Off The Record: ఈ నెల 18న ఎన్డీఏ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ ఒక్క తాటి మీదకు వచ్చే ప్రయత్నం చేస్తూ వరుస మీటింగ్‌లు పెట్టుకుంటున్నాయి. బీజేపీకి దగ్గరయ్యేందుకు ఏ పార్టీ సిద్దంగా లేదనే భావన వ్యక్తమవుతోన్న తరుణంలో గతంలో మిత్రపక్షాలుగా ఉన్న వారిని స్టీరింగ్ కమిటీ సమావేశాలకు ఆహ్వానిస్తున్నారనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ క్రమంలో పాత మిత్రులైన టీడీపీని పిలిచారా..? పిలిస్తే టీడీపీ వెళ్తుందా..? వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే చర్చ జరిగింది. ఆ తర్వాత టీడీపీకి ఎలాంటి ఆహ్వానం లేదనే క్లారిటీ వచ్చింది. తెలుగుదేశం సంగతి సరే… మిత్రపక్షంగా ఉన్న జనసేనకు ఆహ్వానం వచ్చిందా..? లేదా..? అన్న చర్చే ఇప్పుడు ఎక్కువగా జరుగుతోంది.
2014లో టీడీపీతో కలిసి జనసేన కూడా బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో జనసేన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఇక 2019 ఎన్నికల తర్వాత తిరిగి బీజేపీతో మళ్లీ జత కట్టింది జనసేన. అయితే గతంలో 2014-19 మధ్య కాలంలో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న సమయంలో కానీ.. 2019 ఎన్నికల తర్వాత తిరిగి బీజేపీ పంచన చేరిన తర్వాత కానీ ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి జనసేన హాజరైన సందర్భాలు చాలా తక్కువ. 2014-19 మధ్య కాలంలో ఎన్డీఏ మిత్రపక్షాల తొలి సమావేశానికి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం ఉంది. ఆయన వెళ్ళారు కూడా. ఈ క్రమంలో త్వరలో జరగబోయే ఎన్డీఏ మిత్రపక్షాల భేటీకి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందిందా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. ఇటు బీజేపీ వర్గాల్లో కానీ.. అటు జనసేన వర్గాల్లో కానీ ఈ విషయాన్ని ఎవ్వరూ అధికారికంగా ధృవీకరించకున్నా.. ఆ వర్గాల నుంచి వస్తోన్నసమాచారం మేరకు ఇప్పటి వరకైతే ఎలాంటి ఆహ్వానం లేదట. దీంతో 18వ తేదీ మీటింగ్‌కి మిత్రపక్షంగా ఉన్న జనసేన వెళ్తుందా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు అధికారంలో ఉన్న భాగస్వాములనే ఎన్డీఏ సమావేశాలకు ఆహ్వానిస్తారని అంటున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు. ప్రస్తుతం జనసేనకు ఎంపీలు లేరు. అధికా భాగస్వామి కాదు. దీంతో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి ఆహ్వానం ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. అయితే… కేవలం చట్టసభల్లో మద్దతు కోసమో.. పార్లమెంట్ వ్యవహారాల కోసమో కాకుండా.. జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సమావేశం పెట్టారు కాబట్టి.. జనసేనను ఆహ్వానిస్తారేమోననే భావన కూడా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీకి ఊపు రావాలంటే పవన్ కళ్యాణ్‌ను ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి ఆహ్వానిస్తేనే బాగుంటుందనేది బీజేపీ ఏపీ నేతల అభిప్రాయంగా ఉంది. త్వరలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టి.. పవన్ కళ్యాణ్‌ను ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి ఆహ్వానం పంపాలని బీజేపీ హైకమాండ్‌కు కొత్త చీఫ్ ద్వారా ప్రతిపాదన పెట్టిద్దామనే చర్చ ఏపీ బీజేపీలో జరుగుతోందట.
ఇదే క్రమంలో మరో చర్చా జరుగుతోంది. గతంతో పోల్చుకుంటే పవన్ ఈ మధ్య కాలంలో పదే పదే కేంద్రం పేరు ప్రస్తావించడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. తాజాగా వలంటీర్ల విషయంలో కూడా పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ…. కేంద్ర నిఘా వర్గాల నుంచి నాకు సమాచారం వచ్చిందని అన్నారు. బీజేపీని.. కేంద్రాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చూస్తుంటే చివరి నిమిషంలోనైనా పవన్‌కు ఆహ్వానం అందుతుందన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. తాము కోరుకున్న విధంగా పవన్‌కు ఆహ్వానం అందితే.. తాము ఏపీలో ఉనికి చాటుకోవడానికి అవకాశం లభిస్తుందనేది బీజేపీ ఆశగా కన్పిస్తోంది.
