటల తూటాలు పేలాయి. బిల్లుల విషయంలో సుప్రీం కోర్ట్‌దాకా వెళ్ళింది కేసీఆర్‌ సర్కార్‌. ఈ పరిస్థితుల్లో తాజా బిల్లులు, ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్ల విషయంలో గవర్నర్‌ వైఖరి ఎలా ఉంటుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో వాటిని గవర్నర్‌ ఇంకా పెండింగ్‌ పెట్టి నానుస్తారా? లేక తేల్చేసి వివాదానికి చెక్‌ పెడతారా అని చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఈ విడతతో ఎవరేంటో తేలిపోతుందని కూడా అంటున్నాయి.

రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ ఇంకా తగ్గలేదా ? తమిళిసై నెక్స్ట్ స్టెప్ ఏంటి ? | OTR | Ntv