Off The Record: పవన్ కళ్యాణ్ చేసే కామెంట్స్.. మాట్లాడే మాటలు సహజంగానే సంచలనం అవుతుంటాయి. రాత్రికి రాత్రే పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతాయా అన్న రేంజ్‌లో వాటి మీద చర్చ కూడా జరుగుతుంటుంది. అయితే ఈసారి మాత్రం ఆయన మాటలు రాజకీయ దుమారంతోపాటు.. అధికార పార్టీ రోడ్డెక్కి ఆందోళనలు చేసేదాకా తీసుకువచ్చాయి. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు, వాలంటీర్లకు లింకు పెడుతూ జనసేనాని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ పాలిటికల్ సర్కిల్స్‌లో కాక రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు, మహిళా కమిషన్ నుంచి నోటీసులు.. ఇలా ఒకటేమిటి.. ఏ యాంగిల్ దొరికితే ఆ యాంగిల్ పవన్‌ని టార్గెట్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు వైసీపీ నాయకులు, వాలంటీర్లు. పవన్ రాజకీయాల్లోకి వచ్చాక తొలిసారి ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రోగ్రాం తీసుకుంది అధికార పార్టీ. అంటే… ఆ మాటల ప్రకంపనలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు.
తన మాటలతో అవతలి పక్షాలను డిఫెన్సులో పడేయడమే తప్ప.. ఇప్పటి వరకు పవన్ డిఫెన్సులో పడిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. కానీ ఇప్పుడు వాలంటీర్లను ఉద్దేశించి చేసిన కామెంట్లు పవన్ను.. జనసేనను ఇరకాటంలోకి నెడుతున్నట్టుగా కనిపిస్తోందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆ వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశ్యం ఏదైనా… ఇప్పుడు ఆ కామెంట్స్‌ను ఆధారం చేసుకుని పవన్ టార్గెట్‌గా జరుగుతున్న ఆందోళనలతో రాజకీయం రంజుగా మారింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్లినట్టుగానే కన్పిస్తోంది. అయితే ఇదే సందర్భంలో జనసేన వర్గాలు.. ప్రతిపక్ష పార్టీలు వాదన.. ఆ పార్టీల్లో జరుగుతున్న చర్చ మరోలా ఉందట. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. వాలంటీర్ల వ్యవస్థను అధికార పార్టీ రాజకీయ అవసరాలకు వినియోగించుకుంటోందని, అయితే వీరి సంఖ్య భారీ ఎత్తున ఉండడం.. నేరుగా ప్రజలతో సంబంధాలు ఉన్న కారణంగా ఆచితూచి మాట్లాడితే బాగుండేదన్నది వారి అభిప్రాయం అట.
ఈ పరిస్థితుల్లో వాలంటీర్లను కానీ..ఆ వ్యవస్థను కానీ ఏదైనా అనాలంటే…అందరూ సెన్సిటివ్‌గా ఫీలవుతున్నారని, అలాంటి భయాన్ని జనసేన తీసేయగలిగిందన్న మరో చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోందట. లాభ నష్టాల సంగతి పక్కనబెడితే… వైసీపీకి అండగా ఉండే ఓ వ్యవస్థ గురించి ప్రజల్లో చర్చ లేవనెత్తడంలో మాత్రం తాము సక్సెస్ అయ్యాయమని అంటున్నాయట జనసేన వర్గాలు. అక్కడితో ఆగకుండా ఈ అంశంపై కోర్టుకెళ్తామని పవన్ స్పష్టం చేశారంటే.. వలంటీర్ల వ్యవస్థపై ఓ రకంగా ఆయన యుద్ధం ప్రకటించారనే భావించాలంటున్నాయి జనసేన వర్గాలు. మరోవైపు వైసీపీ మాత్రం పవన్ తమ చేతికి గట్టిగానే చిక్కినట్టు ఫీలవుతోందట. ఆ వ్యాఖ్యల వేడి తగ్గనవీయకుండా ధర్నాలు, ఇతరత్రా ఆందోళనలతో జనసేన అధ్యక్షుడి కేరక్టర్ గురించి జనంలో చర్చ పెట్టాలనుకుంటున్నట్టు తెలిసింది.
గతంలో టీడీపీ ప్రభుత్వం మీద వైసీపీ ఎలాంటి ఆరోపణలు చేసిందో.. ఇప్పుడు పవన్ కూడా అదే రూట్లో మాట్లాడుతున్నట్టు మరో వాదన కూడా ఉంది. నాడు ప్రజా సాధికారిక సర్వే పేరుతో సేకరించిన సమాచారాన్ని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలపైనే డేటా చోరీ కేసు నమోదైందని, ఇప్పుడు కూడా వాలంటీర్ల ద్వారా ప్రజల సున్నిత సమాచారం చోరీ చేస్తున్నారన్నది జనసేన వాదన అట. ఏదేమైనా.. ఈ వ్యవహారం రేపిన రాజకీయ దుమారం మాత్రం ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. దీనిమీద వైసీపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో తమ వైపు నుంచి కౌంటర్లు కూడా సిద్ధం చేసుకుంటోందట జనసేన.
